iDreamPost

మరోసారి రుణమాఫీ..

మరోసారి రుణమాఫీ..

2014 ఎన్నికల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అటు కేసీఆర్ , ఇటు చంద్రబాబు రైతు రుణమాఫీ అంశాన్ని మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా పొందు పరిచి ఎన్నికలకు పోగా , ఇటు వైసీపీ అధినేత జగన్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా రుణమాఫీ చేయలేమని స్పష్టం చేసి ఆ హామీ లేకుండానే ఎన్నికలకు సన్నద్ధమయ్యారు . కాగా అటు కేసీఆర్ , ఇటు బాబు గెలుపొందాక కేసీఆర్ రుణమాఫీ పై కొన్ని షరతులు విధించి 25 వేల రుణం వరకూ సింగిల్ సెటిల్మెంట్ పద్దతిలో , లక్ష వరకూ 4 వాయిదాల్లో తీర్చే విధంగా ప్రణాళిక రూపొందించి మొత్తంగా 35 లక్షల మంది రైతులకు 2015 నుండి 2018 సంవత్సరం వరకూ 16 వేల కోట్లు నిధులతో నాలుగు విడతల్లో రుణమాఫీ చేశారు .

ఆంధ్రప్రదేశ్ లో చూస్తే మొదటి ఐదు సంతకాల్లో మొదటి సంతకం రుణమాఫీ పై చేస్తానన్న బాబు ప్రమాణ శ్వీకార వేదిక సాక్షిగా మాట తప్పి రుణమాఫీ విధివిధానాల పై నాబార్డ్ కోటయ్య అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పాటు చేస్తూ సంబంధిత ఫైల్ పై సంతకం చేశారు . నాటి నుండి 87 వేల కోట్లుగా ఉన్న రైతు ఋణభారాన్ని పలు ఆంక్షలు , వడపోతల ప్రహసనాలతో చివరికి 24 వేల కోట్లకి కుదించి అది నాలుగు విడతల్లో అందిస్తామని విధి విధానాలు రూపొందించి పలు ఆంక్షల నడుమ చివరికి మూడు విడతల్లో 13 వేల కోట్లు చెల్లించి నాలుగు ఐదు విడతలు చెల్లించకుండా ఎన్నికల రోజుల్లో ఎన్నికల తర్వాత చెల్లుబాటు చేస్తానని చెప్పి బాండ్స్ , పోస్ట్ డేటెడ్ చెక్కులతో మభ్యపెట్టే ప్రయత్నం చేశారు . బాబు ఓటమికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటి అని చెప్పొచ్చు .

ప్రస్తుతానికి వస్తే 2019 ఎన్నికల్లో జగన్ ఏటా 12500 చొప్పున 2020 జూన్ నుండి పంట సాయం హామీ ఇవ్వగా , కేసీఆర్ గత పాలనా కాలం రుణమాఫీ ఫార్ములాతోనే లక్ష వరకూ మాఫీ హామీతో ఇరువురూ గద్దెనెక్కారు . అధికారం చేపట్టిన వెంటనే జగన్ హామీ ఇచ్చిన 2020 సంవత్సరానికన్నా ముందే 19 నుండే రైతు భరోసా ప్రారంభించగా , ఈ రోజు తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా రుణమాఫీ షెడ్యూల్ విడుదల చేసారు . 25 వేల లోపు రుణ మొత్తాన్ని ఒకేసారి , లక్ష వరకూ ఉన్న ఋణాల్ని , లక్ష పైన ఉన్న ఋణాల్లో లక్ష వరకూ నాలుగు విడతల్లో 25 వేల చొప్పున మాఫీ చేస్తామని జీవో విడుదల చేసారు . కాగా 2014 నుండి 18 వరకూ 35 లక్షల మంది రైతులకి లబ్ది కలగగా , ప్రస్తుతం మరో 7 లక్షల మంది రైతులు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు .

అందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఈ విధంగా ఉన్నాయి .

2014 ఏప్రిల్ 1 తర్వాత రుణం పొంది ఉండాలి .
2018 డిసెంబర్ 31 నాటికి బ్యాంక్ లో బకాయి ఉన్నవాటినే పరిగణనలోకి తీసుకొంటారు .
పట్టణ ప్రాంత బ్యాంక్స్ లో బంగారం కుదువబెట్టి తీసుకొన్న ఋణాల్ని వ్యవసాయ ఋణంగా పరిగణించరు .
2014 లో అమలు చేసిన తీరుగానే బ్యాంకర్లకు కాకుండా రైతులకు అకౌంట్ పే చెక్స్ అందిస్తారు
అర్హుల జాబితాను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ కమిటీ ఖరారు చేసి ఐటీ పోర్టల్ లో డేటాను అప్లోడ్ చేస్తారు .
ఆ లిస్ట్ ప్రకారమే అర్హులైన రైతులకు అకౌంట్ పే చెక్స్ అందిస్తారు .
ఇందుకు సంబంధించి తుది గడువును ప్రకటించలేదు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి