iDreamPost

Good Luck Sakhi Review : గుడ్ లక్ సఖి రివ్యూ

Good Luck Sakhi Review : గుడ్ లక్ సఖి రివ్యూ

సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు తర్వాత చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటీ లేక డల్ గా ఉన్న బాక్సాఫీస్ వద్ద కొంతైనా ఉత్సాహం నింపుతుందేమోనన్న నమ్మకాన్ని తీసుకొచ్చిన గుడ్ లక్ సఖి ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. గతంలోనే పలుమార్లు విడుదల వాయిదా పడ్డ ఈ స్పోర్ట్స్ డ్రామాకు కీర్తి సురేషే ప్రధాన ఆకర్షణ. బజ్ పెద్దగా లేకపోవడంతో మొన్న చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ ని ముఖ్య అతిథిగా తీసుకురావడం కొంత ఫలితాన్ని ఇచ్చింది. ఆ ఈవెంట్ తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనం దృష్టి దీని మీద పడింది. మరి ఉన్న కాసిన్ని అంచనాలైనా సఖి అందుకుందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

ఓ చిన్నపల్లెటూళ్లో ఉండే సఖి(కీర్తి సురేష్)ని అందరూ బ్యాడ్ లక్ సఖి అని గేలి చేస్తుంటారు. కారణం ఏ పని చేసినా రివర్స్ కావడమే. అదే గ్రామంలో గోలి రాజు అనబడే డ్రామా ఆర్టిస్టు రామారావు(ఆది పినిశెట్టి)కి ఈ అమ్మాయి మీద ప్రేమ ఉంటుంది. ప్రపంచానికి తెలియని ఎంతో గొప్ప టాలెంట్ ఇలాంటి ఊళ్ళలో ఉంటుందని నమ్మే రిటైర్డ్ కల్నల్(జగపతిబాబు)కు సఖిలో ఉన్న రైఫిల్ షూటింగ్ కళలు కనిపిస్తాయి. ఎలాగైనా తన ప్రతిభను గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు.ఆమె ఒప్పుకుంటుంది. రాష్ట్ర స్థాయి పోటీల దాకా వెళ్తుంది. కానీ ఇదంతా సులభంగా జరగదు. మధ్యలో ఏం జరిగిందో తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటులు

పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే క్యారెక్టార్ దొరికితే ఏ స్థాయిలో మెప్పించగలదో మహానటి ద్వారా నిరూపించిన కీర్తి సురేష్ కు కొత్తగా ఋజువు చేయడానికి ఏమి లేదు. అయినా కూడా సఖిలో అమాయకత్వం చలాకీతనం నిండిన క్యారెక్టర్ ని చాలా ఈజ్ తో మెప్పించేసింది. అక్కడక్కడా కొంత అసహజత్వం అనిపించినా పాత్ర డిమాండ్ మేరకు అనుకోవాలే తప్ప వ్యక్తిగతంగా తన మీద కామెంట్ చేయడానికి లేదు. కాకపోతే ఎంత భుజాల మీద మోసిన క్యారెక్టర్ అయినా సరే కంటెంట్ తేడాగా ఉండటంతో మిస్ ఇండియా తరహాలో ఇది కూడా గొప్పగా చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. తను మాత్రమే చెయ్యగలదనే రోల్ అయితే కాదు.

ఆది పినిశెట్టికి డిఫరెంట్ గా ఏదో ఇచ్చారు కానీ తనవరకు గుర్తుండిపోయేలా ఏమి చేయలేదు. ఒకరకంగా చెప్పాలంటే రెండు వేరియేషన్ల మధ్య కన్ఫ్యూజ్ చేయించి ఎటు కాకుండా చేశారు. జగపతిబాబు బాగానే చేసినప్పటికీ తనకు ఇలాంటివి బాగా రొటీన్ అవుతున్నాయన్న విషయాన్ని ఆయనతో పాటు తీసుకుంటున్న దర్శకులు మర్చిపోతున్నారు. రాహుల్ రామకృష్ణ పర్లేదు. ఏదో హడావిడి చేసినట్టు అనిపించినా ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగిలినవాళ్ల గురించి ప్రస్తావించడానికి కానీ ఇందులో ఉన్నామని వాళ్ళు చెప్పుకోవడానికి కానీ ఏమీ మిగల్లేదు. ఎంతసేపూ పై నలుగురే హై లైట్ అయ్యారు

డైరెక్టర్ అండ్ టీమ్

మొదట్లో కొత్తగా భలేగా అనిపించేవి కానీ రాను రాను స్పోర్ట్స్ డ్రామాలు కూడా ఓ మూసలోకి వెళ్ళిపోయి రొటీన్ ఫార్ములాగా మారుతున్న మాట వాస్తవం. ఈ జానర్ తో ఇప్పుడు మెప్పించాలంటే బలమైన భావోద్వేగాలు, చక్కని ఎంటర్ టైన్మెంట్ చాలా అవసరం. కానీ అంత బలమైన పెన్నులు కానీ రాసే రచయితలు కానీ తీసే దర్శకులు కానీ కొరవడ్డారు. అందుకే ఒక లైన్ ని పట్టుకుని సదరు ఆట చివరిలో హీరోనో హీరోయిన్నో గెలిపించేస్తే చాలు మనమో గొప్ప సినిమా తీశామని సంబరపడితే లాభం లేదు. గుడ్ లక్ సఖి పేపర్ మీద రాసుకుంటున్నప్పుడు బహుశా ఇలాగే ఫీలయ్యారేమో. కానీ అవుట్ ఫుట్ మాత్రం అలా రాలేదు.

దర్శకుడు నగేష్ కుకునూర్ ది లోకల్ స్టైల్ కాదు. ఇక్బాల్ లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్, హైదరాబాద్ బ్లూస్ లాంటి మాస్టర్ పీస్ ని అందించిన గొప్ప టేస్ట్ ఉన్న డైరెక్టర్ ఈయన. స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో రెగ్యులర్ సబ్జెక్టుతో వెళ్లకుండా 8*10 తస్వీర్ లాంటి డిఫరెంట్ థ్రిల్లర్ తీయడం ఈయనకే చెల్లింది. అంతటి నగేష్ ఇలాంటి ప్లాట్ ని తెలుగు స్ట్రెయిట్ మూవీకి ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. రైఫిల్ షూటింగ్ అనే క్రీడ ఎవరూ చూపించలేదు కాబట్టి ఇది డిఫరెంట్ గా ఉంటుందనుకున్నారో ఏమో కానీ దాన్ని మినహాయిస్తే మిగిలిన తతంగమంతా ఏ మాత్రం కొత్తదనం లేకుండా చప్పగా సాగడం సఖిలోని ప్రధాన మైనస్.

స్పోర్ట్ ఏదైనా డ్రామా చాలా ముఖ్యం. రాజమౌళి ‘సై’లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించినా సక్సెస్ అయ్యిందే తప్ప ఆయన కెరీర్ బెస్ట్ కాలేదు. జెర్సీకి నలుమూలలా ప్రశంసలు దక్కినా ఎంసిఎ, భలే భలే మగాడివోయ్ లాగా కాసుల వర్షం కురవలేదు. చక్ దే ఇండియా ఇప్పటికీ షారుఖ్ ఖాన్ బెస్ట్ గా ఎందుకు చెప్పుకుంటారంటే అందులో ఉన్న ఆటతో పాటు గొప్పగా పండిన ఎమోషన్లు ఎలివేషన్లు కారణం. కానీ నగేష్ కుకునూర్ వాటినసలు పట్టించుకోకుండా తన మానాన తాను ఈ గుడ్ లక్ సఖిని తీసుకుంటూ పోయారు. ఒక దశలో అసలీయన గత దశాబ్ద కాలంలో వచ్చిన స్పోర్ట్ డ్రామాలను చూశారా లేదా అనే అనుమానం కలుగుతుంది.

కేవలం ఒక ఆర్టిస్టు పెర్ఫార్మన్స్ డ్రై కథలను నిలబెట్టలేదు. కీర్తి సురేష్ బాగా నటించడం వల్ల మహానటి బ్లాక్ బస్టర్ కాలేదు. నాగ అశ్విన్ గొప్పగా ప్రెజెంట్ చేశాడు కాబట్టి దానికి ఆమె నటన తోడయ్యింది కనక ప్రేక్షకులు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు. గుడ్ లక్ సఖిలో మిస్ అయ్యింది ఇదే. కీర్తి సురేష్ క్యారెక్టరైజేషన్ మీద పెట్టిన ఫోకస్ ఇతర పాత్రలను ఎంగేజింగ్ గా మలచడంలో నగేష్ విఫలమయ్యారు. దానికి తోడు సఖి పల్లెటూరి నుంచి నేషనల్ కాంపిటీషన్ దాకా ఎదిగే క్రమాన్ని ఎలాంటి ఎగ్జైట్మెంట్ లేకుండా ఏదో సీరియల్ మాదిరి చూపించడంతో ఒకదశలో బోర్ కొట్టే స్టేజి నుంచి ఎప్పుడు అయిపోతుందాని ఎదురు చూసేలా చేస్తుంది.

పోనీ సఖి రామారావుల మధ్య ప్రేమకథైనా సరిగా ఎస్టాబ్లిష్ అయ్యిందా అంటే అదీ లేదు. ఊగిసలాట మధ్య ఇష్టం వచ్చినట్టు తిరిగి ఫైనల్ గా ఉసూరుమనిపిస్తుంది. ఎంత గొప్ప దర్శకులైనా వర్మ, మణిరత్నం లాంటి వాళ్ళు ఒకప్పటి మేజిక్ ని చేయలేకపోతున్నారు. ఇప్పటి తరం పల్స్ ని గ్రహించలేక ఫ్లాపులు అందుకుంటున్నారు. పాతికేళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చిన నగేష్ కుకునూర్ కూడా ఇదే తొవలోకి వెళ్లారు. తెలుగులో చేస్తున్న మొదటి సినిమాగా ఎలాంటి ప్రత్యేకతను ఆపాదించకుండా కేవలం కీర్తి సురేష్ మీద ఆధారపడి కథాకథనాలను లైట్ గా తీసుకోవడంతో ఓటిటిలో చూస్తే చాలు సఖి అనిపించారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఎలాంటి మెరుపులు లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా పర్లేదనిపించినా ఒకదశ దాటాక తను కూడా చేతులెత్తేశాడు. పాటలు ఒక్కటీ గుర్తుకురావు. చిరంతన్ దాస్ ఛాయాగ్రహణం ఉన్నంతలో అనుభవమంతా ఉపయోగించి మంచి క్వాలిటీని స్క్రీన్ మీద చూపించింది. రెండు గంటల లోపే లాక్ చేసినందుకు శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ని తప్పు బట్టడానికి లేదు. అవసరం లేనివంతా కోత వేసుకుంటూ పొతే ఇది కాస్తా షార్ట్ ఫిలిం అయ్యేది. డబ్బింగ్ ని అసంపూర్ణంగా చేశారు. ఇంత టైం ఉన్నా ఇలా చేయడం ముమ్మాటికి నిర్లక్ష్యమే. నిర్మాణ విలువలు ఓకే. ఏదో అనుకున్నారు ఏదో అయ్యింది

ప్లస్ గా అనిపించేవి

నేపథ్యం
కీర్తి సురేష్
తక్కువ నిడివి

మైనస్ గా తోచేవి

నీరసంగా సాగే కథనం
క్యారెక్టరైజేషన్లు
డ్రామా లేకపోవడం
టేకింగ్

కంక్లూజన్

దర్శకుడు నగేష్ కుకునూర్ ప్రొఫైల్, ట్రాక్ రికార్డు, తీసిన సినిమాలను బట్టి గుడ్ లక్ సఖిని ఏదేదో ఊహించుకుంటే మాత్రం అందులో అంచనాలను కనీసం పావు వంతు కూడా అందుకోలేక మిమ్మల్ని ఖచ్చితంగా నిరాశపరుస్తుంది. స్పోర్ట్స్ డ్రామాలో ఉండాల్సిన ఎమోషన్ పూర్తిగా మిస్ అయిపోవడంతో ఉప్పు లేని వంటకంలా బాలన్స్ తప్పిపోయింది. కేవలం కీర్తిసురేష్ కోసమే ఎలా ఉన్నా చూస్తామనుకునే వీరాభిమానులకు తప్ప థియేటర్ కు వెళ్లే ఆడియన్స్ ని ఈ సఖి మెప్పించడం కష్టమే. కొత్త సినిమాలేవీ లేవు కాబట్టి దీంతో సర్దుకుంటామనే పెద్ద మనసు ఉంటే ఛాయస్ గా పెట్టుకోవచ్చు కానీ అంతకు మించి కారణం ఇవ్వలేం

ఒక్క మాటలో : నో లక్ సఖి

Also Read : Hero Review : థ్రిల్ల‌ర్ కామెడీ హీరో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి