iDreamPost

తిరుపతి బరిలో మాజీ మంత్రి మారెప్ప.. ఏ పార్టీ తరఫునో తెలుసా..?

తిరుపతి బరిలో మాజీ మంత్రి మారెప్ప.. ఏ పార్టీ తరఫునో తెలుసా..?

వస్తువుకు ఒక కాల పరిమితి ఉన్నట్లే నేతల రాజకీయ జీవితానికి ఓ కాలపరిమితి ఉంటుంది. ఆ తర్వాత వారు ఎంత ప్రయత్నం చేసినా.. ప్రజా జీవితంలో గెలవలేరు. అయితే కొంత మంది పట్టువిడుకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మరికొంత మంది తానున్నానని చెప్పుకునేందుకు పోటీ చేస్తుంటారు. ఇలాంటి వారిలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప ఒకరు. మాజీ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన దళిత నేత అయిన మారెప్పను అందరూ మరిచిపోతున్న తరుణంలో.. తాను తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నానంటూ ప్రకటించి వార్తల్లో నిలిచారు. ఢిల్లీ వెళ్లి భారతీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ (ఐపీసీ)లో చేరిన మారెప్ప.. శుక్రవారం తాను పోటీ చేసే విషయం ప్రకటించారు. ఐపీసీ తరఫున బరిలోకి దిగుతున్నట్లు మారెప్ప వెల్లడించారు.

ప్రభుత్వ ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి..

ఇంజనీరింగ్‌ చదివిని మూలింటి మారెప్పను మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇరిగేషన్‌ శాఖలో ఇంజనీర్‌గా పని చేస్తున్న మారెప్పను ఆ ఉద్యోగానికి రాజీనామా చేయించి 1994లో కర్నూలు జిల్లా ఆలూరు నుంచి పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో మారెప్ప ఓడిపోయారు. తిరిగి ఉద్యోగం ఇప్పిస్తానని విజయభాస్కర్‌ రెడ్డి చెప్పినా.. రాజకీయాల్లోనే కొనసాగుతానని 1999 ఎన్నికల్లో సీటు కేటాయించాలని మారెప్ప కోరారు. గత ఎన్నికల్లో ఓటమితో ఈ సారి సీటు రావడం కష్టమైంది. ఓడిపోయిన చోటనే గెలుస్తానని, మరో అవకాశం ఇవ్వాలన్న మారెప్ప వినతి మేరకు కోట్ల సూర్యప్రకాశరెడ్డి తన కోటాలో మరోసారి మారెప్పకు అవకాశం కల్పించారు. ఈ సారి మారెప్ప విజయం సాధించారు.

Also Read : తిరుపతి బీజేపీ అభ్యర్థి ఆమేనా..? పవన్‌ ప్రకటన సారాంశమేమిటి..?

వైఎస్‌ కేబినెట్‌లో మంత్రిగా..

2002లో కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి మరణం వరకు ఆయన అనుచరుడిగా, కోట్ల వర్గం నేతగా ఉన్న మారెప్ప ఆ తర్వాత వైఎస్‌ వర్గంలోకి మారారు. కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశరెడ్డి వ్యవహారశైలి నచ్చక ఆయన వైఎస్‌ పంచన చేరారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డే తనకు అధిష్టానమని చెప్పిన మూలింటి మారెప్ప కోట్ల వర్గానికి పూర్తిగా దూరమయ్యారు. 2004 ఎన్నికల్లోనూ ఆలూరు నుంచి పోటీ చేసి రెండోసారి గెలిచారు. ఈ సారి ఏకంగా వైఎస్‌ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే జడ్పీటీసీ ఎన్నికల్లో సొంత మండలాల్లో ఓడిపోవడంతో సీఎం వైఎస్‌ ఆదేశాల మేరకు మంత్రి పదవులకు మాగంటి బాబుతోపాటు మారెప్ప కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మాగంటి బాబు టీడీపీలో చేరినా.. మారెప్ప మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగారు.

2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఆలూరు నియోజకవర్గం జనరల్‌ కావడంతో మారెప్పకు కష్టాలు మొదలయ్యాయి. ఆలూరు పక్కనే ఉన్న కోడుమూరులో పోటీ చేయాలని భావించినా కోట్ల సూర్యప్రకాశరెడ్డి అడ్డుపడ్డారు.

వైసీపీలో ప్రయాణం..

వైఎస్‌ జగన్‌ కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మారెప్ప ఆయన వెంట నడిచారు. వైసీపీలో కేంద్ర పాలక మండలి సభ్యుడుగా పని చేశారు. పలు కారణాల వల్ల అక్కడ కూడా పోటీ చేసే అవకాశం రాకపోవడంతో 2014లో బీజేపీలో చేరారు. ఆ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం రాకపోయినా 2018 వరకు కొనసాగారు. ఆ తర్వాత ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. టీడీపీ నేతలు పిలిస్తే ఆ పార్టీలోకి వెళతానన్నారు. అక్కడ నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో మిన్నుకుండిపోయారు.

దాదాపు మూడేళ్ల వరకు రాజీయంగా కనిపించని మారెప్ప.. ఇప్పుడు హఠాత్తుగా వెలుగులోకి వచ్చారు. ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ (ఐపీసీ)లో చేరి తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఢిల్లీలో ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల మాజీ మంత్రి అయిన మారెప్పకు మీడియాలో ప్రచారం తప్పా.. మరే ప్రయోజనం ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Also Read : బీజేపీ – జనసేన.. తిరుపతిలో పోటీపై క్లారిటీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి