iDreamPost

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు మృతి

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు  మృతి

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు ఆదివారం ఉదయం మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం ఆయన మృతి చెందాడు.ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో దేవాదాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

జువ్వాడి రత్నాకర్ రావు సీనియర్ నేత,మాజీ మంత్రి చొక్కారావు బంధువు. అప్పట్లో చొక్కారావు కు ఢిల్లీ స్థాయిలో మంచి పేరు ఉండేది. మంత్రి హోదాలో ఉంది కూడా సాధారణ జీవితాన్ని గడిపిన చొక్కారావు ఔనత్యాన్ని పత్రికలూ విశేషంగా రాశాయి. 1984 లోక్ సభ ఎన్నికల్లో కరీం నగర్ నుంచి టీడీపీ మద్దతుతో ఇండిపెండెంట్ గా పోటీచేసిన మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని కాంగ్రెస్ తరుపున పోటీచేసిన చొక్కా రావ్ ఓడించారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ కేవలం ఆరు స్థానాలు మాత్రమే గెలవటం గమనార్హం.

జువ్వాడి రత్నాకర్ రావు రాజకీయ ప్రస్థానం అయన తన సొంత గ్రామమైన తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్‌గా ప్రారంభమైంది.తర్వాత 1981 లో జగిత్యాల సమితి అధ్యక్షులుగా గెలుపొందారు.1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారి జగిత్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎన్టీఆర్ నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో ఓటమి చవి చూశారు. తదుపరి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జగిత్యాల నుండి బుగ్గారం నియోజకవర్గంకు మారి కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు.ఆ ఎన్నికలలో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొంది శాసనసభలో తొలిసారి అడుగుపెట్టాడు.

1999, 2004 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా బుగ్గారం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు.2009 సాధారణ ఎన్నికలతో పాటు 2010 ఉప ఎన్నికలలో వరుసగా ఓడిపోయారు.అనంతరం అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఇంటికే పరిమితమయ్యారు.జగిత్యాల జిల్లాలోని ఆయన స్వగ్రామం తిమ్మాపూర్‌లో జువ్వాడి రత్నాకర్‌రావు అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి