iDreamPost

ప్రమాణాలు ఎందుకు పల్లా..? సక్రమమైతే పత్రాలు చూపిస్తే సరిపోతుంది కదా..?

ప్రమాణాలు ఎందుకు పల్లా..? సక్రమమైతే పత్రాలు చూపిస్తే సరిపోతుంది కదా..?

పరిపాలన వ్యవహారాల్లో భాగంగా అధికారులు తీసుకుంటున్న ప్రతి చర్యను రాజకీయ భూతద్దంలో చూడటం.. ఆరోపణలు గుప్పించడం, రచ్చ చేయడం తెలుగుదేశం నేతలకు పరిపాటిగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు కనిపించిన భూములు, స్థలాలను కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలతో అవినీతి అందలం ఎక్కిన ఆ పార్టీ నేతలకు ఇప్పుడు అధికారులు తీసుకుంటున్న చర్యలతో చుక్కలు కనబడుతున్నాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతను కూడా రాజకీయం చేస్తున్నారు. విశాఖ నగరంలో గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని గ్రేటర్ విశాఖ మున్సిపల్ అధికారులు కూల్చివేసిన ఘటనపై 
టీడీపీ నేతలు చేసిన రాజకీయ రచ్చ చూస్తే ఇదే స్పష్టమవుతోంది.

ఏం జరిగిందంటే..

విశాఖ పారిశ్రామిక ప్రాంతమైన పాత గాజువాక జంక్షన్ లో అక్కడి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మూడంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్మాణం జరుగుతోందని గుర్తించిన జీవీఎంసీ ప్లానింగ్ అధికారులు ఆదివారం ఉదయం రంగంలోకి దిగి అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని కూల్చివేయడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న పల్లా శ్రీనివాసు తన అనుచరగణంతో వచ్చి అధికారులను, సిబ్బందిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారితో వాగ్వాదానికి దిగారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ కార్యకర్తలను బలవంతంగా అక్కడి నుంచి పంపేశారు. రోడ్డుకు సెట్ బ్యాక్ వదలకుండా భవనం నిర్మించారని అధికారులు చెబుతున్నారు. దీనిపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో కూల్చివేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

ఆధారాలు చూపకుండా ఆరోపణలు

తన అక్రమ చర్యలను కప్పిపుచుకునేందుకు.. పల్లా శ్రీనివాసు ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమారు. తనపై రాజకీయ కక్షతోనే భవనాన్ని కూల్చేశారని ఆరోపించారు. అన్ని అనుమతులు తీసుకున్నామని.. ఆ ప్రకారం నిర్మాణం చేపట్టామని.. అక్విజిషన్ ప్రకారం రోడ్డుకు స్థలం కూడా వదిలామన్నారు. అయినా నోటీసు కూడా ఇవ్వకుండా కూల్చివేత చేపట్టారని ఆక్రోశం వెలిబుచ్చారు. తాను అక్రమాలకు పాల్పడలేదని ప్రమాణాలు చేసేందుకు సైతం సిద్ధమని వక్కాణించారు. మీడియా ఎదుట ఇన్ని చిలక పలుకులు పలికిన ఆయన ఒక్క విషయం విస్మరించారు. ఇన్ని ఆరోపణలు, ప్రమాణాలు చేసే బదులు ఆయన తీసుకున్నానంటున్న అనుమతి పత్రాలేవో.. నిబంధనల ప్రకారం ఎంత స్థలం వదిలిపెట్టారో బహిరంగంగా చూపించి అధికారులను నిలదీస్తే బాగుండేది. ఆయన ఆరోపణలు, ఆవేదనలో న్యాయం ఉందని అందరికీ అర్థమయ్యేది. అలా చేయకుండా.. గతంలో ఎన్నో భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పల్లావారు ఎన్ని విమర్శలు చేసినా.. ఇంకెన్ని ప్రమాణాలు చేసినా అవన్నీ రొచ్చు రాజకీయాలేనని ప్రజలు తీసిపారేస్తారు. 

Also Read :  బాబు మాట్లాడకపోయినా.. బుచ్చయ్య చౌదరి బిజెపిని కడిగేశారు..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి