iDreamPost

ఒకే టైటిల్ కోసం స్టార్స్ ఫైట్ – Nostalgia

ఒకే టైటిల్ కోసం స్టార్స్ ఫైట్ – Nostalgia

ఏదైనా సినిమాకు కంటెంట్ ఎంత ముఖ్యమో టైటిల్ కూడా అంతే కీలక పాత్ర పోషిస్తుంది. జనం దాని గురించి మాట్లాడుకోవాలి అంటే పేరుకున్న ప్రాధాన్యం చిన్నది కాదు. అందులోనూ స్టార్ హీరోల ఇమేజ్ , మార్కెట్ లెక్కలు తదితరాలు చాలా ఉంటాయి కాబట్టి డిసైడ్ చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఒక్కోసారి ఒకే టైటిల్ కోసం ఇద్దరు ముగ్గురు హీరోలు పోటీ పడటం కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒకరు రాజీ పడటమో లేదా టైటిల్ ముందు హీరో పేరు తగిలించి మేనేజ్ చేయడమో చేస్తారు. అలాంటివి ఆసక్తికరంగానూ ఉంటాయి.

1987లో సూపర్ స్టార్ కృష్ణగారి అబ్బాయి రమేష్ బాబుని హీరోగా లాంచ్ చేస్తూ వి మధుసూదనరావు దర్శకత్వంలో పద్మాలయ బ్యానర్ లో ఓ భారీ చిత్రం నిర్మించారు. దానికి సామ్రాట్ అనే టైటిల్ అనౌన్స్ చేస్తూ ప్రకటనలు కూడా ఇచ్చారు. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన సినిమాకు సైతం ఇదే టైటిల్ పెట్టారు. దానికి కె రాఘవేంద్రరావు దర్శకులు. రెండు ప్రాజెక్ట్స్ కు భారీ క్రేజ్ ఉంది. టైటిల్ మాదంటే మాదని మీడియాకు సైతం ఎక్కారుపరిశ్రమ పెద్దలు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు.

రాజీ ఫార్ములా ప్రకారం బాలయ్య సినిమాకు మరో పదాన్ని జోడించి సాహస సామ్రాట్ గా రిలీజ్ చేస్తే రమేష్ బాబుది అదే టైటిల్ తో సామ్రాట్ గా వచ్చింది. సాహస సామ్రాట్ డిజాస్టర్ కాగా సామ్రాట్ డీసెంట్ హిట్ అనిపించుకుంది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ కత్తి విషయంలోనూ ఇలాగే జరిగింది. ఈ టైటిల్ నాదని గుణశేఖర్ ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు. కానీ ఆఖరికి హీరో పేరు తగిలించి విడుదల చేశారు. ఫలితం ఫ్లాప్. ఖలేజా టైంలోనూ ఇదే గొడవ వస్తే దానికీ మహేష్ పేరు జోడించి రిలీజ్ చేశారు. అంచనాలు అందుకోలేక ఫెయిల్ అయ్యింది. ఇలా టైటిల్స్ కోసం టాలీవుడ్ లో ఆసక్తికరమైన గొడవలు చాలానే జరిగాయి కానీ వీటిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఉంటారు సీనియర్లు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి