iDreamPost

Dunki: 20 ఏళ్ళకు నెరవేరుతున్న షారుఖ్ కల

Dunki: 20 ఏళ్ళకు నెరవేరుతున్న షారుఖ్ కల

కొన్ని కాంబినేషన్ల కోసం అభిమానులు హీరోలు ఎంత ఎదురు చూసినా కాలమే వాటికి దారి చూపించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మహేష్ బాబు వచ్చిన రెండు దశాబ్దాల తర్వాత రాజమౌళితో కలయిక సాధ్యమయ్యింది. ఇప్పటికీ జక్కన్న కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్న స్టార్లకు కొదవలేదు. అలాంటిది బాలీవుడ్ లోనూ ఒకటుంది. షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)హీరోగా రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో ఒక మూవీ రావాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఫైనల్ గా వాళ్ళ కల కార్యరూపం దాల్చింది. ఈ ఇద్దరు ఒక ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. డంకీ టైటిల్ ని అధికారికంగా ప్రకటిస్తూ హీరో దర్శకుడు ఇద్దరూ నటించిన టీజర్ ని ఇందాక విడుదల చేశారు.

రాజ్ కుమార్ హిరానీ(Rajkumar Hirani)కి దర్శకుడిగా ఇంత క్రేజ్ ఉండడానికి కారణాలున్నాయి. ఈయన ఎప్పుడూ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్లు తీయలేదు. పదుల సంఖ్యలో మాస్ మసాలాలు తీసి డబ్బులు చేసుకోలేదు. కౌంట్ తక్కువైనా తనదంటూ ప్రత్యేక ముద్ర వేసేలా ఉండే కథనాలు మాత్రమే ఎంచుకుంటారు. డెబ్యూ మూవీ ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’ అప్పట్లో ఒక సంచలనం. రెండోది దాని సీక్వెల్’ లగే రహో మున్నాభాయ్’ దానికి మించి గొప్ప పేరు తెచ్చుకుంది. ఈ రెండింటినీ చిరంజీవి ముచ్చటపడి మరీ రీమేక్ చేసుకోవడం చూశాం. తర్వాత అమీర్ ఖాన్ ‘3 ఇడియట్స్’ సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు. గ్రాండియర్ లేకుండా వందల కోట్లు కొల్లగొట్టింది.

ఇక ‘పీకే’ గురించి తెలిసిందే. సున్నితమైన అంశాన్ని గొప్పగా మలిచిన తీరు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘సంజూ’ సైతం బాక్సాఫిస్ హిట్టే. ఇంతా చేసి రాజ్ కుమార్ హిరానీ ఈ 19 ఏళ్ళ కాలంలో తీసింది కేవలం 5 సినిమాలే అంటే ఆశ్చర్యం కలగక మానదు. అయినా కూడా వంద చిత్రాల ఖ్యాతిని దక్కించుకున్నారు. అందుకే షారుఖ్ ఖాన్ అంతటి పెద్ద స్టార్ కూడా విపరీతంగా ఎగ్జైట్ అవుతున్నాడు. టైటిల్ వినగానే డాంకీ (గాడిద) సౌండ్ వస్తోందే అంటూ జోకు వేయడం దగ్గర నుంచే షారుఖ్ ని కొత్తగా చూపిస్తారని అర్థమైపోయింది. ఈ డంకీ 2023 డిసెంబర్ 23న విడుదల కానుంది

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి