iDreamPost

తిరుపతి ఉప ఎన్నిక : జనసైనికుల్లో కాకరేపిన సోము వీర్రాజు

తిరుపతి ఉప ఎన్నిక : జనసైనికుల్లో కాకరేపిన సోము వీర్రాజు

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో జనసేన, బీజేపీ కూటమి తరఫున ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారనే విషయంపై రెండు రోజుల క్రితం క్లారిటీ ఇచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ వ్యవహారం వెనుక అసలు విషయాన్ని ఈ రోజు వెల్లడించారు. తిరుపతిలో బీజేపీ అభ్యర్థే పోటీ చేస్తారని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కలిసినప్పుడే డిసైడ్‌ అయిందని సోము పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత పవన్‌ కళ్యాణ్, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌లు ఢిల్లీకి వెళ్లారు. నడ్డాతో ఆపాయింట్‌మెంట్‌ కోసం మూడు రోజులు వేచి చూసి కలసి వచ్చారు. ఆ సమయంలోనే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేసేదీ చర్చించారని సోము తాజాగా బయటపెట్టారు. బీజేపీ అభ్యర్థే పోటీ చేస్తారని, అందుకు నడ్డా వద్ద పవన్‌ కళ్యాణ్‌ కూడా అంగీకరించారని సోము ఢిల్లీ వ్యవహారాలను వెల్లడించారు.

జీహెచ్‌ఎంసీలో బీజేపీకి మద్ధతు ఇవ్వడం వల్ల తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సీటు జనసేనకు వస్తుందని ప్రచారం జరిగింది. జనసేన కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. జీహెచ్‌ఎంసీలో పోటీ నుంచి తప్పుకోవడానికి కారణం తిరుపతి సీటు కోసమేనంటూ సమర్థించుకున్నారు. పక్షం రోజుల కిందట ఢిల్లీలోనే ఎవరు పోటీ చేసేది తేలిపోయినా.. ఇరు పార్టీల నేతలు మాత్రం ఆ విషయం దాచిపెట్టారు. ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తారని చెప్పుకుంటూ వస్తున్నారు. బీజేపీ, జనసేన నేతలు ఇరువురూ ఇదే పాట పాడారు. అయితే రెండు రోజుల క్రితం బీజేపీ అభ్యర్థే పోటీ చేస్తారని. జనసేన మద్ధతు ఇస్తుందని సోము వీర్రాజు అసలు విషయం బయటపెట్టారు. దీని వెనుక జరిగిన తతంగాన్ని ఈ రోజు వెల్లడించారు.

అయితే ఇన్నాళ్లు ఉమ్మడి అభ్యర్థి అని ఇరు పార్టీల నేతలు ఎందుకు చెప్పారన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశం. జనసేన కార్యకర్తలను జోకొట్టేందుకే ఈ డ్రామాను ఇరు పార్టీల నేతలు రక్తి కట్టించారని చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీలో పోటీ చేస్తామని చెప్పి. నామినేషన్లు వేసిన తర్వాత ఉపసంహరించుకున్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు పోటీ చేస్తున్నామని చెప్పిన పవన్‌.. ఆ తర్వాత ఉపసంహరించుకుని బీజేపీని గెలిపించాలని పిలుపునివ్వడం జనసైనికులకు ఏ మాత్రం రుచించలేదు. వారిని శాంతింపజేసేందుకు తిరుపతి ఉప ఎన్నికను చూపించారు. అయితే ఇక్కడ కూడా పోటీ చేసే అవకాశం రాకపోవడంతో.. ఏమి చేయాలో పాలుపోక ఇన్నాళ్లు ఎవరు పోటీ చేసే విషయం నాన్చివేశారని విశ్లేషిస్తున్నారు. సోము వీర్రాజు మాటలను విన్న జనసైనికులు సోషల్‌ మీడియాలో కారాలుమిరియాలు నూరుతున్నారు. అభిమానులను సముదాయించేందుకు జనసేనాని ఏమి చేస్తారే వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి