iDreamPost

మామ లేని లోటు అల్లుడు తీరుస్తున్నాడుగా..

మామ లేని లోటు అల్లుడు తీరుస్తున్నాడుగా..

చిత్తూరు మాజీఎంపీ శివప్రసాద్ గురించి బహూశా తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు.. ఆయన చివరి రోజుల వరకూ వేషాలు, పలు ప్రదర్శనలతో మనందరి కళ్లముందు తన ఆవేదనను వివిధ రూపాల్లో నిరసనలు ప్రదర్శించిన వ్యక్తి.. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో గతేడాది సెప్టంబర్ లో చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు.  రాజకీయంగా నిరసనలు తెలపడం సాధారణమే అయినా సమస్య ఏదైనా విభిన్నంగా, వింత వేషాలతో స్పందించడం ఆయన నైజం.. శివప్రసాద్ వృత్తిరీత్యా వైద్యుడైనా ఆయన ప్రవృత్తి నటన.. తిరుపతిలో డాక్టర్ గా పనిచేస్తున్న సమయంలోనే సినీరంగంలో ప్రవేశించిన ఆయన ఎన్నో సినిమాల్లో చిన్నా చితక వేషాలతో అలరించారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన మాస్టారి కాపురం శివప్రసాద్ కు మంచిపేరు తెచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో 2006లో వచ్చిన డేంజర్ సినిమాలో విలన్‌గా చేసి మెప్పించారు. ఈ సినిమాలో ఆయన నటనకు ఉత్తమ విలన్‌గా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇక నితిన్ హీరోగా వచ్చిన ఆటాడిస్తా సినిమాలో నన్నెవరూ కొట్లే అనే డైలాగ్‌తో బాగా ఫేమస్ అయ్యారు.

వైద్యం, సినిమా రంగం తర్వాత ఆయన దృష్టి రాజకీయాల వైపు మళ్లింది.. చంద్రబాబు చదువుకున్న కాలేజీలోనే చదువుకోవడంతో ఆయనతో ఉన్న పరిచయం రాజకీయాల్లో అడుగుపెట్టేలా చేసింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శివప్రసాద్ 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ ఎంపీగా గెలిచారు. ఇటీవల జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి రెడ్డప్ప చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే స్వతహాగా నటుడైన శివప్రసాద్ ఎంపీగా ఉన్నపుడు తన నిరసనలను అదే రీతిలో తెలిపేవారు. గతంలో రాష్ట్ర విభజన సమయంలో విభజన వల్ల కలిగే నష్టాలను, సొంత అన్నదమ్ములను విడదీస్తే వచ్చే కష్టాలను, ఉమ్మడి కుంటుంబం విడిపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి అనే అంశాలను విభజనతో పోల్చుతూ పార్లమెట్ ఆవరణలో విచిత్ర వేషధారణలో వివరించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వ్యతిరేకంగా ఆయన అనేక పాటలు పాడుతూ, వేషాలు వేసారు. ఈ విషయంలోనే కాంగ్రెస్ ఎంపీలతో ఘర్షణ పూరిత వాతావరణానికి శ్రీకారంచుట్టారు. అడాల్ప్ హిట్లర్ గా, తాంత్రికుడుగా, తమిళనాడు మాజీసీఎం ఎంజేఆర్ గా అనేక వేషాలు వేషాలతో సాటి ఎంపీలను అలరించారు. 2014నుంచి 2019వరకు ప్రత్యేకహోదా అజెండాగా ఆయన వేషధారణలు సాగాయి. ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేకహోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలని పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ రకరకాల వేషధారణల్లో నిరసనలు తెలిపారు.

దీంతో ఓదశలో ఆయన జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించారు. పార్లమెంట్ ఆవరణలో తను చేసే విన్యాసాల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అసలు పార్లమెంట్ వద్ద ఇలా కూడా నిరసనలు తెలపొచ్చా అనే సందేహం అందరికీ కలిగేలా వ్యవహరించారు. అనేక సందర్భాల్లో తాను చేసిన విన్యాసాలతో దేశవ్యాప్తంగా నవ్వులు పూయించారాయన.. ఢిల్లీ వేదికగా శివప్రసాద్ చేసిన విన్యాసాలకు సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడి నవ్వుకున్న సందర్భాలున్నాయి. ఇదే అంశాన్ని పార్లమెంట్‌ సభలోనే మోదీ ఓ సందర్బంలో ప్రస్తావిస్తూ.. తాను ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలా అని అనేక ఒత్తిళ్లతో సభకు వస్తుంటానని.. కానీ శివప్రసాద్ వేషాలు, ఆయన హావభావాలు చూసి నవ్వుకుంటానని అన్నారు. శివప్రసాద్ సమస్యలపై పోరాటంలో భాగంగా ఎన్ని విన్యాసాలు చేసినా, ఎన్ని వేషాలు వేసినా ప్రభుత్వ పెద్దలు, ప్రజలు ఆయనను వినోదాన్ని పంచే కోణంలో చూసారే తప్ప ఆయన నటన వెనకున్న మనో వేదనకు ప్రాముఖ్యత ఇవ్వలేదనేది వాస్తవం. ప్రత్యేకహోదా, రాష్ట్రానికి నిధుల అంశంలో మోడికి వ్యతిరేకంగా చేసిన విన్యాసాలను బీజేపి కేంద్రమంత్రులు అలాగే భావించారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంలో భాగంగా శివప్రసాద్ కూడా ఓడిపోయారు. ఆయన మరణంతో రాష్ట్రంలో విచిత్ర వేషాలు వేసే నాయకుడు ఎవరనే అంశంపై కూడా చర్చ జరిగింది.

అయితే శివప్రసాద్ మరణించిన దాదాపుగా నాలుగు నెలల తర్వాత ఆయన అల్లుడు పంతగాని నరసింహప్రసాద్‌ కడప జిల్లా రైల్వేకోడూరు మార్కెట్‌ వీధిలో శుక్రవారం హల్‌చల్‌ చేశారు. ఎప్పుడో 700 ఏళ్లక్రితం మరణించిన పిచ్చి తుగ్లక్‌ వారసుడు (జగన్) ఏపీని పరిపాలిస్తున్నాడని అందుకే వచ్చానని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్ ను చూస్తున్నవారంతా శివప్రసాద్ వారసుడు వచ్చారని, ఇకనుండి ఆయన లేని లోటును అల్లుడు భర్తీ చేస్తాడని అంటున్నారు. అల్లుడు నరసింహ ప్రసాద్ కు శివప్రసాద్ అంటే ఎంతో అభిమానం. గత రెండు పర్యాయాలుగా ఎన్నికల్లో మామగారి గెలుపునకు పనిచేసారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి