iDreamPost

దేనికైనా రె‘ఢీ’ – ఈటల

దేనికైనా రె‘ఢీ’ – ఈటల

భూ కబ్జా ఆరోపణలతో మంత్రి మండలి నుంచి బర్తరఫ్‌ అయిన ఈటల రాజేందర్‌ గళం విప్పారు. మూడు రోజులుగా తెర ముందు, తెర వెనుక జరుగుతున్న పరిణామాలపై మాటల తూటాలు పేల్చారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు సూటిగా ప్రశ్నలు సంధించారు. చావనైనా చస్తాను గానీ ఆత్మగౌరవాన్ని అమ్మకోనని తెగేసి చెప్పారు. ఆస్తులు ధ్వసం చేసినా, వ్యాపారాలు మూసివేయించినా.. కేసులు పెట్టినా.. అరెస్ట్‌ చేయించినా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకుకైనా.. దేనికైనా సిద్ధంగా ఉన్నానని రాజేందర్‌ కుండబద్ధలు కొట్టారు.

పథకం ప్రకారం తనపై కుట్ర చేశారు.. చేస్తున్నారని చెప్పిన ఈటెల రాజేందర్‌.. తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై వివరణ ఇచ్చారు. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తానని, కోర్టు తనను దోషిగా తేలిస్తే శిక్షకు సిద్ధమని స్పష్టం చేశారు. అధికారులు, కలెక్టర్లు.. మీరు చెప్పింది రాసిస్తారని.. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. తన భార్య జమున పేరుతో పౌల్ట్రీ నిర్వహిస్తున్నాని, తమకు కలెక్టర్‌ నివేదిక, నోటీసులు ఇవ్వలేదని ఈటల ఆక్షేపించారు. జమున వైఫ్‌ ఆఫ్‌ నితిన్‌ అని అధికారులు పేర్కొనడం వారు నివేదిక ఎలా ఇచ్చారో అర్థం చేసుకోవచ్చన్నారు. తన కుమారుడు నితిన్‌ చదువులు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేశామని తెలిపారు. తన వ్యాపారం టర్నోవర్‌ ఏడాదికి 300 కోట్ల రూపాయలని చెప్పారు.

మంత్రి పదవి నుంచి తొలగించే అధికారం కేసీఆర్‌కు ఉందని చెప్పిన ఈటల.. కారు గుర్తుపై గెలిచారు కాబట్టి రాజీనామా చేయాలంటే.. చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. తన నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో చర్చించి భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తానని తెలిపారు. ప్రేమ చూపిస్తే లొంగుతాను కానీ.. బెదిరిస్తే తలొంచే పరిస్థితి లేదన్నారు. నయూం ముఠా చంపేందుకు తిరిగినా.. భయపడలేదని గుర్తు చేశారు. ఆత్మగౌరం కోసం సాధించుకున్న తెలంగాణ బిడ్డగా ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టలేనన్నారు. తనపై ఉక్కుపాదం మోపే ముందు ఈటల వ్యక్తిత్వం, పనితీరు గురించి ఒక్కసారైనా ఆలోచించారా.. అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. కేసీఆర్‌ మాదిరిగానే తాను ప్రజలను నమ్ముకునన్నానని భవిష్యత్‌ పయనంపై ఈటల పరోక్ష సందేశం ఇచ్చారు. కేసీఆర్‌ ఏమీ వెయ్యేళ్లు ఉండరని, ప్రజా స్వామ్యమే రక్షణ అని చెప్పారు. అణచివేతకు పాల్పడితే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.

Also Read : ఈటల భూ కబ్జా పర్వం సమాప్తం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి