iDreamPost

మళ్లీ తెరపైకి కేంద్ర రాష్ట్రాల సంబంధాలు

మళ్లీ తెరపైకి కేంద్ర రాష్ట్రాల సంబంధాలు

కేంద్ర, రాష్ట్రాల సంబంధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తేనెతుట్టెలాంటి ఈ అంశాన్ని ఢిల్లీకి సంబంధించిన ఓ సవరణ బిల్లును లోక్ సభలో ఆమోదింపజేసుకోవడంద్వారా కేంద్రం ఈ తుట్టెను కదిపింది. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ నే సర్వాధికారిని చేస్తూ తెచ్చిన ఈ బిల్లు భవిష్యత్తులో రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజ్యాంగ నిపుణులు, రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఏమిటా బిల్లు?

ఢిల్లీ ప్రభుత్వంలో లెఫ్టినెంట్ గవర్నర్, అసెంబ్లీ అధికారాలను పునర్నిర్వచిస్తూ జీఎంసీటీడీ-2021సవరణ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఢిల్లీలో ఇక ప్రజా ప్రభుత్వ పాత్ర నామమాత్రమే. రోజువారీ వ్యవహారాలతో సహా ప్రతి అంశాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆమోదంతోనే అమలు చేయాల్సి ఉంటుంది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ గంజ్ తానే ప్రభుత్వం అన్నట్లు వ్యవహరించడంతో వివాదం మొదలై మొదట హైకోర్టుకు, తర్వాత సుప్రీమ్ కోర్టుకు ఎక్కింది. దీనిపై 2018 జూలైలో సుప్రీం తీర్పు వెలువరించింది. అసెంబ్లీయే సుప్రీం అని స్పష్టం చేసింది. రోజువారీ కార్యకలాపాలను లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఆ తీర్పు దన్నుతో ఆప్ సర్కారు గవర్నర్ వద్దకు ఫైళ్లు పంపడం మానేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం జీఎన్ సీటీడీ సవరణ బిల్లుతో లెఫ్టినెంట్ గవర్నర్ ను సర్వాధికారిని చేసింది.

ఢిల్లీ ప్రత్యేకత..

దేశ రాజధానిగా ఢిల్లీకి ఉన్న ప్రత్యేకత దానికి శాపంగా మారింది. మొదట్లో కేంద్రపాలిత ప్రాంతంగానే ఉన్న ఢిల్లీకి అసెంబ్లీతో కూడిన రాష్ట్ర హోదా కల్పించినా కొన్ని ఆంక్షలు పెట్టారు. కీలకమైన భూమి, పోలీసు, శాంతిభద్రతల అంశాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ కే అధికారాలు కట్టబెడుతూ రాజ్యాంగం 69వ సవరణ, దానికి అనుబంధంగా 239 ఏ క్లాజ్ ద్వారా నిర్ణయం తీసుకున్నారు. వీటన్నింటినీ పొందుపరుస్తూ 1991లో గవర్నమెంట్ ఆఫ్ కాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టానికి ఇప్పుడు తాజా సవరణలు చేశారు.

రాష్ట్రాల అధికారులకు విఘాతం

ఢిల్లీ ప్రజా ప్రభుత్వం పై తక్షణ ప్రభావం చూపే ఈ బిల్లు.. ఇప్పటికిప్పుడే రాష్ట్రాలపై ప్రభావం చూపకపోయినా.. భవిష్యత్తులో చూపవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్రాలకు సమాన హక్కులు, అధికారాలను రాజ్యాంగం కల్పించింది. అయితే కొన్ని విషయాల్లో ఉన్న వెసులుబాటును అలుసుగా తీసుకొని కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చేలాయిస్తోంది. గతంలో కాంగ్రెస్ హయాంలో రాజకీయ అవసరాల కోసం ఆర్టికల్ 356ను తరచూ ప్రయోగిస్తూ రాష్ట్రాలపై స్వారీ చేయడం వంటి గత అనుభవాలు ప్రస్తుత బిల్లుతో భవిష్యత్తులో పునరావృతమయ్యే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి