iDreamPost

అది జగన్‌కు వర్తించదా మాజీ మంత్రివర్యా..?

అది జగన్‌కు వర్తించదా మాజీ మంత్రివర్యా..?

చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై సిట్‌ విచారణ వేశారు. విచారణ చేయనివ్వండి. ఏ మవుతుంది..? మంత్రివర్గ నిర్ణయాలు ఏ ఒక్కరూ తీసుకుంది కాదు. సమావేశంలో మంత్రులందరూ ఉంటారు. చంద్రబాబు ఉంటారు. అందరూ కలసి తీసుకున్న నిర్ణయాలవీ.. ఇవీ.. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ చెబుతున్న మాటలు.

గత ప్రభుత్వహయాంలో మంత్రిగా పని చేసిన పితాని సిట్‌ విచారణపై పై విధంగా స్పందించడం ఓ అంశాన్ని గుర్తుకు చేస్తోంది. అదే ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌పై 2012లో నమోదైన కేసులు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వ (2004–09) హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్ల లబ్ధి పొందిన పెట్టుబడిదారులు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారంటూ, ఇది క్విడ్‌ప్రోకో అంటూ జగన్‌పై అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసులు పెట్టింది. కాంగ్రెస్‌ నేత శంకర్‌రావు, టీడీపీ నేత ఎర్రన్నాయుడులు జగన్‌పై ఫిర్యాదులు చేశారు. ఈ వ్యవహారంలో పలువురు ఐఏఎస్‌ అధికారులపై కూడా కేసులు పెట్టి అరెస్ట్‌ చేశారు. కానీ మంత్రులెవ్వరిపైనా కేసులు లేవు..అరెస్ట్‌లులేవు.

అప్పట్లో జగన్‌ మద్ధతుదారులు, రాజకీయ విశ్లేషకులు ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు జగన్‌కు, అధికారులకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. జగన్‌ ప్రజా ప్రతినిధి కూడా కాదని, కనీసం సచివాలయంలో కూడా కనిపించలేదని ఆయన మద్ధతుదారులు వాదించారు. అయినా ఇవేమీ లెక్కచేయని అప్పటి కాంగ్రెస్‌ పాలకులు జగన్‌ను, పలువురు ఐఏఎస్‌ అధికారులను అరెస్ట్‌ చేయించి జైలుకు పంపారు. ఆ కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

ఇప్పుడు మాజీ మంత్రి పితాని చెప్పినట్లు.. చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలన్నీ మంత్రివర్గ సమిష్టి నిర్ణయాలే. అంటే.. చంద్రబాబుతోపాటు అందరు మంత్రులూ బాధ్యులే. అంతేకానీ ఏ ఒక్క మంత్రిని బాధ్యులు కారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాల్లో ఏవైనా తప్పులున్నా, ఉద్దేశపూర్వకంగా చేసినా.. ఏ ఒక్క మంత్రికి ఇబ్బంది ఉండదనే దోరణిలో పితాని మాటలున్నాయి. చంద్రబాబుతోపాటు మంత్రులందరూ బాధ్యులవుతారు కాబట్టి కేసులైనా, జైలైనా అందరికీ వర్తిస్తుందని పితాని మాటల ద్వారా అర్థమవుతోంది. ఒకవేళ ఇలా కాదంటే.. గతంలో జగన్‌ విషయంలో వ్యవహరించినట్లు మంత్రులను వదిలేసి… ఉత్తర్వులు జారీ చేసిన ఐఏఎస్‌ అధికారులదే బాధ్యత అని చంద్రబాబు, మాజీ మంత్రులు వాదిస్తారా..? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి