iDreamPost

కరోనా రహిత రాష్ట్రంగా గోవా

కరోనా రహిత రాష్ట్రంగా గోవా

కరోనా మహమ్మారి భారత్ లో వ్యాపించగానే దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే గోవా ప్రభుత్వం ఎక్కువగా భయపడింది. ఎందుకంటే మనదేశంలో అత్యధిక విదేశీ పర్యాటకులు రాకపోకలు చేసే రాష్ట్రాల్లో గోవా ముందుంటుంది. అందుకే గోవా కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకున్నది. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసింది. అక్కడి అధికార యంత్రాంగం కూడా శాయశక్తులా కృషి చేసింది. ఫలితంగా కరోనా రహిత రాష్ట్రంగా గోవా రికార్డుకెక్కింది..

అయితే ఓవైపు దేశంలో కరోనా కేసులు ఏరోజుకారోజు పెరుగుతున్నాయి. ప్రతీ రాష్ట్రంలోనూ పాజిటివ్ కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో తప్పితే మధ్య, దక్షిణ భారత్ లోని రాష్ట్రాలన్నీ కరోనా కేసులతో సతమతమవుతున్నాయి. అయితే ఒక్క గోవా మాత్రం కరోనా విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకుంది. దేశంలో అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన గోవాలో క‌రోనా స్కోర్ జీరోకు ప‌డిపోయింది. గోవాలో ఒక్క చివ‌రి యాక్టివ్ కేసు కూడా నెగెటివ్ గా తేల‌డంతో క‌రోనాను మొదటిగా జయించిన రాష్ట్రంగా గోవా అవ‌త‌రించింది.

ఒకవిధంగా చెప్పాలంటే క‌రోనాతో యుద్ధం చేస్తున్న భార‌త‌ కు గోవా రిజల్ట్ ఒక బూస్టప్ లాంటిది. జీరో పాజిటివ్ వచ్చినా గోవా ముఖ్యమంత్రి ప్ర‌మోద్ సావంత్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గోవాలో ఒక్క కేసు కూడా లేదని చెప్ప‌డం ఎంతో సంతోషంగా ఉన్నా మే 3వ‌ర‌కు ప్ర‌జ‌లు లాక్ డౌన్ పాటించాలన్నారు. అయితే ఏప్రిల్ 3 కు ముందు గోవాలో 7క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కానీ ఆ తర్వాత ఒక్క కేసు కూడా న‌మోదు కాలేదు.

ఏప్రిల్ 3కి ముందుకు పాజిటివ్ గా తేలినవారంతా కోలుకోవ‌డంతో కేసులు జీరోకు ప‌డిపోయాయి. నిజానికి గోవాకు పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువ.. ఎంత ఎక్కువ అంటే ప్రతీరోజూ వేలమంది వస్తుంటారు. చైనా, అమెరికాలతో సంబంధాలు కలిగిన వ్యక్తుల ఇక్కడికి రావడానికి ఎంతో అవకాశముంది. అయినా అక్కడి అధికారుల నిబంధనల వల్ల లాక్ డౌన్ ను పటిష్టంగా అమలుచేయడం వల్ల పర్యాటకుల సంఖ్య జీరోకు పడిపోయింది. కొత్త పాజిటివ్ కేసులు నమోదుకానంత మాత్రాన గోవాలో ఉన్నతాధికారులు, పోలీసు యంత్రాంగం, ప్రజలు రిలాక్స్ కాలేదు. ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉండవచ్చని, అందరూ అప్రమత్తమయ్యారు. ప్రజలంతా ప్రభుత్వాదేశాలను పాటించారు.

ఈరోజు గోవాలో జీరో కేసులు నమోదవడం వెనుక ఎంతో శ్రమ, క్షమశిక్షణ ఉన్నాయి. చైనాలో కరోనా ప్రబలుతున్న సమాచారం తెలిసిన వెంటనే గోవా అప్రమత్తమైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా గోవా విమానాశ్రయంలో ప్రయాణికులకు టెస్ట్ లు చేసేందుకు స్క్రీనింగ్ ఏర్పాటుచేసారు. దీనివల్ల కరోనా రోగులు తమ రాష్ట్రంలోకి రాకుండా జాగ్రత్త పడింది. జనతా కర్ఫ్యూలో భాగంగా మార్చి 22 నుంచే గోవా అన్ని రాష్ట్రాల సరిహద్దులు మూసివేసింది.

అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలేవీ గోవాలోకి రాకుండా కట్టడి చేసింది. ముందే క్రీడలు, ఇతర పోటీలు, మత సమావేశాలు వాయిదా వేసుకోవాలని సీఎం ప్రమోద్ సావంత్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు కూడా సహకరించారు. అందుకే ఏప్రిల్ 3వరకు గోవాలో కేవలం ఏడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. పొరుగున రాష్ట్రమైన కర్ణాటకలోని బెలగావీలో కేసులు పెరగడంతో సరిహద్దులును మూసివేసి, రాష్ట్రంలోకి వచ్చినవారిని క్వారంటైన్‌కు తరలించారు. బెలగావీ నుంచే గోవాకు కూరగాయలు, పండ్లు పెద్ద సంఖ్యలో వస్తాయి కాబట్టి.. గోవాకు బెలగావీ కీలకం కావడంతో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అలాగే 7వేలమంది నేవీ సిబ్బందిని సైతం టెస్ట్ లు చేసి 28 రోజులు నిర్బంధంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు.

ముఖ్యంగా ప్రజలు సహకరించారు. లాక్ డౌన్ ఎంత ముఖ్యమో గుర్తుంచుకుని, అందుకు తగ్గట్టుగా నిబంధనలు పాటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన గైడ్ లైన్స్ ను అక్కడి ప్రజలంతా పాటించారు. ఎక్కడా ఎగబడలేదు. గుమి గూడలేదు. ప్రభుత్వం అందించే బియ్యం, వస్తువులు తీసుకోవడంతో గందరగోళాలకు పోలేదు. స్వచ్ఛంధ సంస్థలు అతి చేయలేదు. ప్రజలు సామాజిక దూరం పాటించారు. చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం, స్వీయ నిర్భంధాన్ని ఎవరికి వారే అమలు చేసుకున్నారు. ప్రతీఒక్కరూ బాధ్యతగా మెలిగారు. ప్రభుత్వ చర్యలకు ప్రజల సహకారం నూటికినూరు శాతం అక్కడ ఫలించింది.

దీనిని బట్టి ఇతర దేశాలనుండి వచ్చి మరీ గోవాలోని సహజత్వాన్ని, కల్చర్ ను ఫాలో అయ్యేవారిని ఇప్పటివరకూ మనం చూసాం.. గోవాలో ఇతర దేశస్తుల కల్చర్ చూడటానికే పొరుగు తెలుగురాష్ట్రాలనుండి గోవాకు వెళ్తుంటాం.. కానీ ఇప్పుడు మాత్రం కరోనా విషయంలో గోవా ప్రజలు ప్రభుత్వం పాటించిన క్రమశిక్షణను మనందరం పాటించి తీరాలనిపిస్తోంది. గోవా ప్రజల స్పూర్తిని అన్ని రాష్ట్రాల్లో చాటితో కరోనాను తరిమి కొట్టవచ్చనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి