iDreamPost

అప్పుడు పాశర్లపూడి.. ఇప్పుడు ఉప్పూడి.. కోనసీమ కాళ్ళ కింద బుసలు కొడుతున్న ప్రమాదం

అప్పుడు పాశర్లపూడి.. ఇప్పుడు ఉప్పూడి.. కోనసీమ కాళ్ళ కింద బుసలు కొడుతున్న ప్రమాదం

గత మూడు రోజుల నుండి కోనసీమ వాసులని భయభ్రాంతులకు గురిచేసిన ఉప్పూడి గ్యాస్ లీకేజి ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది. లీకేజీని అరికట్టడానికి ఓఎన్జీసీ నిపుణులు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో ఉప్పూడి వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఓఎన్జీసీ నిపుణులు “మడ్” పంపింగ్ ద్వారా లీకేజీని నియంత్రించగలిగారు. వాస్తవానికి ఈ బావిని 2006 లో తవ్వినప్పటికీ ఇందులో గ్యాస్ నిక్షేపాలు లేవని ఓఎన్జీసీ వదిలివేయడంతో ఇటీవల పి.ఎఫ్.హెచ్ కంపెనీ ఆ బావిలో గ్యాస్ వెలికితీసే పనులు చేపట్టింది. ఈ పనులు జరుగుతుండగానే ఆదివారం మధ్యాహ్నం వాల్ కు మర గట్టిగా తగలడంతో గ్యాస్ లీకై బయటకి వచ్చింది. దింతో గ్యాస్ ఎగిసిపడటంతో స్థానికులు బయాందోళనకు గురయ్యారు.

అయితే గ్యాస్ లీకేజిని నియంత్రించడానికి ఆదివారం నుండి ప్రయత్నిస్తున్నప్పటికీ లీకేజి పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో మంగళవారం ఇసుక, రసాయనాలతో కూడిన షుమారు 80 వేల లీటర్ల నీటిని 2.2 కిలో మీటర్ల లోతు ఉన్న బావిలోకి పంపించారు. ఉదయం 9 గంటలకి మొదలైన ఈ ప్రక్రియ రెండు గంటలోపే పూర్తి అయింది. దీనితో గ్యాస్ బ్లో అవుట్ పూర్తిగా అదుపులోకి వచ్చింది. పీఎఫ్‌హెచ్ కంపెనీ ప్రతినిధులు, ఓఎన్జీసీ సిబ్బందితోపాటు ముంబై ప్రతినిధులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. దింతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఆపరేషన్ ని దగ్గరుండి పర్యవేక్షించిన రాష్ట్ర మంత్రులు పిల్లి సుభాస్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్ లు గ్యాస్ బ్లా అవుట్ ను అదుపులోకి తీసుకొచ్చిన అధికారులని అభినందించారు.

పచ్చటి పొలాలతో, కొబ్బరి తోటలతో, అరటి తోటలతో విలసిల్లే కోనసీమలో అప్పుడప్పుడూ గ్యాస్ బ్లో అవుట్ లు, గ్యాస్ పైపులైన్లు లీకై అగ్ని ప్రమాదాలు సంభవించి అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించడం అనేక సంవత్సరాలనుండి మనం తరచుగా వింటున్నాం. పదే పదే ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నా చమురు సహజవాయువు సంస్థలు సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కోనసీమ ప్రాంతంలో గ్యాస్ లీకేజి అంటే మొదటి గుర్తొచ్చేది మాత్రం పాశర్లపూడి బ్లోఅవుట్ అనే చెప్పొచ్చు.

ఈ సందర్భంగా 1990 వ దశకంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే… వాస్తవానికి పాశర్లపూడి బ్లో అవుట్ అనేది ఆయిల్ సహజవాయువుల రిగ్ బ్లో అవుట్. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం సమీపంలోని పాశర్లపుడిలో 1995 జనవరి 8 న సాయంత్రం 6.50 ప్రాంతంలో జరిగింది. దేశ చమురు మరియు సహజ వాయువు అన్వేషణ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అతి పెద్ద బ్లో అవుట్. పాశర్లపూడిలోని డ్రిల్లింగ్ సైట్ నంబర్ 19, రిగ్ నంబర్ E 1400-18 GF లో ఈ ప్రమాదం జరిగింది.

పాశర్లపూడి బ్లో అవుట్ లో మంటలు అదుపులోకి రావడానికి 65 రోజులు పట్టింది. ప్రారంభంలో నీల్ ఆడమ్స్ ఫైర్ ఫైటర్స్ (హ్యూస్టన్) ని ఈ బ్లో అవుట్ లో మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి నియమించారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో చివరికి 65 రోజుల తర్వాత “ఇంటర్నేషనల్ వెల్ కంట్రోల్” 1995 మార్చి 15 న పాశర్లపూడి బ్లో అవుట్ లో మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చింది.

ఆ సమయంలో రిగ్ కి రెండు కిలోమీటర్ల రేడియస్ లోని 7 గ్రామాల నుండి షుమారు రెండు వేల మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిని తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేసింది. భారీ ఎత్తున ఎగసిపడిన మంటలను చూసి తీవ్ర భయ బ్రాంతులకు గురైన కొంత మంది స్థానికులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ఇతర ప్రాంతాలకు పారిపోయారు. అయితే ఈ బ్లోఅవుట్ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ డ్రిల్లింగ్ రిగ్‌ తో పాటు బావి సైట్ ప్రాంతంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి