iDreamPost

ఎమర్జెన్సీ తర్వాత ఎదిగిన ఏకైక పార్టీ బిజెపి

ఎమర్జెన్సీ తర్వాత ఎదిగిన ఏకైక పార్టీ బిజెపి

ఎంత ఆదర్శంగా పుట్టిందో, అంత అధ్వాన్నంగా గిట్టింది జనతా పార్టీ. 1977లో అనూహ్యంగా వచ్చిపడిన లోక్ సభ ఎన్నికలు ఎదుర్కొనడానికి దేశంలోని ముఖ్య పార్టీలు భారతీయ జన సంఘ్, భారతీయ లోక్ దళ్, సంస్థాగత కాంగ్రెస్లతోపాటు మరో మూడు ఏకమయ్యాయి. మూడో ఏడాదికల్లా దేని దారి అది చూసుకున్నాయి. వీటిలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కార్యకర్తల బలం ఉన్న ఒకే ఒక పార్టీ భారతీయ జన సంఘ్ (బిజెఎస్).

ఇది RSS కు పొలిటికల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్. సాధారణంగా పొలిటికల్ పార్టీలకు అనుబంధ సంఘాలుంటాయి. సంఘ్ కు మాత్రం రాజకీయ విభాగం అనుబంధంగా ఏర్పడింది. సంఘ్ పరివారంలో బ్రాహ్మణాధిపత్యం ఎక్కువంటారు. దాని గురించి మరెప్పుడైనా మాట్లాడుకుందాం. ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ ప్రయోగంతో దేశంలో బ్రాహ్మణ రాజకీయాలకు గండి పడింది. బీసీలు పొలిటికల్ పవర్ అందుకోవడానికి ముందుకొచ్చారు.

మొరార్జీ దేశాయ్ అధికారంలోఉన్న రెండున్నరేళ్లలో ఏ పొలిటికల్ లీడర్కి రానంత మైలేజీ అటల్ బిహారీ వాజ్ పాయ్, లాల్ కృష్ణ అద్వానీలకు వచ్చింది. విదేశాంగ శాఖ మంత్రిగా వాజ్ పాయ్, సమాచార ప్రసార శాఖ మంత్రిగా అద్వానీ ప్రభుత్వంలో పనిచేశారు. జనతా పార్టీ ముక్కలు చెక్కలయ్యేసరికి కమిట్మెంట్ గల లీడర్లుగా వీళ్లిద్దరే మిగిలారు. మొరార్జీ, చరణ్ సింగ్, జగజ్జీవన్ రామ్ , మధు దండావతే, మోహన్ ధారియా, జార్జి ఫెర్నాండెజ్, బిజూ పట్నాయక్, బహుగుణ వగైరాలందరూ రాజకీయంగా ఏదో ఒకవైపు బెండ్ అయ్యారన్న అపవాదు మూటగట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో జనతా పార్టీ నుంచి విడిపోయాక బిజెఎస్ పాత పేరుతో పార్టీని పునరుద్ధరించలేదు. జనతా పార్టీవల్ల వచ్చిన ప్రచారాన్ని వదులుకోకుండా ‘భారతీయ జనతా పార్టీ’గా బిజెఎస్ రూపు మార్చుకుంది.వాజ్ పాయ్ , అద్వానీలతో బిజెపి 1980 ఏప్రిల్ ఆరో తేదీన మొదలైంది. బిజెపిని ఆవిర్బవించిందనో, అవతరించిందనో అనలేం. పాత బోర్డు తీసేసి, కొత్త బోర్డు తగిలించారనే చెప్పాలి.

కొత్త బేనర్ మీద 1984 లోక్ సభ ఎన్నికల్లోనే పోటీకి దిగింది. మొదటి నాలుగేళ్లలోనూ బిజెపికి పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. పార్టీని మళ్లీ జీరో లెవెల్ నుంచి నిర్మించుకోవలసి వచ్చింది. భారతీయ జన సంఘ్ ఏర్పడి 1951 నుంచి 1977 వరకు ఎలాగైతే అంచెలంచెలుగా ఎదిగిందో, అచ్చంగా అదే పద్ధతిలో భారతీయ జనతా పార్టీ ప్రస్థానంకూడా సాగింది. 1951లో బిజెఎస్ 3 ఎంపీ సీట్లతో మొదలై, 1977నాటికి 94 సీట్లకు చేరింది. జనతా పార్టీ బేనరుపై నెగ్గిన 271 మంది ఎంపీల్లో పాత బిజెఎస్ అభ్యర్థుల బలమే ఎక్కువ. 1984లో ఇందిరా గాంధీ హత్య తర్వాత వీచిన సానుభూతి పవనాల్లో వాజ్ పాయ్ సహా బిజెపి హేమాహేమీలంతా కొట్టుకుపోయారు. లోక్ సభలో BJS కు మొదట 3 సీట్లే వచ్చినట్లుగా, బిజెపికి ఫస్ట్ 2 సీట్లే వచ్చాయి. ఆ ఇద్దరిలో ఒకరు హనుమకొండ నుంచి నెగ్గిన చందుపట్ల జగ్గారెడ్డి, రెండోవారు మెహ్సానా (గుజరాత్) నుంచి గెలిచిన ఏ.కె.పటేల్.

Also Read:నేటితో 40 వసంతాలు పూర్తి చేసుకున్న భారతీయ జనతా పార్టీ..

ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన దీర్ఘకాలిక వ్యూహం ఎలా ఉండాలో స్టడీ చేయడానికి బిజెపిని మించిన మెటీరియల్ మరెక్కడా ఉండదేమో! భారతీయ జనతా పార్టీగా కొత్త బోర్డు తగిలించినప్పటి నుంచీ ప్రతి లోక్ సభ ఎన్నికలోనూ ఏదో ఒక దురదృష్టం వెంటాడుతూనే వచ్చింది. జనతాపార్టీ ఫెయిల్యూర్, ఇందిర హత్య, రాజీవ్ హత్య వంటివి బిజెపికి లోక్ సభలో అడ్డం తగిలాయి. ఇది 1999 వరకు కొనసాగింది. నాలుగేళ్ల తర్వాత 2004 నుంచి మళ్లీ పదేళ్లపాటు అధికారానికి దూరమైంది. ఈ 30 ఏళ్లలోనూ బిజెపి ఒక పద్ధతిగా తన బేస్ పటిష్టం చేసుకుంది. వాజ్ పాయ్ ప్రెసిడెంట్ గా ఉన్నంతకాలం వైట్ కాలర్ పార్టీగా, సమాజంలో అప్పర్ లేయర్కి చెందిన పార్టీగా ఉండేది. అద్వానీ రథయాత్ర తర్వాత బిజెపికి మహిళల ఆదరణ ఎక్కువైంది. మురళీ మనోహర్ జోషి దూకుడు స్ట్రేటజీతో పార్టీలోకి మాస్ ఎక్కువగా వచ్చేశారు. వీళ్లిద్దరి పాత్రను తక్కువ అంచనా వేయలేం.

పి.వి.నరసింహారావు తర్వాత వెంటవెంటనే జరిగిన లోక్ సభలో ఎన్నికలను గమనిస్తే బిజెపి బేస్ ఎలా విస్తరించుకుంటూ పోయిందో అర్థమవుతుంది. ఆ పార్టీకి లెఫ్ట్ పార్టీల్ని తుడిచిపెట్టేయాలన్న సింగిల్ పాయింట్ కార్యక్రమం తప్ప మరొకటి లేదు. తనకు బలం లేనిచోట కాంగ్రెస్ కు మద్దతునిస్తూ వచ్చింది. వామపక్షాలకు పశ్చిమ బెంగాల్ బలమైన స్థావరం. అలాంటిచోట ఈ రోజున లెఫ్ట్ ఫ్రంట్ నిలువ నీడ లేదు. బిజెపి ప్రస్థానాన్ని పరిశీలిస్తే గనుక ఏకకాలంలో ఇద్దరు శత్రువులతో పోరాడకూడదన్న వ్యూహం కనబడుతుంది. అలాగే, యుద్ధంలో గెలవాలంటే వెనకడుగుకూడా వ్యూహమే అన్నట్టుగా ఉంటుంది. అందుకే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క పార్టీతోనూ ఏదోక దశలో బిజెపి స్నేహం చేసింది. ఒక్క లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రమే బిజెపిని ఎన్నడూ దగ్గరకు రానివ్వలేదు. ఇప్పుడు లాలూ కొడుకు తేజస్వి యాదవ్ ను దువ్వే పనిలో పడింది. ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

హిందుత్వాన్ని రెచ్చగొట్టిందని, మత రాజకీయాలు సాగించిందని సెంట్రిక్, సెంట్రిక్ లెఫ్టిస్టులు, లెఫ్టిస్టులు అంటారు గానీ పవర్ పాలిటిక్స్ ఎక్కువగా ఒంటరి పోరే సాగించింది బిజెపి. తమ ఫెయిల్యూర్ ఎక్కడుందన్న విశ్లేషణకంటే కూడా బిజెపి విజయానికి వంకలు వెదకడానికే లెఫ్టిస్టులు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. కాంగ్రెస్ పాతుకుపోయిన రోజున దానికి వ్యతిరేకంగా పనిచేసినట్లే, ఇప్పుడు బిజెపికి వ్యతిరేకంగా పనిచేయాలనుకుంటారు. ఈ క్రమంలో ప్రజలు తమను దూరంగా నెట్టేస్తున్నారన్న స్పృహ కోల్పోతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి