iDreamPost

పోలవరం ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీపై రాజీ పడొద్దు అంటున్న ఉండవల్లి

పోలవరం ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీపై రాజీ పడొద్దు అంటున్న ఉండవల్లి

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పునరావాసానికి అవసరమైన నిధులను కేంద్రమే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వాటిని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం బలంగా ప్రయత్నించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుకి పూర్తి నిధులు ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ కేంద్రం పూర్తిగా చెల్లించడానికి సిద్ధంగా లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పట్ల చిన్నచూపు ఉందన్నారు. ‘పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తారో.. ఇవ్వరో కేంద్రంతో తేల్చుకోవాల్సిన అవసరముందన్నారు. పునరావాస ప్యాకేజీపై రాజీపడకుండా నిధులు తీసుకురావడానికి కృషి చేయాలన్నారు.

పోలవరం పర్యటనకు వెళ్లే వారికి అనుమతి ఇవ్వాలన్నారు. పోలవరం ఎత్తు తగ్గించకుండా చూడాలన్నారు. పోలవరం నిర్మాణంలో కీలకం రిజర్వాయర్ అని ఉండవల్లి పేర్కొన్నారు. రిజర్వాయర్ మూలంగా నీటి నిల్వతో ముంపు ప్రాంతం ఎక్కువగా ఉండడం, అందులో గిరిజనులు అత్యధికులు కావడం వల్లే సుదీర్ఘకాలంగా ప్రాజెక్ట్ జాప్యం జరిగిందన్నారు. ఇప్పుడు పోలవరం ఎత్తు తగ్గించే పరిస్థితి రాకూడదని ఉండవల్లి వ్యాఖ్యానించారు. డీపీఆర్ ప్రకారం పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు కట్టాల్సిందేనని ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. లేదంటే ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు.

అయితే ఉండవల్లి వ్యాఖ్యలపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం, స్వయంగా సీఎంతో పాటుగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ఎత్తు తగ్గించడం లేదనే విషయాన్ని స్పష్టం చేసినప్పటికీ మరోసారి ఆయన ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చిందన్నది అంతుబట్టడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. డ్యామ్‌ డిజైన్‌ ప్రకారం ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ‌ 45.72 మీటర్లు ఉంటుందని ఇటివల పోలవరం పర్యటనలో సీఎం తేల్చిచెప్పిన తర్వాత మరోసారి ఉండవల్లి ఎత్తు గురించి చేస్తున్న వాదన వెనుక అసలు కారణమేంటని ప్రశ్నిస్తున్నారు.

కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) డ్యామ్‌ సేఫ్టీ అండ్‌ స్టెబిలిటీ ప్రోటోకాల్‌ ప్రకారం ఏదైనా జలాశయం నిర్మాణం పూర్తయిన తర్వాత తొలి ఏడాది 33 శాతం, రెండో ఏడాది 50 శాతం, మూడో ఏడాది పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే పోలవరంలో తొలి ఏడాదే 41.15 మీటర్లలో 120 టీఎంసీల దాకా నిల్వ చేసే సామర్థ్యం వరకు ప్రాజెక్టును పూర్తి చేస్తున్నట్టు ప్రభుత్వం , పీపీఏ కూడా ధృవీకరించాయి. దశలవారీగా నిర్వాసితులకు పునరావాసం కల్పించి పూర్తి స్థాయి నీటి నిల్వ మట్టం(ఎఫ్‌ఆర్‌ఎల్‌) 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేస్తామని స్పష్టం చేశారు. అందులో భాగంగా రూ. 3,330 కోట్లతో వచ్చే మార్చి నాటికి 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాస కల్పన పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయినప్పటికీ ఉండవల్లి మాత్రం ఎత్తు విషయంలో చేసిన వ్యాఖ్యలు ప్రశ్నార్థకంగా కనిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి