iDreamPost

త్వరలో విశాఖలో కీలక పరిణామం.. అయ్యన్న ఏం చేయబోతున్నారు..?

త్వరలో విశాఖలో కీలక పరిణామం.. అయ్యన్న ఏం చేయబోతున్నారు..?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి అక్కడ ఏమి జరిగినా.. సంచలనమే అవుతోంది. వార్తలో పతాక శీర్షికల్లో నిలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. రాజకీయ పార్టీలు అత్యంత వేగంగా స్పందిస్తున్నాయి. ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న విశాఖలో మరో నెల రోజుల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. టీడీపీ హయాంలో జరిగిన భూ కుంభకోణంపై వేసిన సిట్‌.. తన దర్యాప్తును మరో నెల రోజుల్లో పూర్తి చేయనుంది. నవంబర్‌ నెలాఖరుకు దర్యాప్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని సిట్‌ అధిపతి విజయ్‌కుమార్‌ ఇటీవల చెప్పారు.

విశాఖ చుట్టుపక్కల దాదాపు 13 మండలాల్లో భూముల కుంభకోణం జరిగింది. 1400 ఫిర్యాదులు వచ్చాయి. కరోనా వైరస్‌ కారణంగా ఏడు నెలలుగా నిలిచిపోయిన సిట్‌ దర్యాప్తు మళ్లీ ప్రారంభమైంది. ఈ ఫిర్యాదులన్నింటినీ పరిశీలించిన తర్వాత సిట్‌.. తన తుది విచారణను ఓ కొలిక్కి తేనుంది. ఈ నేపథ్యంలో విశాఖ కేంద్రంగా మళ్లీ రాజకీయ రగడ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కుంభకోణం టీడీపీ హాయంలో జరిగింది కాబట్టి అధికార వైసీపీ ఆ పార్టీ నేతలపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతుందనడంలో సందేహం లేదు. అదే సమయంలో టీడీపీ నేతలు కూడా గాల్లో రాయి విసిరిన మాదిరిగా వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తారనడంలో సందేహం లేదు.

టీడీపీ, వైసీపీ నేతల ఆరోపణలు, విమర్శలు ఎలాగున్నా.. సిట్‌ నివేదిక తర్వాత.. టీడీపీకి నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎలా స్పందిస్తారనేదే ఆసక్తికర అంశం. విశాఖలో భూములు ఆక్రమించుకుంటున్నారనే విషయం వెలుగులోకి రాగానే వాటిపై నాడు మంత్రిగా ఉన్న అయ్యన్న తీవ్రంగా స్పందించారు. తన సహచర మంత్రి అయిన గంటా శ్రీనివాసరావుపై పరోక్షం ఆరోపణలు చేశారు. ఎక్కడ నుంచో విశాఖకు వచ్చిన వారు ఇక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

గడచిన సాధారణ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు టీడీపీ తరఫున గెలవగా,, అయ్యన్న పాత్రుడు ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్‌ అయిన గంటా.. పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. అయ్యన్న మాత్రం టీడీపీలోనే కొనసాగుతూ.. ఆ పార్టీలో రాజకీయంగా క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. నిత్యం మీడియా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో నాడు గంటా శ్రీనివాసరావుపై భూ కుంభకోణం ఆరోపణలు చేసిన అయ్యన్నపాత్రుడు.. సిట్‌ నివేదిక వచ్చిన తర్వాత నాడు చేసిన ఆరోపణలను మళ్లీ చేస్తారా..? లేక మౌనం పాటిస్తారా..? అనేది వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి