iDreamPost

కొత్త కార్పొరేటర్ల ఎదురుచూపులు..!

కొత్త కార్పొరేటర్ల ఎదురుచూపులు..!

అధికారం కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలోనూ అన్ని పార్టీల అభ్యర్థులూ హోరాహోరీగా పోరాడారు. కొందరు ఓడారు.. మరికొందరు గెలిచారు. ఓడిన అభ్యర్థుల సంగతి సరే.. గెలిచిన అభ్యర్థుల పరిస్థితి ప్రస్తుతం విచిత్రంగా ఉంది. తాము కార్పొరేటర్లం అని చెప్పుకోవడమే తప్పా అధికారం అనుభవించలేకపోతున్నారు. దాని కోసం సమావేశాలు పెట్టి మరీ డిమాండ్‌ చేస్తున్నారు. కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తాజాగా బీజేపీ కార్పొరేటర్లు ఎన్నికల సంఘానికి సైతం వినతిపత్రం అందజేశారు.

ఫిబ్రవరి 10 వరకూ తప్పదా..

డిసెంబర్‌ 4న వెలువడిన ఎన్నికల ఫలితాలలో టీఆర్‌ఎస్‌ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్‌ 2 స్థానాలను సాధించాయి. బీజేపీ నుంచి గెలిచిన వారిలో దాదాపు అందరూ కొత్తవారే. అలాగే ఇతర పార్టీల్లో కూడా కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్లు ఎన్నికల్లో గెలిచినా ఇప్పటి వరకూ కార్పొరేటర్‌ హోదా దక్కలేదు. ఇందుకు కారణం ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకూ ఉంది. పాలకమండలిని రద్దు చేయకుండానే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. గత ఎన్నికల మాదిరిగానే అత్యధిక మెజార్టీతో టీఆర్‌ఎస్‌ గెలిస్తే పెద్దగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉండేవి కావు. అత్యధిక స్థానాలను గెలిచినా బీజేపీకి కూడా ఇంచుమించు టీఆర్‌ఎస్‌ కు సమానంగా స్థానాలు గెలుచుకుంది. దీంతో వెంటనే కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. సమావేశాలు పెట్టి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఉన్న గోషామహల్‌ అయితే అధికారికంగా కొత్త కార్పొరేటర్లనే గుర్తించాలని రాజాసింగ్‌ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిచయ వేదిక పేరుతో బీజేపీ కార్పొరేటర్లు ఇటీవల జరిపిన సమావేశంలో అధికారులందరూ హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.

గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలి…

కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను గుర్తిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని బీజేపీ నాయకులు అంథనీ రెడ్డి, దేవర కరుణాకర్‌లతో కలిసి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామ చంద్రారెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్పొరేటర్ల పదవీ కాలం ముగియక ముందే ఎందుకు ఎన్నికలు నిర్వహించారని ప్రశ్నించారు. ఎన్నికలు నిర్వహించి పాలక మండలి ఏర్పాటుకు సమయం ఉందనడం అర్థరహితం అన్నారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను వెంటనే గుర్తిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 24 గంటల్లో నోటిఫికేషన్‌ విడుదల చేయని పక్షంలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో అంబేడ్కర్‌ విగ్రహం ముందు నిరసన తెలుపుతామన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి