iDreamPost

కళాశాలల్లో మత్తు..!

కళాశాలల్లో మత్తు..!

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా అన్నాడో సినీ కవి ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో గానీ ప్రస్తుత సాంకేతిక యుగంలో యువత మాదకద్రవ్యాల మత్తులో పడి బతుకును చిత్తు చేసుకుంటుంది. ఇప్పటివరకు మెట్రోపాలిటిన్ సిటీలకు మాత్రమే పరిమితమైన మాదక ద్రవ్యాల వినియోగం ఇప్పుడు ద్వితీయ స్థాయి సిటీలకు కూడా పాకింది. దీనికి విజయవాడలో కేఎల్ యూనివర్సిటీ లో పట్టుబడిన రెండు కిలోల గంజాయి ఉదాహరణగా నిలుస్తుంది.

విజయవాడ కేఎల్ యూనివర్సిటీ లో ఇద్దరు యువ విద్యార్థులు తాము మత్తుపదార్థాలకు బానిస కావడమే కాకుండా వాటిని తోటి విద్యార్థులకు విక్రయించి దాని ద్వారా వచ్చే సొమ్ముతో విలాసవంతమైన జీవనం గడపాలి అని భావించారు. దానికి తగినట్లుగానే ఆంధ్రా ఊటీగా పిలవబడే లంబసింగి వెళ్లి అక్కడి నుంచి రెండు కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. వారిద్దరూ 10 గ్రాముల గంజాయిని వినియోగించగా మిగిలిన దాన్ని విక్రయించాలని భావించారు. ఈ లోగా పోలీసులకు సమాచారం అందడంతో వారిద్దరి తో పాటుగా మరో నలుగురు కటకటాల పాలయ్యారు.

ప్రజా రవాణా సౌకర్యాలు ద్వారానే సరఫరా..

ప్రభుత్వం నాటుసారా గంజాయి అక్రమ మద్యం సరఫరా వంటి వాటిని అరికట్టేందుకు గత కొంతకాలం కిందట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రత్యేక తనిఖీలు చేసి మాదకద్రవ్య వినియోగాన్ని చాలావరకు అరిగట్టింది. అయితే ఈ ఎస్ఈబి అధికారుల కళ్ళను కూడా కప్పి కొందరు అక్ర మార్గంలో వీటిని సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా ఖరీదైన కార్లలో, బస్సుల్లో, రైలు మార్గాల ద్వారా గంజాయిని లంబసింగి, పాడేరు, అరకు, ఒడిస్సా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల నుంచి సరఫరా చేస్తున్నారు. దీనివల్ల ప్రత్యేక అధికారులు వీటిని పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నారు.

ఏజెంట్లు సబ్ ఏజెంట్లు..

గంజాయి సరఫరా మూడు దఫాలుగా కొనసాగుతుంది. ఒకరి నుంచి ఒకరికి ఎటువంటి కమ్యూనికేషన్ గాని, ముఖ పరిచయం గాని లేకుండా వ్యాపారం సాగుతుండటంతో పోలీసులు వారిని పట్టుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. గంజాయిని అటవీ ప్రాంతాల్లో రహస్య ప్రదేశాల్లో సాధారణ మొక్కల మధ్య తులసి మొక్కల మధ్య పెంచుతున్నారు. దానివల్లే అధికారులు అటవీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన వీటిని పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నారు. తొలుత వీటిని పండించిన మాఫియా ఒక ఏజెంట్ కు విక్రయించే బాధ్యత అప్పగిస్తుంది. ఆ ఏజెంటు కొంత దూరం వరకు సరుకును తీసుకు వచ్చిన తర్వాత మరో ఏజెంట్కు అప్పగిస్తాడు. అతను ప్రజారవాణా వాహనాల్లో ఈ సరుకును సిటీల కు తీసుకు వస్తాడు. అక్కడ ముందుగా ఎంచుకున్న కొందరు యువత ద్వారా కళాశాలలోని విద్యార్థులకు అలవాటు చేస్తారు. ఆ తర్వాత విద్యార్థులను కళాశాలలో విక్రయించే విధంగా మార్చుకుంటారు. దీనివల్ల విద్యార్థులు పోలీసులకు చిక్కిన ఎవరు తమకు సరుకు ఇచ్చారనే విషయం తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. దీనివల్ల విద్యార్థులు బలిపశువులుగా మారుతున్నారు.

ఎస్ఈబి చొరవతో తగ్గిన వినియోగం..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత మాదక ద్రవ్యాల వినియోగం నివారణ పై ప్రత్యేక దృష్టి సారించారు. దాని కోసమే ప్రత్యేకించి ఎస్ఈబి ఏర్పాటు చేశారు. గతంలో కేవలం ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రమే వీటి నివారణకు పనిచేసే వారు. కానీ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పోలీసులు ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా వీటి నివారణకు పనిచేసేలా ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారు. దీనికి జిల్లాలోని అదనపు జిల్లా ఎస్పీ ముఖ్య అధికారిగా ఏర్పాటు చేశారు. ఈ సంయుక్త ఆధ్వర్యంలో దాడుల పరంపర కొనసాగడంతో దాదాపు మూడు వంతుల వరకు వీటి వినియోగం తగ్గిందని గణాంకాలు ద్వారా తెలుస్తోంది.

Also Read : యువతకు వ్యాక్సిన్ అందాలంటే మరో నెల ఆగాల్సిందే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి