iDreamPost

జియోలో భారీ పెట్టుబడి పెట్టిన ఫేస్‌బుక్‌

జియోలో భారీ పెట్టుబడి పెట్టిన ఫేస్‌బుక్‌

భారత టెలికాం సంస్థ రిలయన్స్‌ జియోలో సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ భారీ పెట్టుబడి పెట్టింది.ముకేశ్ అంబానీకి చెందిన జియోలో 9.9 శాతం వాటాను రూ. 43,574 కోట్ల పెట్టుబడితో కొనుగోలు చేసినట్లు ఫేస్‌బుక్‌ బుధవారం ప్రకటించింది. ఈ వాటా కొనుగోలుతో జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా ఫేస్‌బుక్‌ నిలవనుంది. ఫేస్‌బుక్ పెట్టుబడి తరువాత జియో సంస్థ ప్లాట్‌ఫామ్‌ల విలువ 4.62 లక్షల కోట్లకు పెరిగింది.భారతదేశంలోని సాంకేతిక రంగంలో ఎఫ్‌డిఐ కింద ఇదే అతిపెద్ద పెట్టుబడి అని రిలయన్స్ సంస్థ ప్రకటించింది.

అలాగే జియో ప్లాట్‌ఫామ్స్,రిలయన్స్ రిటైల్,వాట్సాప్ మధ్య కూడా వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరింది.ఈ ఒప్పందం ప్రకారం రిలయన్స్ రిటైల్ ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ వినియోగం ద్వారా జియోమార్ట్ ప్లాట్‌పామ్‌పై న్యూ కామర్స్ బిజినెస్‌ను భారత్‌లో విస్తరించనుంది.
ఆర్ఐఎల్‌ సంస్థ ఒప్పందాన్ని ప్రకటిస్తూ భారత్‌లోని అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న ఆరు కోట్ల చిన్న తరహా వ్యాపారాలకు చేయూతనివ్వాలన్నదే మా లక్ష్యం.గ్రామీణ,పట్టణ ప్రాంతాల వారిని ఏకం చేయాలనుకుంటున్నాం.కరోనా సంక్షోభం తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, దానికి జియో,ఫేస్‌బుక్ బంధం బాటలు వేస్తుందని పేర్కొంది.

అలాగే ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులలో భారతీయులే ఎక్కువ అని సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపాడు.ఇక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారత్‌ నిలయంగా ఉందని పేర్కొన్నారు.డిజిటల్‌ వ్యవస్థ దిశగా భారత సమాజం వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో జియో కీలక పాత్ర పోషించిందని అభిప్రాయపడ్డారు.

కాగా భారత్‌లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న టెలికాం నెట్‌వర్క్‌ మార్కెట్లోకి 2016లో అడుగుపెట్టి కేవలం నాలుగేళ్లలో దేశంలోని అతిపెద్ద టెక్ సంస్థగా అవతరించింది.రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్ఐఎల్‌)లో భాగమైన రిలయన్స్‌ జియోకి ఇప్పటి వరకు 38.8 కోట్ల వినియోగదారులు ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి