iDreamPost

ఆలోచింపజేసిన న్యాచురల్ స్టార్

ఆలోచింపజేసిన న్యాచురల్ స్టార్

నిన్న తిమ్మరుసు ఆడియో ఫంక్షన్ లో నాని మాటలు అందరినీ ఆలోచనలో పడేశాయి, ఆకట్టుకున్నాయి. థియేటర్ల గురించి వాటి మనుగడ గురించి ఓపెన్ గా చెప్పిన తీరు పరిశ్రమలోని ఎందరో మనోభావాలను ప్రతిబింబించింది. సినిమాకున్న ప్రాముఖ్యత గురించి చెబుతూనే ప్రభుత్వాలు థియేటర్లను తెరిపించడంలో చూపిస్తున్న అలసత్వాన్ని కూడా కాస్త సున్నితంగానే ప్రశ్నించాడు. భారతీయుల జీవితాల్లో సినిమా ఎంతగా ఇంకిపోయిందో, కరోనా వచ్చాక ఎన్ని జాగ్రత్తల మధ్య ప్రేక్షకులు యజమానులు ఆ ఎక్స్ పీరియన్స్ ఇస్తున్నారో చూస్తున్నారో చక్కగా వివరించాడు. తమ మనసులో మాటలు చెప్పడానికి సరైన వేదికనే ఎంచుకున్నాడు

నాని చెప్పాడని కాదు కానీ నిజంగానే ఇవి సీరియస్ గా ఆలోచించాల్సిన విషయాలు. సగం సీట్లు, నిబంధనలు, టికెట్ రేట్లు ఇవన్నీ ప్రభుత్వాల వైపు నుంచే కాదు ఇండస్ట్రీ వైపు కూడా చర్చ జరగాలి. ఇటీవలి కాలంలో సినిమాకు పెట్టిన బడ్జెట్ తో సంబంధం లేకుండా అనుమతులు వస్తున్నాయి కదాని ప్రతి మీడియం రేంజ్ చిత్రానికి సైతం టికెట్ రేట్లు పెంచేసి వారం పది రోజులు సామాన్యుడికి కొత్త వినోదాన్ని దూరం చేస్తున్న పరిణామం మీద దృష్టి పెట్టాలి. వందల కోట్లతో తీసిన సినిమాకు పాతిక కోట్లలో తీసిన చిత్రానికి ఒకే స్థాయిలో మొదటి రెండు వారాలు టికెట్ రేట్లు పెంచడం చాలా ప్రభావం చూపిస్తోంది.

ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోతుందని కాదు కానీ కనీసం నాని ఏదో ఒక ముందడుగు వేశాడు. మిగిలినవాళ్లు ఈ రోజో రేపో గళం విప్పకపోరు. పరిశ్రమ బాగుండాలంటే జనం థియేటర్లకు మునుపటిలా రావాలంటే ఏం చేయాలో అందరూ సమిష్టిగా ఆలోచించాలి. ఒక ప్రణాళికను రచించుకోవాలి. అప్పుడే మార్పు సాధ్యం. సినిమాకు తగ్గట్టు రేట్లు మారే ఫ్లెక్సీబుల్ ప్రైజింగ్ మంచిదే. కానీ అది బడ్జెట్ కు అనుగుణంగా ఉండాలి తప్ప హీరోల రెమ్యునరేషన్లను ఆధారంగా చేసుకుని కాదు. చూడాలి మరో కరోనా రెండేళ్లుగా చూపిస్తున్న ప్రభావం రాబోయే రోజుల్లో ఇలాంటి పోకడతో ఏదైనా మార్పు తెస్తుందో లేదోనని.

Also Read: టెంప్ట్ చేసే ఆఫర్ – అయినా ఇరకాటం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి