iDreamPost

కాసేపట్లో హైపర్ కమిటీ సమావేశం

కాసేపట్లో హైపర్ కమిటీ సమావేశం

ఈరోజు విజయావాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఆర్టీసీ హౌస్ లో కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపర్ కమిటీ 3 వ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ భేటీకి పది మంది మంత్రులతో పాటు ప్రభుత్వంలోని ఆరుగురు కీలక అధికారులు కూడా హాజరవనున్నారు. సి.యస్ నీలం సహానీ కన్వీనర్ గా జరుగుతున్న ఈ భేటీలో ముఖ్యంగా రాజధాని తరలింపు నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలపై హైపర్ కమిటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దీనితో పాటు రాజధాని పరిధిలోని తాడేపల్లి మంగళగిరి లోని గ్రామాలని కలిపి కార్పొరేషన్ గా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ఈ హైపర్ కమిటీ పరిశీలించనుంది.

అయితే నూతనంగా కార్పొరేషన్ ఏర్పాటు చెయ్యాలంటే ఆ ప్రతిపాదిత ప్రాంతం పరిధిలో కనీసం ఐదు లక్షల జనాభా ఉండాల్సి ఉంటుంది. దీనితో మంగళగిరి తో కలిపి రాజధాని పరిధిలో ఎన్ని గ్రామాలని కలపాలి అనే దానిపై ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. దీనితో పాటుగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజధాని పరిధిలో 29 గ్రామాల్లో శాంతి భద్రతల సమస్యల దృష్యా ప్రస్తుతానికి ఎన్నికలను వాయిదా వెయ్యాలని కోరుతూ పంచాయితీ రాజ్ శాఖా ఉన్నతాధికారి ద్వివేది ఎన్నికల కమిషన్ కి లేఖ రాసిన తరుణంలో ఎన్నికల సంఘం తీసుకోబోయే నిర్ణయం పై హైపర్ కమిటీలో చర్చించే అవకాశం వుంది.

అధికార వికేంధ్రీకరణ తోనే రాష్టంలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఇప్పటికే ప్రభుత్వం నియమించిన జియన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చిన నేపథ్యంలో ఆ రెండు రిపోర్టులపై ఈ సమావేశంలో పూర్తిస్థాయిలో సమగ్రంగా అధ్యయనం చెయ్యనున్నారు. బహుశా ఈ సమావేశం తర్వాత ఇంకొక్కసారి చివరిగా హాపర్ కమిటీ సమావేశం నిర్వహించి ఈ హాపర్ కమిటీ అధ్యయనం తాలూకు తుది నివేదికని ఈ నెల 18 లోపు ప్రభుత్వానికి సమర్పించి 18 న జరగనున్న కేబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం హైపర్ కమిటీ సిఫార్సులను ఆమోదించే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి