iDreamPost

‘‘హైదరాబాద్‌’’పై ఫలించిన కేసీఆర్‌ మంత్రాంగం

‘‘హైదరాబాద్‌’’పై ఫలించిన కేసీఆర్‌ మంత్రాంగం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, విజయాలపై తెలంగాణలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కమలనాథుల దూకుడుకు బ్రేక్‌ వేసి టీఆర్‌ఎస్‌ రెండో చోట్లా విజయకేతనం ఎగురవేసింది. ప్రధానంగా హైదరాబాద్‌- రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం విషయంలో సీఎం కేసీఆర్‌ తీసుకున్న అనూహ్య నిర్ణయం గెలుపును తెచ్చిపెట్టింది. పీవీ కుమార్తె వాణీదేవిని ఆ స్థానంలో నిలబెట్టి తన నిర్ణయం సరైనదేనని నిరూపించుకున్నారు. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ ఈ స్థానంలో గెలిచిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో అభ్యర్థి ప్రకటన చివర రోజు వరకూ వెలువడకపోవడంతో అసలు టీఆర్‌ఎస్‌ పోటీలో నిలుస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. నామినేషన్‌కు గడువు రెండు రోజులు ఉందనగా వాణీదేవిని అభ్యర్థిగా ప్రకటించిన ప్రతిపక్షాలకు షాక్‌ ఇచ్చారు కేసీఆర్‌.

కరుడుగట్టిన కాంగ్రెస్‌ వాది దివంగత ప్రధాని నరసింహారావుకు కొద్ది కాలంగా కేసీఆర్‌ ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలో పీవీ కుటుంబం టీఆర్‌ఎస్‌కు దగ్గరైంది. వాస్తవానికి వాణీదేవికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే, దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల అనంతరం రాజకీయాలను నిశితంగా పరిశీలించిన కేసీఆర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచి తీరాలని శ్రేణులతో పలుమార్లు మంతనాలు జరిపారు. నల్గొండలో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా ఓకేకానీ, హైదరాబాద్‌లోనే ఎవరిని నిలబెట్టాలని చివరి వరకూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ సిటింగ్‌ సీటులో బీజేపీ పాగా వేసింది. ఆ వెంటనే జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యాన్ని తగ్గించి, బీజేపీ సీట్ల సంఖ్యను బాగా పెంచుకుంది. అనంతరం ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచింది. ఈ నేపథ్యంలో దానికి చెక్‌ పెట్టాలంటే ఎమ్మెల్సీ బీజేపీ సిట్టింగ్‌ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ భావించింది. గట్టి అభ్యర్థి కోసం వెదుకుతుండగా, పీవీ కుమార్తె పేరును కేసీఆరే తెరపైకి తెచ్చారు.

వాణీదేవి అయితే, అటు పీవీ ప్రతిష్ట కూడా ఎన్నికల్లో పనికొస్తుందని కేసీఆర్‌ భావించినట్లు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించిన అనంతరం చివరి రోజుల్లో వాణీదేవిని హైదరాబాద్‌ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్‌ ఇచ్చారు. ‘‘ఓడిపోయే సీటును వాణీదేవికి ఇచ్చి పీవీ కుటుంబాన్ని అవమానిస్తారా’’.. అంటూ కాంగ్రెస్‌, బీజేపీలు ప్రచారం చేశాయి. కానీ, కేసీఆర్‌ మంత్రాంగం ఫలించి వాణీదేవి విజయం సాధించారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో బీజేపీకి మంచి పట్టు ఉంది. గడువు మరో ఏడాదిలో ముగుస్తుందనగానే బీజేపీ నేత రామచంద్రరావు పట్టభద్రుల ఓట్ల నమోదుపై భారీగా దృష్టి పెడతారు. ఆర్‌ఎస్‌ఎస్‌, భజరంగ్‌దళ్‌, ఓయూ విద్యార్థి సంఘాల సహకారంతో విస్తృతంగా ఓట్లు నమోదు చేయించడంతో పాటు వారితో టచ్‌లో ఉంటారు. ఇలా నిశ్శబ్దంగా తనకంటూ ఓ కోటరీ నిర్మించుకున్నారు. అదే ఈ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి కారణమైంది.

మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆది నుంచి వాణీదేవి ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ ఆమె ముందంజలో నిలిచారు. 91 మందిని ఎలిమినేట్‌ చేస్తూ చేపట్టిన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి సమీప ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావు కంటే ఆమె 11,703 ఓట్ల ముందంజలో ఉన్నారు. తుదకు ఇద్దరే మిగలడం.. ఎవరికీ కోటా మేరకు 168520 ఓట్లు రాకపోవడంతో రాంచందర్‌రావు ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఆయనకు పోలైన బ్యాలెట్లలోని రెండు, మూడో ప్రాధాన్యత ఓట్లను వాణీదేవికి కలిపారు. దీంతో మొదటి, రెండో ప్రాధాన్యత కలిపి ఆమె ఓట్ల సంఖ్య 1,89,339 (56.17శాతం)కు పెరిగింది. కోటా ఓట్లు 168520కాగా.. అంతకంటే ఎక్కువ ఓట్లు రావడంతో వాణీదేవిని అధికారులు విజేతగా ప్రకటించారు. 92 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌ ప్రక్రియ 93 రౌండ్లలో పూర్తయ్యింది.

నియోజకవర్గం పరిధిలో 531268 ఓట్లు ఉండగా… 358348 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 337039 ఓట్లు చెల్లుబాటయ్యాయి. మొదటి ప్రాధాన్యతలో ఏడు రౌండ్లలో వాణీదేవికి 112689 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఎన్‌. రాంచందర్‌రావుకు 104668, స్వతంత్ర అభ్యర్థి కే నాగేశ్వర్‌కు 53610, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 31554 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసేసరికి రాంచందర్‌రావు కంటే వాణీదేవి 8021 ఓట్ల ముందంజలో ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ వాణీదేవి ఆది నుంచి ఆధిక్యం ప్రదర్శించారు. స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డికి పోలైన ఓట్లలో రాంచందర్‌రావుకు రెండో ప్రాధాన్యతగా 928 ఓట్లు అధికంగా వచ్చాయి. చిన్నారెడ్డి ఎలిమినేషన్‌లోనూ బీజేపీ అభ్యర్థికి 307 ఓట్లు ఎక్కువ ఓట్లు కలిశాయి. దీంతో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం కొంత మేర తగ్గింది. అనంతరం జరిగిన నాగేశ్వర్‌ ఎలిమినేషన్‌లో వాణీదేవికి ఏకంగా 3 వేల పైచిలుకు ఆధిక్యం లభించింది. మిగతా అన్ని రౌండ్లలోనూ వాణీదేవికి అధిక ఓట్లు కలిశాయి. ఇలా చివరకు వాణీదేవి 11,703 ఓట్ల మెజారిటీతో శాసనమండలి ఎమ్మెల్సీగా విజయం సాధించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి