iDreamPost

పోరాట సన్నివేశాలే ఆర్ఆర్ఆర్ హైలైట్

పోరాట సన్నివేశాలే ఆర్ఆర్ఆర్ హైలైట్

టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా అంచనాలు మోస్తున్న ఆర్ఆర్ఆర్ విడుదలకు ఇంకో అరవై ఏడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఆఖరి పాట చిత్రీకరణకు ప్రస్తుతం విదేశాల్లో ఉన్న టీమ్ అది పూర్తి కాగానే ఇక్కడికి వచ్చేసి ఫుల్ లెన్త్ ప్రమోషన్లు మొదలుపెట్టనుంది. దోస్తీ పాటకు స్పందన బాగున్నప్పటికీ రాజమౌళి రేంజ్ హైప్ ఇంకా రావాల్సి ఉంది. అది జరగాలంటే జక్కన్న స్వయంగా రంగంలోకి దిగాల్సిందే. అక్టోబర్ 13 విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేనప్పటికీ నిజంగానే ఆ టైంకి రిలీజ్ చేయగలరా లేదా అనే అనుమానాలు ఇండస్ట్రీ వర్గాల్లోనే గట్టిగా ఉన్నాయి. ఇంకో నెల ఆగితే క్లారిటీ రావొచ్చు.

ఇందులో అన్నిటి కంటే ఎక్కువగా పోరాట సన్నివేశాలు హై లైట్ కాబోతున్నట్టు తెలిసింది. ఒకటి రెండు కాదు ఏకంగా పది ఫైట్లు ఎక్స్ క్లూజివ్ గా డిజైన్ చేసినట్టు సమాచారం. ఒకదాన్ని మించి మరొకటి ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటివి చూడలేదనే స్థాయిలో పిక్చరైజేషన్ జరిగినట్టు వినికిడి. ఆ మధ్య వదిలిన మేకింగ్ వీడియోలో చిన్న సాంపుల్స్ చూపించారు కానీ అదంతా సముద్రంలో బియ్యపు గింజంత అంటున్నారు. ఇన్ని ఫైట్లు ఉన్నా కూడా ఎమోషన్లకు ఎక్కడా కొదవ లేకుండా ఇద్దరు హీరోల ఇమేజ్ అభిమానుల అంచనాలు అన్నీ దృష్టిలో పెట్టుకునే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సెట్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్.

ఇంటర్వెల్ బాంగ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్, పులితో జూనియర్ ఎన్టీఆర్ చేసే ఫైట్, బ్రిటిష్ పోలీస్ స్టేషన్ మీద రాంక్ చరణ్ చేసే దాడి, క్లైమాక్స్ లో వచ్చే యుద్ధ సన్నివేశాలు ఒకదాన్ని మించి మరొకటి పూర్తిగా టికెట్ ధరకు పైసా వసూల్ అనిపించేలా ఉంటాయట. ప్రస్తుతం ఇక్కడో టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ట్రైలర్ కట్ ఎప్పుడు చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎప్పుడో జనవరికి వచ్చే సినిమాలే ఓ రేంజ్ లో హడావిడి చేస్తుండగా అతి దగ్గరలో అక్టోబర్ లో ప్లాన్ చేసుకున్న ఆర్ఆర్ఆర్ ఇక స్పీడ్ పెంచాల్సిన సమయం వచ్చేసింది. ఇంకో పది రోజుల్లో దీన్ని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు

Also Read : సెట్లో రచయితకు అంత అవకాశం ఉంటుందా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి