iDreamPost

ఒక్క రోజు గ్యాప్ లో చిత్తూరుకు చంద్రబాబు.. కారణం ఏమిటి..?

ఒక్క రోజు గ్యాప్ లో చిత్తూరుకు చంద్రబాబు.. కారణం ఏమిటి..?

కేవలం ఒక్క రోజు వ్యవధిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మూడు రోజుల కుప్పం పర్యటనను ముగించుకుని శనివారం హైదరాబాద్‌ వెళ్లిన చంద్రబాబు.. మళ్లీ ఈ రోజు చిత్తూరు వెళ్లడం వెనుక అసలు విషయం ఏమిటి..? ఈ రోజు ఉదయం నుంచి రేణిగుంట విమానాశ్రయంలో జరుగుతున్న పరిణామాల వెనుక అసలు నిజానిజాలు ఏమిటి..?.

మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో మనోధైర్యం నింపేందుకు, వైసీపీ నేతల నుంచి వస్తున్న బెదిరింపులకు నిరసనగా చిత్తూరు, తిరుపతి నగరాల్లో ధర్నా చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు వస్తున్నారని టీడీపీ బాబు పర్యటన షెడ్యూల్‌ను మీడియాకు వెల్లడించింది. ఉదయం 9:45 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారని, చిత్తూరు నగరంలోని గాంధీ కూడలి వద్ద ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు ధర్నా, సాయంత్రం 5:45 గంటలకు తిరుపతి ఆర్టీసీ బస్‌స్టాండ్‌ సెంటర్‌లో నిరసన కార్యక్రమం, అనంతరం ఆటోనగర్‌లోని పార్లమెంట్‌ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో భేటీ అవుతారని, రాత్రి 7:15 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు పయనం అవుతారని టీడీపీ బాబు పర్యటన షెడ్యూల్‌లో పేర్కొంది. ఈ వివరాలతో జిల్లా టీడీపీ నేతలు పోలీసుల అనుమతి కోరారు. అయితే ఎన్నికల సమయంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని చెబుతూ పోలీసులు వారి వినతిని తిరస్కరించారు. అయినా చంద్రబాబు చిత్తూరు పర్యటనకు వెళ్లారు. ఆయనకు స్వాగతం చెప్పేందుకు రేణిగుంట విమానాశ్రయానికి టీడీపీ నేతలు వెళ్లారు.

అనుమతి లేకపోయినా, ఎన్నికల సమయంలో ధర్నాలు, నిరసన చేయడం నిబంధనలకు విరుద్ధమైనా పట్టించుకోకుండా చిత్తూరుకు వచ్చేందుకు సిద్ధమైన చంద్రబాబును పోలీసులు రేణిగుంట విమానాశ్రయం లాంజ్‌లో నిలువరించారు. «చిత్తూరులో ధర్నా, తిరుపతిలో నిరసనకు అనుమతిలేదని చెప్పారు. రాతపూర్వకంగా తెలియజేశారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్నామని చెబుతున్న టీడీపీ నేతలు, చంద్రబాబు.. అనుమతి పత్రం మాత్రం ఇవ్వడం లేదు. ఎన్నికల కమిషన్‌ నుంచి తమకు ఈ పర్యటనపై ఎలాంటి సమాచారం లేదని పోలీసులు చెప్పారు.

తాను కలెక్టర్‌ను, ఎస్పీని కలిసేందుకు వెళుతున్నానంటూ చంద్రబాబు స్వరం మార్చారు. అయినా పోలీసులు ససేమిరా అన్నారు. కలెక్టర్, ఎస్పీని ఇక్కడికే పిలిపిస్తామని ఆఫర్‌ ఇచ్చారు. దానికి ఒప్పుకోని చంద్రబాబు.. విమానాశ్రయం లాంజ్‌లో బైటాయించారు. పోలీసుల వినతిని పెడచెవిన పెట్టారు. ఈ సమయంలో టీడీపీ అనుకూల మీడియా కావాల్సిన ప్రచారాన్ని తెచ్చిపెట్టే ప్రయత్నం చేసింది. టీడీపీ నేతలు ప్రభుత్వం, సీఎం వైఎస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని మైకులముందుకొచ్చారు. ఎన్నికలు జరిగే సమయంలో పోలీసులు, అధికార యంత్రాంగం అంతా ఎన్నికల కమిషన్‌ పరిధిలో పని చేస్తుంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను అమలు చేస్తుంది. ఈ విషయాన్ని దాటవేస్తున్న టీడీపీ నేతలు.. చంద్రబాబును ప్రభుత్వం అడ్డుకుందనేలా ప్రజలను మభ్యపెట్టేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు.

రోజు వ్యవధిలోనే చంద్రబాబు చిత్తూరు పర్యటనకు రావడానికి కారణం మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు వెనుకంజ వేయడమే. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లలో నామినేషన్లు వేసిన మెజారిటీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అంచనా వేసుకున్న అభ్యర్థులు డబ్బు వృథాతోపాటు పరువు పోగొట్టుకోవడం ఎందుకని నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు సిద్ధమైన విషయం చంద్రబాబుకు చేరింది. దీంతో హుటాహుటిన ఆయన చిత్తూరు పర్యటనకు బయలుదేరారు. ఇప్పటికే పలువురు టీడీపీ కార్పొరేట్‌ అభ్యర్థులను బెంగుళూరుకు తరలించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేవరకూ వారిని క్యాంపులోనే ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థి సహా, అతని కుటుంబం మొత్తాన్ని క్యాంపునకు తరలించి ఇళ్లకు తాళాలు వేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ కుప్పం తరహా ఫలితాలు వస్తే.. ఉనికికే ఇబ్బందని భావించిన చంద్రబాబు.. ఈ తరహా రాజకీయానికి తెరతీయడం ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి