iDreamPost

సెలబ్రిటీ పెళ్లిళ్లు – గాలిలో దీపాలు

సెలబ్రిటీ పెళ్లిళ్లు – గాలిలో దీపాలు

నిన్న నాగ చైతన్య సమంతా అఫీషియల్ విడాకుల వ్యవహారం సోషల్ మీడియాని ఊపేస్తోంది. వాళ్ళ కన్నా ఎక్కువగా నెటిజెన్లు తెగ బాధ పడిపోతూ పోస్టుల మీద పోస్టులు వైరల్ చేస్తున్నారు. ఇక న్యూస్ ఛానల్స్ సంగతి సరేసరి. వీళ్ళెందుకు విడిపోయారు అనే దాని గురించి స్పెషల్ డిబేట్లు, నాన్ స్టాప్ డిస్కషన్లు పెడుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని అసలు జంట మర్చిపోయినా కూడా వీళ్ళు వదిలేలా కనిపించడం లేదు. పట్టుమని ఐదేళ్లు కూడా దాటకుండానే ఈ బంధం ఇలా సెలవు తీసుకోవడం మాత్రం నిజంగా విచారకరం. అయితే సినిమా ప్రపంచంలో ఇవన్నీ చాలా సాధారణమనే విషయాని మర్చిపోకూడదు. ఇలాంటి ఉదంతాలు గతంలో ఎన్నో ఉన్నాయి.

నాగార్జునకు అమల రెండో వివాహం. వెంకటేష్ సోదరి లక్ష్మి దగ్గుబాటితో మొదటి పెళ్లి జరిగిన కొన్నేళ్లకే నాగ్ లైఫ్ కొత్త మలుపు తీసుకుంది. ఇంకా వెనక్కు వెళ్తే మహానటి సావిత్రి కంటే గొప్ప ఉదాహరణ మరొకటి అక్కర్లేదు. కోరిమరీ అప్పటికీ భార్యపిల్లలు ఉన్న జెమినీ గణేషన్ ను ఎంచుకుంది. సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి ఉండగానే విజయనిర్మలకు మూడు ముళ్ళు వేయడం ఈ మీడియా లేని రోజుల్లోనే ఒక సంచలనం. ఇలాంటివి మనకే పరిమితం కాలేదు. బాలీవుడ్ లో ధర్మేంద్ర, సైఫ్ అలీ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, మలైకా అరోరా, పూజా భట్, అర్జున్ రామ్ పాల్, హిమేష్ రేషామియా ఇలా లిస్టు రాసుకుంటూ పోతే అంతు ఉండదు.

కమల్ హాసన్, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్లు సైతం తమ వివాహ బంధాల పట్ల ఒక స్టాండ్ లేక జీవిత భాగస్వాములను మారుస్తూ వెళ్లారు. సినిమా తారలది పబ్లిక్ లైఫ్ కాబట్టి వాళ్ళు ఎంత వ్యక్తిగత జీవితమని చెప్పుకున్నా కూడా సాధారణ జనానికి ప్రతి విషయం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు కూడా చైసామ్ ల ఉదంతం కొద్దిరోజుల తర్వాత మర్చిపోతారు కానీ అప్పటిదాకా ఏం జరిగిందనే దాని మీద మీడియా అనవసర తవ్వకాలు చేస్తూనే ఉంటుంది. ఇక్కడ చెప్పిన జంటల్లో తప్పు ఎవరిదైనా పరస్పరం ఒక అవగాహన, అండర్ స్టాండింగ్ లేనప్పుడు విడిపోవడం కన్నా మంచి నిర్ణయం మరొకటి ఉండదు. కాదనే హక్కు ఎవరిది.

Also Read : నాలుగేళ్ల వివాహ బంధానికి ‘చైతన్య-సమంత’ల గుడ్ బై

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి