iDreamPost

కరోనా పై పోరుకి నకిలీ బెడద

కరోనా పై పోరుకి నకిలీ బెడద

కరోనా పై పోరు సలుపుతున్న ప్రస్తుత అపత్కాలంలోనూ నకిలీ, నాణ్యతలేని పరికరాల బెడద తప్పడం లేదు. మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. లాక్ డౌన్ విధించుకుని అన్ని విధాలా నష్టపోతున్నాయి. కష్టనష్టాలను ఎదుర్కొంటూ ప్రజలు కరోనా పై పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకు సహకరిస్తున్నారు. అయితే కొంతమంది వ్యాపారస్తుల అత్యాశ కరోనా పై పోరాటానికి తాత్కాలికంగా బ్రేకులు వేస్తోంది. కరోనాను నియంత్రించాలంటే గరిష్టంగా పరీక్షలు చేసి బాధితులను ఐసోలేషన్ కు తరలించాలి. అనుమానితులందరికీ వేగంగా పరీక్షలు నిర్వహించాలి. అప్పుడే వైరస్ లింక్ ను కట్ చేయగలమని నిపుణులు చెబుతున్నారు. లేదంటే చాపకింద నీరులా ఈ మహమ్మారి విస్తరిస్తూనే ఉంటుంది. ఈ విషయం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం.

వైరస్ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా తక్కువగానే ఉన్నాయి. మన దేశం పరిస్థితి కూడా అంతే. వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి కొత్త వైరాలజీ ల్యాబ్ లను ఏర్పాటు చేయడంకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి. దేశం మొత్తం మీద ఇప్పటి వరకు 4.50 లక్షల మందికి మాత్రమే కరోనా పరీక్షలు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ ల ద్వారా వేగంగా పరీక్షలు నిర్వహించేందుకు ఒక అవకాశం లభించింది. దక్షిణ కొరియా ఈ టెస్ట్ కిట్లను సరఫరా చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం దాదాపు ఐదు లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లను దిగుమతి చేసుకుంది. ఆ కిట్లను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేసింది.

కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పరీక్షలు చేయడం ప్రారంభించాయి. అయితే వీటి నాణ్యత పై అనేక ఆరోపణలు, సందేహాలు రావడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా పరీక్షలు చేయడం తాత్కాలికంగా నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కిట్ల నాణ్యతపై పరిశీలన చేస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రాలకు పంపించిన కిట్లను రీప్లేస్ చేస్తామని వెల్లడించింది. ఫలితంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వైరాలజీ ల్యాబుల ద్వారానే మరికొన్ని రోజులపాటు పరీక్షలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి