iDreamPost

కరోనా కాలంలోనూ రైతులను ఆదుకుంటున్న జగన్ సర్కార్ ..అయినా ఆరోపణలేనా ?

కరోనా కాలంలోనూ  రైతులను ఆదుకుంటున్న జగన్ సర్కార్ ..అయినా ఆరోపణలేనా ?

కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రమంతా లాక్ డౌన్లోనే ఉన్నా జగన్మోహన్ రెడ్డి సర్కార్ మాత్రం వ్యవసాయ రంగం విషయంలో బాగానే శ్రద్ధ తీసుకుంటోంది. పంటలను కోనటం, గిట్టుబాటు ధరలు చెల్లిస్తోంది. కొనుగోలు చేసిన పంటలను రైతుబజార్లకు తరలించటంలో బిజీగా ఉంటోంది. విచిత్రమేమిటంటే ప్రభుత్వం ఇంత చేస్తున్నా టిడిపి మాత్రం జగన్ పై ఆరోపణలు చేస్తునే ఉంది. పార్టీ సీనియర్ నేత దూళిపాళ నరేంద్ర జగన్ కు రాసిన లేఖలో ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించాడు.

పోయిన ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్ధిక సంవత్సరంలో ఎక్కువ నిధులు వచ్చినా జగన్ ఇంకా బీద అరుపులు అరవటం ఏమిటంటూ నిలదీశాడు. భారీగా నిధుల లభ్యత ఉన్నా ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆరోపణలు చేశాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పరిపాలనకు జగన్ పనికిరాడని, చంద్రబాబునాయుడు మాత్రం బ్రహ్మాండమంటూ జనాలకు టిడిపి చెప్పటానికి ప్రయత్నం చేసింది. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వానికి రూ. 1.57 లక్షల కోట్లు వస్తే, 2019-20 ఆర్ధిక సంవత్సరంలో రూ. 1.87 లక్షల కోట్లు వచ్చినట్లు దూళిపాళ చెప్పారు.

నిధుల లభ్యత పెరిగిన మాట వాస్తవమే అయ్యుండచ్చు కానీ దానితో పాటు ప్రభుత్వ వ్యయం కూడా పెరిగింది కదా ?పెరిగిన ఆదాయం మూరెడు అయితే పెరిగిన ఖర్చు బారెడు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్నీ సంపూర్ణంగా అమలు చేయలేదు. అప్పట్లో వచ్చిన ఆదాయంలో అమరావతి నిర్మాణం పేరుతో తాను, తన భజన బృందాలు విదేశాల్లో తిరగటానికి, శంకుస్ధాపనలకు, ఆర్కిటెక్టులకు, సింగపూర్ కంపెనీలకు, ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెంచేసి తన మద్దతుదారులకు దోచిపెట్టటానికే సరిపోయింది. మరి జగన్ అలా కాకుండా అధికారంలోకి వచ్చిన రోజు నుండే హామీల అములుకు శ్రీకారం చుట్టిన కారణంగా ఖర్చులు పెరగవా ? పైగా రివర్స్ కాంట్రాక్టుల పేరుతో డబ్బులు ఆదా చేస్తున్నాడు.

అలాగే వ్యవసాయోత్పత్తులు కొనటానికి, పంటలకు గిట్టుబాటు ధరలు కూడా చెల్లించటం లేదని ఆరోపించటం కూడా తప్పే. ఎలాగంటే ఖరీఫ్ సీజన్లో 48.10 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొన్నట్లు ప్రభుత్వం చెప్పింది. దీనికోసం రూ. 8754 కోట్లు ఖర్చు చేసింది. ధాన్యం కొనుగోలు కోసం 810 కేంద్రాలు తెరిచింది. అలాగే 250 మెట్రిక్ టన్నుల అరటిని కూడా మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసింది. శుక్రవారం అన్నీ రైతు బజార్లకు అందిస్తోంది.

ఇక జీతాల్లో కోత విషయం చూస్తే ఉద్యోగులకు లేని సమస్య చంద్రబాబు, టిడిపి నేతలకు ఎందుకు ? అంటే ఉద్యోగులను జగన్ పైకి రెచ్చగొట్టడమే టిడిపి వ్యూహమా ? వ్యవసాయోత్పత్తులను ప్రభుత్వం కొనటం లేదని ఆరోపణలే విచిత్రంగా ఉంది. సంక్షోభ సమయంలో కూడా ఎక్కడా టెన్షన్ పడకుండా జగన్ పనిచేసుకుపోవటాన్ని బహుశా టిడిపి జీర్ణించుకోలేకపోతోందేమో ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి