iDreamPost

మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ షాకింగ్ కామెంట్స్

మాజీ ఫాస్ట్ బౌలర్  శ్రీశాంత్ షాకింగ్ కామెంట్స్

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచంలోని ఒలంపిక్స్ తో సహా అన్ని క్రీడా కార్యక్రమాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. భారత్‌లో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో ఐపిఎల్-2020ని బిసిసిఐ నిరవధిక వాయిదా వేసింది. క్రికెటర్లకు ఐచ్చికంగా లభించిన సెలవులను కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. అయితే క్రికెటర్లు ఇళ్లలో నుండే తమ సహచర క్రికెటర్‌లతో పాటు అభిమానులతో సోషల్ మీడియాలో మాట్లాడడానికి ఈ ఖాళీ సమయాన్ని ద్వారా ఉపయోగిస్తున్నారు. తాజాగా బ్యాండ్‌ వాగన్‌లో చేరిన భారత వివాదాస్పద మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్. శ్రీశాంత్ చాలా ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.

హలో యాప్‌లో లైవ్ ఇంటరాక్టివ్ సెషన్ హోస్ట్‌తో మాట్లాడుతున్నప్పుడు వన్డే క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించే సామర్థ్యం, ​​నైపుణ్యం ఉన్న బ్యాట్స్‌మన్‌ను అంతర్జాతీయ క్రికెటర్‌లలో నుంచి ఎంపిక చేయాలని శ్రీశాంత్‌ను కోరారు. దానికి స్పందించి వన్డేలలో ట్రిపుల్ సెంచరీ సాధించగల ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను ఎస్.శ్రీశాంత్ ఎంపిక చేశాడు.కానీ అతను ఎంపిక చేసిన జాబితాలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు చోటు దక్కలేదు.వన్డేలలో మూడు డబుల్ సెంచరీలు మరియు అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోరు 264 సాధించిన భారత తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మను ట్రిపుల్ సెంచరీ సాధించగల బ్యాట్స్‌మన్‌గా ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యకరం.

37 ఏళ్ల మాజీ భారత పేసర్ శ్రీశాంత్ మాట్లాడుతూ “నా ఆలోచన ప్రకారం బహుశా భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ,కెఎల్ రాహుల్ ఇద్దరితో పాటు,విదేశీ క్రికెటర్లలో బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్) వన్డేలలో ట్రిపుల్ సెంచరీ కొట్టడానికి అవకాశం ఉందని” పేర్కొన్నాడు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శ్రీశాంత్ ఎంచుకున్న బ్యాట్స్ మెన్లలో ఎవరూ ఇంతవరకు డబుల్ సెంచరీ కూడా సాధించలేదు. భారత కెప్టెన్ కోహ్లీ అత్యధిక వన్డే స్కోరు 183 పరుగులు కాగా రాహుల్ (112),స్టోక్స్ (102) కేవలం శతకాలు మాత్రమే చేయడం గమనార్హం.ఇక కేరళ రంజీ జట్టు నుంచి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన తొలి ఆటగాడు శ్రీశాంత్. ఐపీఎల్ 2013లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి జీవిత కాల నిషేధం ఎదుర్కొన్నాడు. కానీ ఆగస్ట్ 2019లో బీసీసీఐ ఆ నిషేధాన్ని ఏడు సంవత్సరాల తగ్గించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి