iDreamPost

ఆయనొక విలక్షణమైన ప్రధాన మంత్రి!!

ఆయనొక విలక్షణమైన ప్రధాన మంత్రి!!

ఇప్పటివరకు మనదేశంలో ఎంతోమంది ప్రధానులను చూశాము. ఒకవేళ చూడకపోయినా వారి గురించి వినుంటాము. కానీ మిగతా ప్రధానులందరితో పోలిస్తే ఆయన్నీ మాత్రం చాలా విలక్షణమైన ప్రధాన మంత్రి అని చెప్పక తప్పదు. ప్రధానమంత్రి పదవిలో వుంది తక్కువ కాలమే అయినప్పటికీ ఆయన తన వ్యక్తిత్వంతో మిగతా ప్రధానులకంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన మరెవరో కాదు కాకలు తీరిన రాజకీయ వేత్త మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్.

ఆయన రాజకీయ నేపధ్యం.. అనుభవించిన పదవులు.. పక్కన పెడితే ఈరోజు ప్రత్యేకంగా ఆయన్ని గుర్తుకుతెచ్చుకోవడానికి అయన జన్మదినం ఒక ప్రధాన కారణం. ఇప్పటివరకు దేశంలోని ప్రధాన మంత్రులలో లీఫ్ సంవత్సరంలో ఫిభ్రవరి 29 న జన్మించింది ఆయనొక్కరు మాత్రమే. అంటే అయన జన్మదినం నాలుగేళ్ళకొకసారి మాత్రమే వస్తుంది. అంతేకాక ఇప్పటివరకు అత్యధికకాలం జీవించిన (99 సంవత్సరాల పాటు) ప్రధానిగా ఆయన ఘనత సాధించాడు.

ఆయన గురించి ప్రత్యేకతలు చూస్తే..

నెహ్రూ చనిపోయేనాటికే మొరార్జీ దేశాయి కి 68 ఏళ్ళు. అప్పటికి అయన కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. అప్పుడే ప్రధాని కావలసినవారు. అయితే 13 ఏళ్ళ తర్వాత 1977లో తన 81 సంవత్సరాల వయసులో భారత ప్రధాని అయ్యారు. ఆయన ఇండియాలో తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి కావడం విశేషం.

ఆయన భారతదేశం, పాకిస్తాన్ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలైన భారత రత్న, నిషానే పాకిస్తాన్ లను పొందిన ఏకైక భారతీయుడు కావడం విశేషం. లాల్ బాహుదార్ శాస్త్రి హఠాన్మరణం తరువాత ప్రధానిమంత్రి పదవి కోసం ఇందిరా గాంధీ తో పోటీ పడిన ఆయన 169/351 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయితే అనంతరం ఇందిరా హయాంలోనే కొనసాగారు. తరువాత కాలంలో ఆర్థిక శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆ కాలంలో ఇందిరా గాంధీ 14 పెద్ద బ్యాంకుల జాతీయకరణ జరిగింది. ఈ కారణంగా అతను ఇందిరా గాంధీ కేబినెట్ కు రాజీనామా చేసాడు

వ్యక్తిగతంగా ఆయన మహా మొండి మనిషి, మంచి ఆర్థికవేత్త. మొరార్జీ హయాంలో నిత్యావసర సరుకుల ధరలు బాగా దిగొచ్చాయి. మొరార్జీ తాను అదికారంలో ఉన్న రెండేళ్ళలో ప్రైవేట్ విదేశీ పెత్తందారీతనాన్ని కట్టడి చేశాడు. దింతో ఈయన విధించిన షరతులకు తట్టుకోలేక Coca-Cola, IBM వంటి విదేశీ సంస్థలు ఇండియా నుంచి వెళ్లిపోయాయి. ఐతే మొరార్జీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కోకాకోలా కు పోటీగా ‘డబుల్ సెవెన్’ పేరుతో దేశీయ కోలని మార్కెట్ లోకి పరిచయం చేశారు.

ఒకదశలో ఈయన దెబ్బకు దేశీయ వ్యాపార వర్గాలు కూడా బెంబేలెత్తాయి. మొరార్జీ దేశాయ్ హోం మంత్రిగా ఉన్న సమయంలో సినిమాలు, థియేటర్ ప్రొడక్షన్లలో నటిస్తున్న పాత్రల అసభ్యకర సన్నివేశాలను (“ముద్దు” సన్నివేశాలతో పాటు) చట్ట పరంగా బహిష్కరించాడు.

దేశాయ్ కొంతకాలం గుజరాత్ విద్యాపీఠ్ కు ఛాన్సలర్ గా ఉన్నాడు. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా వున్నా సమయంలో కైరా జిల్లాలో రైతులను సంఘటిత పరుస్తూ అనేక కార్యక్రమాలు రూపొందించాడు. ఇవి చివరకు అమూల్ కో-ఆపరేటివ్ (AMUL) ఉద్యమం స్థాపనకు దొహదపడ్డాయి.

అయితే మొరార్జీ దేశాయ్ కి ఇక విచిత్రమైన అలవాటు ఉంది. మానవుల మూత్రానికి వ్యాధినిరోధక లక్షణాలున్నాయని ఈయన బలంగా నమ్మేవారు. స్వయంగా తన మూత్రాన్ని తానె తాగడంతో పాటు మూత్రం త్రాగడం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తుండేవాడు. వైద్య చికిత్స పొందలేని లక్షల మంది భారతీయులకు మూత్ర చికిత్స అనేది పరిపూర్ణ వైద్య పరిష్కారం అని దేశాయ్ బావిస్తుండేవాడు. ఆయన దీనిని “జీవజలము” అని పిలిచేవాడు.

భారతదేశపు నిఘావ్యవస్థ (రా)ను దెబ్బతీసి పాకిస్తాన్‌లో భారత నిఘా లేకుండా చేసిన వ్యక్తిగా మొరార్జీ దేశాయ్ పై పలు విమర్శలు ఉన్నాయి. భారత గూఢచారి సంస్థ అయిన “రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్” (RAW) ఇందిరా గాంధీకి వ్యక్తిగత భద్రతా గార్డులుగా వ్యవహరిస్తుందని ఆయన తరచూ విమర్శిస్తుండేవాడు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంస్థ కార్యకలాపాలను కూడా నిలిపి వేశాడు. ఆ సంస్థకు నిధులు ఇవ్వకుండా చేసి దాని ప్రాభవాన్ని తగ్గించాడు

పాకిస్తాన్ తొలి అణుకేంద్రం కహూటాలో ఉందని 1977లో రా ఏజెంట్లు విజయవంతంగా కనుగొని సమాచారాన్ని భారతదేశానికి చేరవేసినప్పుడు, ఒక ఏజెంటు తనవద్ద ఉన్న కహూటా అణుకేంద్రపు ప్లాన్ పటాన్ని ఇవ్వాలంటే పదివేల డాలర్లు కావాలని డిమాండ్ చేశాడు. ఈ డిమాండ్ అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి విన్నవించగా ఆయన దాన్ని తిరస్కరించడమే కాక ఆ రహస్య సమాచారం తమకు తెలుసన్న సంగతిని స్వయంగా పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ జియా ఉల్ హక్‌కి ఫోన్ చేసి చెప్పాడంటారు. దాంతో ఆ భారత “రా..” ఏజెంటును పాకిస్తాన్‌ కనిపెట్టి చంపిందని అప్పట్లో పత్రికల్లో వార్తలొచ్చాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి