iDreamPost

ఆ ముగ్గురి భేటీ మీద ఆ రెండు పత్రికల్లోవార్తలేవి?

ఆ ముగ్గురి భేటీ మీద ఆ రెండు పత్రికల్లోవార్తలేవి?

ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఉదయాన్నే నిద్రలేస్తూనే ఫోన్‌ చేతపట్టి ఇ – పేపర్‌ ఓపెన్‌ చేశాను. ముందు సాక్షి చూశాను. వెలుగులోకి వచ్చిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ల భేటీ అంశం బ్యానర్‌ వార్త అయింది. జరిగిన ఘటనతోపాటు ‘గూడు పుఠాణి’ అనే శీర్షికతో విశ్లేషణతో కూడిన కథనం, ఈ అంశంపై సుజనా చౌదరి వివరణ, వైసీపీ, టీడీపీ నేతల స్టేట్‌మెంట్లు కనిపించాయి. అలా అన్ని పేజీలు తిప్పిన తర్వాత ఈనాడు ఇ–పేపర్‌ను ఓపెన్‌ చేశాను.

ఈనాడు మొదటి పేజీలో ఈ ముగ్గురి భేటీపై వార్త కనిపించలేదు. సరే ఇండికేషన్‌ పెట్టి లోపలి పేజీలో ప్రచురించారేమోనని ఇండికేషన్‌ కోసం వెతికాను. కనిపించలేదు. రెండో పేజీకి వెళ్లాను, అక్కడ కనిపించలేదు. ఆ తర్వాత మూడోపేజీ.. ఇలా పేజీలన్నీ తిప్పుతూ వార్త ఎక్కడ ఉందోనని వెతుకులాట ప్రారంభించాను. 11వ పేజీలో ‘బురద రాజకీయం’ అనే శీర్షికన నిన్నంతా ఎలక్ట్రానిక్‌ మీడియాలో రహస్యభేటీ పేరుతో ప్రసారమైన వార్తపై రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సుజనా చౌదరి వివరణ, అదే వార్తలో సబ్‌ హెడ్డింగ్‌తో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన విషయం రాశారు. చివరి పేజీ వరకూ చూశా. రోజంతా టీవీ ఛానెళ్లలో ప్రసారమైన వార్త, దానిపై ఆయా ఛానెళ్లలో డిబేట్లు కూడా జరిగిన అంశం, సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయంపై ఈనాడు పత్రికల్లో కనీసం సింగిల్‌ కాలమ్‌ వార్త కూడా లేదు. ఎక్కడైనా మిస్‌ అయ్యానోనని మళ్లీ మొదటి నుంచి అన్ని పేజీలు, సింగిల్‌ కాలమ్‌ వార్తలను చూశా. కానీ లేదు.

ముందు రోజు రాత్రి ఈ టీవీ 9 గంటల న్యూస్‌ను చూశాను. అక్కడ కూడా ఈ భేటీపై ఎలాంటి వార్త చెప్పలేదు. ఈ రోజు ఉదయం 7 గంటల న్యూస్‌ కూడా చూశా. నాకు ఆశాభంగం తప్పా.. భేటీ అయినట్లు చర్చ జరుగుతోందని కూడా చెప్పలేదు.

ఈనాడు చూసిన తర్వాత ఆంధ్రజ్యోతి ఇ–పేపర్‌ ఓపెన్‌ చేశాను. నిన్న ఈ భేటీపై ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి న్యూస్‌ ఛానెల్‌లో చూపించారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అలా భేటీ అవ్వడం తప్పని కూడా ఆ ఛానెల్‌ అసోసియేటెడ్‌ న్యూస్‌ ఎడిటర్‌ వెంకట కృష్ణ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇలా వీడియోలు లీక్‌ అయితే.. పార్క్‌ హయత్‌ హోటల్‌ క్రెడిబిలిటీ ఏమిటని కూడా ప్రశ్నించారు. ఈ విషయం మదిలో పెట్టుకున్న నేను.. ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్‌ వార్త ఆశించాను. కానీ మొదటి పేజీలో లేదు. సరే లోపల పేజీలో అయినా ఉంటుందేమోనని వెతికా. అక్కడ లేదు. సేమ్‌ ఈనాడు పేపర్‌ మాదిరిగానే సుజనా చౌదరి, వైసీపీ, టీడీపీ నేతల ప్రకటనలను వేర్వేరుగా మూడు వార్తలుగా ప్రచురించారు.

సాధారణంగా గతంలో ఈనాడు తనకు నచ్చని లేదా తన వారు అనుకునే వారికి నష్టం జరుగుతుందని భావించే అంశంపై విశ్లేషణ రాయకుండా.. స్పాట్‌ వార్తలా జరిగిన విషయం చెప్పేది. ఆంధ్రజ్యోతి అయితే విశ్లేషణ కూడా రాసేది. కానీ సుజనా, కామినేని, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ల భేటీ విషయం తమ పత్రికల్లో కనీసం స్పాట్‌ వార్తగా కూడా ప్రచురించకపోవడం వెనుక ఆంతర్యమేమిటో ఆర్థం కాలేదు. తమ పాఠకులకు ఈ విషయం తెలియకూడదని అనుకున్నారేమో బహుసా.

ఇలాంటి విధానం అవలంభిస్తూ ఇప్పటికే దిగజారిన తెలుగు జర్నలిజాన్ని పాతాళానికి పడిపోయేలా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు వ్యవహరిస్తున్నాయని అంటున్నారు. గత నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిన సమయంలోనూ, అఖండ మెజారిటీతో వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న మే 30వ తేదీన కూడా ఆయా విషయాలను కనీసం సింగిల్‌ కాలమ్‌ వార్తగా కూడా ఈ రెండు పత్రికలు ప్రచురించలేదు. గతం, వర్తమానంతోపాటు భవిష్యత్‌లో ఏమి జరగబోతోందో కూడా విశ్లేషణలతో కూడిన పోస్టులు సోషల్‌ మీడియాలో ప్రతి రోజు వైరల్‌ అవుతున్నాయి. ఏ మూలన ఏమి జరిగినా క్షణాల్లో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమవుతున్న రోజులివి.

ఎలక్ట్రానిక్‌ మీడియా కన్నా సోషల్‌ మీడియా వేగంగా ఉంది. దాని ప్రభావం ఆయా ఛానెళ్లపై కూడా పడింది. అందుకే ఆయా ఛానెళ్ల జర్నలిస్టులు సోషల్‌ మీడియాలోనూ వార్తలు చదువుతున్నారు. పూర్వం మాదిరిగా తాము చెప్పదల్చుకుందే పాఠకులకు చెబుతాం, చూపించదల్చుకుందే తమ వీక్షకులకు చూపిస్తాం.. అనే ధోరణి ఇప్పుడు చెల్లదన్న విషయం ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమన్యాలు ఎంత త్వరగా గుర్తిస్తే.. వారికి అంత మంచిది. వార్తను దాచి నవ్వులపాలవడం తప్పా .. నేటి రోజుల్లో వార్త దాచితే దాగదు.