iDreamPost

అమ్మో.. ఆగష్టు..!

అమ్మో.. ఆగష్టు..!

ఉభయ తెలుగు రాష్ట్రాలోనూ జల సిరులకు మూలంగా నిలుస్తుంది గోదావరి. కానీ ఆగష్ణు నెల వచ్చిందంటే మాత్రం నదికి దిగువన ఉన్న ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు భయాందోళనలు నెలకొంటాయి. జులై, ఆగష్టు, సెప్టెంబరు నెలల్లో గోదావరికి వరద నీరు సాధారణంగా వస్తుంటుంది. అయితే భారీ నుంచి అతి భారీగా వరదలు వచ్చేది మాత్రం ఆగష్టు నెలలోనే.

మరోసారి ఆగష్టు నెలలోనే గోదావరి నీటిమట్టం పెరగడాన్ని ఉభయగోదావరి జిల్లాల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. గోదావరి నదీ ప్రవాహానికి సంబంధించి 1953 నుంచే రికార్డులు అందుబాటులో ఉంటాయి. వీటిని పరిశీలిస్తే ఇప్పటి వరకు నదికి 34 సార్లు వరదలు రాగా అందులో 22 సార్లు ఆగష్టు నెలలోనే సంభవించాయి.

అతి భారీ వరదలుగా పరిగణించేవి 5 వరదలు కూడా ఈ నెలలోనే రావడం గమనార్హం. వీటిలో 1953లో 30,03,100 క్యూసెక్కులు, 1986, ఆగష్టు 16న 35,06,388 క్యూసెక్కులు (ఇప్పటి వరకు వచ్చిన వరదలో ఇదే అత్యధికం), 2006లో 28,50,664, 1990లో 27,88,700, 2013లో 21,18,170, 2010లో 20,05,299 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది.

ఏడేళ్ళ తరువాత ఈ సారే..

ప్రసుత్తం గోదావరి నదికి వస్తున్న వరదను పరిశీలిస్తే ఏడేళ్ళ తరువాత ఆ స్థాయి నీటిమట్టాలు నమోదవుతున్నాయని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 17.75 అడుగుల నీటిమట్టం నమోదు కావడం 2013 తరువాత ఈ సారేనని తెలిపారు. గతంలో కూడా 1953, 1958, 1959, 1986, 1990, 1994, 2000, 2005, 2006, 2010లలో కూడా మూడో ప్రమాదహెచ్చరిక స్థాయికి గోదావరి నది నీటిమట్టం చేరుకుంది.

వివిధ ప్రాంతాల్లో వరద మట్టం నమోదు..

తెలంగాణాలోని కాళేశ్వరం, పేరూరు, దుమ్ముగూడెం, భద్రాచలం, ఆంధ్రప్రదేశ్‌లోని కోయిద, కూనవరం, కాఫర్‌ డ్యాం, పోలవరం, రాజమహేంద్రవరం పాతరైల్వే వంతెన, ధశళేశ్వరం బ్యారేజీల వద్ద గోదావరి నీటి మట్టం నమోదు చేస్తుంటారు. చత్తీస్‌ఘడ్‌ పరిధిలోని కుంట వద్ద గోదావరికి ప్రదాన ఉప నది అయిన శబరి నీటిమట్టం కూడా నమోదు చేస్తారు. ఎగువ ప్రాంతాల్లో నమోదవుతున్న నీటి మట్టాలను పరిశీలించి ధవళేశ్వరం వద్దకు చేరే వరదనీటిని కొన్ని గంటలు ముందుగానే అంచనావేసి, అందుకు తగ్గ అప్రమత్తత కార్యాచరణను రూపొందించుకుంటారు.

30 గంటల ముందుగానే అంచనాకు అవకాశం..

ఈ క్యాచ్‌మెంట్‌ ఏరియాల్లో కురిసే వర్షపాతం వివరాలు, ఉప నదులకు వచ్చే వరద నీటిని అంచనా వేసి దిగువ ప్రాంతాలకు ఏ స్థాయిలో వరద నీరు వస్తుందన్నది అంచనా వేస్తారు. ధవళేశ్వరం వద్దకు చేరే వరద నీటిని గురించి సుమారు 30 గంటల ముందే ఒక అంచనా వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎగువ ప్రాంతాల్లోని వర్షం, కేచ్‌మెంట్‌ ఏరియా ద్వారా నదిలోకి వచ్చే నీటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నిలక్షల క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు వస్తుందన్నది లెక్కిస్తారు. భద్రాచలంలో వరద పెరిగితే ధవళేశ్వరం వద్ద కూడా వరద పెరుగుతుందని ఉభయగోదావరి జిల్లాలోని సామాన్యులు కూడా అంచనా వేస్తుంటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి