iDreamPost

‘పిల్లి’ చెప్పిన పిట్ట కథ

‘పిల్లి’ చెప్పిన పిట్ట కథ

వ్యంగ్యోక్తికి తూర్పు గోదావరి జిల్లా పెట్టింది పేరు. వారి మాటలు ఎదుటి వారికి గౌరవం ఇవ్వడంతోపాటు.. అవసరమైతే నొచ్చుకోకుండా చురకలంటించేలా ఉంటాయి. బుధవారం శాసన మండలిలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సభ్యుడి వ్యవహార తీరుపై అదే జిల్లాకు చెందిన మరో సభ్యుడు పిట్టకథ చెప్పి చురకలంటించారు. మండలిలో తన మేధావితనంతో సభ కార్యక్రమాలు జరగకుండా మాజీ మంత్రి, టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ యనమల రామకృష్ణుడు వ్యవహరిస్తున్నారంటూ రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌ విమర్శించారు. యనమల తీరు ‘దోమాడ కరణం’ టైపులా ఉందంటూ ఓ పిట్ట కథ చెప్పారు.

‘ మా ప్రాంతంలో ఓ చిన్న కథ ఉంది. దోమాడ కరణం ఏదో ఒక లిటిగేషన్‌ పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టేవాడు. తను చనిపోతానని తెలిసి చివరి క్షణంలో ఊళ్లో కుర్రాళ్లను పిలిచి నాదొక కొరిక ఉంది తీర్చండి అని కోరతాడు. తాను చనిపోయిన తర్వాత కర్రపెట్టి ఊరేగించమంటాడు. తర్వాత ఇంకొకడ్ని పిలిచి నేను చనిపోయిన తర్వాత ఈ విధంగా ఊరేగిస్తారు పోలీస్‌ కేసు పెట్టమంటాడు. ఆ ఊరేగించిన కుర్రాళ్లపై మర్డర్‌ కేసు పెడతారు. దోమాడ కరణం ఊరిని బతికి ఏపాడు. చచ్చీ ఏపాడు’ అలా ఉంది టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ప్రవర్తన అని పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌ చురకలంటించారు.

యనమల రూల్‌ బుక్‌ పట్టుకుని మండలిలోకి వస్తారు కానీ అందులో ఉన్న రూల్‌ మాత్రం ఆచరించరని పిల్లి విమర్శించారు. యనమల తెలివితేటలు ఓవర్‌ ఫ్లో అవడం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. పిల్లి సుభాష్‌ ప్రశంగం చూసిన మిగతా సభ్యులు ఏమైనా ఇలాంటి కథలు చెప్పాలంటే తూర్పుగోదావరి జిల్లా వారి తర్వాతే అంటూ వ్యాఖ్యానించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి