iDreamPost

అభిమానుల కోరిక తీర్చిన ఫ్యామిలీ మ్యాన్

అభిమానుల కోరిక తీర్చిన ఫ్యామిలీ మ్యాన్

సీరియల్స్ తరహాలో ఎపిసోడ్ల రూపంలో ఓటిటిలో వచ్చే వెబ్ సిరీస్ లకు మన దేశంలో ఇంత త్వరగా ఆదరణ దక్కడం ఎవరూ ఊహించనిది. ముఖ్యంగా గత రెండేళ్లలో క్వాలిటీ కంటెంట్ విషయంలో ఆయా సంస్థలు తీసుకున్న శ్రద్ధ కారణంగా ఇప్పుడు వీటి డిమాండ్ మాములుగా లేదు. మిర్జాపూర్, స్కామ్ 1992, బ్రీత్, ఇన్ సైడ్ ఎడ్జ్, సెక్రేడ్ గేమ్స్ లాంటివి జనానికి ఓ రేంజ్ లో నచ్చేశాయి. వీటి సీక్వెల్స్ కోసం కూడా ఫ్యాన్స్ ఏదో పెద్ద సినిమాల కోసం ఎదురు చూసినట్టు సోషల్ మీడియాలో హంగామా చేయడం అబద్దం కాదు. గంటల తరబడి ఉన్నా ఒకే ఫ్లోలో వీటిని రాత్రిళ్ళు మేలుకుని చూసే అభిమానులు లక్షల్లో ఉన్నారు.

మొదట్లో ఇవి హిందీ, ఇంగ్లీష్ లాంటి ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే వచ్చేవి. క్రమంగా సౌత్ లోనూ వీటికి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో క్రమంగా డబ్బింగ్ చేసి వదలడం ఎక్కువయ్యింది. అందులోనూ అమెజాన్ ప్రైమ్ లో వచ్చే ఫ్యామిలీ మ్యాన్ కు మాములు ఫ్యాన్స్ లేరు. రెండు నెలల క్రితం దీని సెకండ్ సీజన్ వచ్చినప్పుడు తెలుగు తమిళంలో రిలీజ్ చేయాలని గట్టి ఎత్తున విన్నపాలు వెల్లువెత్తాయి. కానీ ఎందుకో మరి ప్రైమ్ ఆలస్యం చేసుకుంటూ వచ్చింది. ఆఖరికి వాళ్ళ మొర వినేసి నిన్నటి నుంచి తెలుగు తమిళంలో అనువదించి స్ట్రీమింగ్ కి పెట్టేశారు. దీంతో ఇన్ని రోజుల నిరీక్షణకు బ్రేక్ పడినట్టు అయ్యింది.

ఈ ఫ్యామిలీ మ్యాన్ ఇంతగా ఆదరణ పొందడానికి కారణం లేకపోలేదు. ఒక మధ్యతరగతి ఇంటెలిజెన్స్ ఉద్యోగికి ప్రమాదకరమైన తీవ్రాదులతో ముడిపెట్టి దర్శకులు రాజ్ అండ్ డీకె నడిపించిన డ్రామా ఓ రేంజ్ లో పండింది. ముఖ్యంగా సెకండ్ సీజన్ లో సమంతతో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయించడం భారీ హైప్ ని తీసుకొచ్చింది. తెలుగులో కావాలని అభిమానులు కోరడానికి ఇది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. అన్నట్టు ఈ కుటుంబ మనిషికి మూడో భాగం కూడా వస్తుందట. ఆల్రెడీ ఆ క్లూ కూడా ఇచ్చేశారు. భవిష్యత్తులో ఇలాంటి వెబ్ సిరీస్ ల బడ్జెట్ పదుల నుంచి వందల కోట్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదు

Also Read : రాఖీ భాయ్ కొత్త సినిమా ఎవరితో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి