iDreamPost

ఆప్ఘ‌న్ మ‌హిళ‌ల్లో భ‌యం!

ఆప్ఘ‌న్ మ‌హిళ‌ల్లో భ‌యం!

తాలిబ‌న్ల పేరు చెబితేనే ఆప్ఘ‌నిస్తాన్‌లో మ‌హిళ‌లు వ‌ణికిపోతారు. వాళ్లు పెట్టే ఆంక్ష‌లు చాలా క్రూరంగా ఉంటాయి. ఆడ‌వాళ్లు చ‌దువుకోడానికి , ఉద్యోగాలు చేయ‌డానికి వాళ్లు వ్య‌తిరేకులు. ఈ రోజు కాబూల్‌లో కొన్ని వేల మంది మ‌హిళ‌లు సూప‌ర్‌స్టోర్స్ , ఇంకా ర‌క‌ర‌కాల దుకాణాల్లో ప‌నిచేస్తూ కుటుంబాల‌ని పోషిస్తున్నారు. మ‌ళ్లీ తాలిబ‌న్లు వ‌స్తే జీవితాలు తారుమారు అవుతాయి.

అమెరికా త‌త్వం ఏమంటే పాముకి విషం పోసి తానే పెంచుతుంది, మ‌ళ్లీ దానికి వ్య‌తిరేకంగా తానే పోరాడుతుంది. తాలిబ‌న్ల‌కు ప్రాణం పోసింది అమెరికానే. 79లో సోవియ‌ట్ ఆప్ఘ‌న్‌పై దాడి చేసి న‌జిబుల్లా అనే కీలుబొమ్మ‌ని అధికారంలో కూచోపెట్టింది. అత‌నికి వ్య‌తిరేకంగా ముజాహిదిన్‌లు పోరాడి ఉరి తీశారు. వాళ్ల‌కు అమెరికా ఆయుధ సాయం చేసింది. ఆ సివిల్ వార్‌లో తాలిబ‌న్ పుట్టింది. కొంత మంది ఫ‌స్తూన్ విద్యార్థులు ఒక గ్రూప్‌గా ఏర్ప‌డి ఆప్ఘ‌న్ అంతా విస్త‌రించారు. ముజాహిదిన్ వార్‌లార్డ్స్‌కి వ్య‌తిరేకంగా పోరాడి ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆప్ఘ‌నిస్తాన్ (1996) నెల‌కొల్పారు. వీళ్లు చేసిన దుర్మార్గాలు అన్నీఇన్నీ కాదు. ఆడ‌వాళ్లు బ‌య‌టికి రాకూడ‌దు, 8 ఏళ్ల వ‌య‌స్సు త‌ర్వాత స్కూల్ మానేయాలి. ఎంత అన్యాయ‌మంటే ఆడ‌వాళ్లు జ‌బ్బు ప‌డితే వాళ్ల‌కి మ‌గ డాక్ట‌ర్లు ట్రీట్ చేయాలంటే ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ల స‌మ‌క్షంలోనే చేయాలి. ఈ ఉన్మాదం వ‌ల్ల ల‌క్ష‌ల మంది అమాయ‌కులు చ‌నిపోయారు. బిన్‌లాడెన్ దాడుల‌తో అమెరికా క‌ళ్లు తెరుచుకొంది. ఆప్ఘ‌న్‌పై యుద్ధం ప్ర‌క‌టించిన సైన్యాన్ని దించింది. తాలిబ‌న్లు ప‌రార‌య్యారు. 2001లో ప్రారంభ‌మైన ఈ యుద్ధం ఇంకా కొన‌సాగుతూ ఉంది. శాంతి చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మైతే ముగుస్తుంది. కానీ తాలిబ‌న్ల గురించి తెలిసిన వాళ్లెవ‌రూ దీన్ని న‌మ్మ‌డం లేదు.

18 ఏళ్ల‌కు పైగా జ‌రుగుతున్న ఈ యుద్ధంలో ప్ర‌పంచంలోని చాలా దేశాలు సంకీర్ణ ద‌ళాల్లో పాల్గొన్నాయి (మ‌న దేశం మిన‌హాయింపు). 3.50 ల‌క్ష‌ల మంది ఆప్ఘ‌న్ ద‌ళాల‌కి 17000 మంది సంకీర్ణ ద‌ళాలు సాయం చేశాయి. 20 వేల మంది మిల‌ట్రీ కాంట్రాక్ట‌ర్లు ప‌నిచేశారు (అమెరికా వాళ్లే ఎక్కువ‌ని వేరే చెప్ప‌క్క‌ర్లేదు). దీంట్లో మ‌న దేశం వాళ్లు కూడా ఉన్నారు. 4 వేల మంది కాంట్రాక్ట‌ర్లు లేదా వారి సిబ్బంది యుద్ధంలో చ‌నిపోయారు. దీంట్లో ప‌ది మంది మ‌న‌వాళ్లు ఉన్నారు. అమెరికా 4 వేల మంది సైనికుల‌ను పోగొట్టుకుని 20 వేల మందిని గాయాల‌పాలు చేసింది. ల‌క్ష కోట్ల డాల‌ర్ల‌కు పైగా ఖ‌ర్చు చేసింది. ఇప్పుడు ఒత్తిడి త‌ట్టుకోలేక ట్రంప్ శాంతి కుదుర్చుకున్నాడు. పులితో దేవుడు కీర్త‌న‌లు పాడించ‌డం సాధ్యం కాదు. రేపు అమెరికా ద‌ళాలు వెళ్లిపోతే ఆప్ఘ‌న్ అల్ల‌క‌ల్లోల‌మే. దీని వ‌ల్ల మ‌న‌కు ప్ర‌మాదం ఏంటంటే ఆ తీవ్ర వాదం పాకిస్తాన్‌లోకి, అక్క‌డి నుంచి మ‌న‌దేశంలోకి వ‌స్తుంది. క‌రోనా వైర‌స్ కంటే ప్ర‌మాద‌క‌రం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి