iDreamPost

విషాదం: మణిరత్నం, శంకర్ సినిమాల రచయిత ఇకలేరు

ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న దర్శకుడు సూర్య కిరణ్, ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్టు వీరభద్రరావు మరణించగా.. తాజాగా ఇప్పుడు మరో సినీ ప్రముఖుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న దర్శకుడు సూర్య కిరణ్, ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్టు వీరభద్రరావు మరణించగా.. తాజాగా ఇప్పుడు మరో సినీ ప్రముఖుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

విషాదం: మణిరత్నం, శంకర్ సినిమాల రచయిత ఇకలేరు

సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. బాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు ఇటీవల కాలంలో పలువురు మూవీ సెలబ్రిటీలు మృత్యువాత పడ్డారు. కొన్ని రోజుల క్రితమే ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్ గుండె పోటుతో మరణించిన సంగతి విదితమే. ప్రముఖ హాస్య నటుడు లక్ష్మీ నారాయణన్ శేషు అలియాస్ లొల్లు సభ శేషు మృతి చెందిన సంగతి విదితమే. తాజాగా ఇప్పుడిప్పుడు పాపులర్ అవుతున్న క్యారెక్టర్ ఆర్టిస్టు వీర భద్రరావు గత శుక్రవారం మరణించారు. ఇంట్లో ప్రమాదవశాత్తూ కింద పడిపోయిన ఆయన.. తీవ్ర గాయాలై మృతి చెందారు. ఇప్పుడు మరొకరు ఇండస్ట్రీని వీడి వెళ్లిపోయారు. ప్రముఖ డబ్బింగ్ రైటర్, దర్శకుడు మృత్యువాత పడ్డారు

డబ్బింగ్ పాటల, మాటల రచయిత శ్రీ రామకృష్ణ ఇక లేరు. అనారోగ్య సమస్యలతో సోమవారం రాత్రి మరణించారు. ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని తేనాపేటలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.  ఈ నెల ఒకటోవ తేదీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆయన మరణించారు. ఎక్కువగా మణిరత్నం, శంకర్ చిత్రాల తెలుగు డబ్బింగ్ వర్షన్లకు పని చేశాడాయన. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి వాసి అయిన రామకృష్ణ 50 ఏళ్ల క్రితం చెన్నైకి వెళ్లి అక్కడ లిరిసిస్టుగా స్థిరపడ్డారు. ఎన్నో తమిళ డబ్బింగ్ చిత్రాలకు తెలుగులో అద్భుతమైన సంభాషణలు అందించారు. ఆయనకు భార్య స్వాతి, కుమారుడు గౌతమ్ ఉన్నారు. శ్రీ రామకృష్ణ భౌతిక కాయాన్ని చెన్నైలోని సాలిగ్రామం ప్రాంతంలో ఉన్న స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

మణిరత్నం సినిమాల్లో ఆల్ టైమ్ హిట్ చిత్రాలైన బొంబాయితో పాటు శంకర్ జెంటిల్ మెన్, ఒకే ఒక్కడు, రజనీకాంత్ సినిమా చంద్రముఖి తెలుగు డైలాగ్స్ అందించింది శ్రీ రామకృష్ణనే. తమిళ చిత్రాల్లోని డైలాగులు, పాటలు తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లుగా రాసి.. ఆ సినిమాలు హిట్ ట్రాక్ కొట్టడంతో తన వంతు పాత్ర పోషించారు. చివరిసారిగా రజనీకాంత్ నటించిన దర్బార్ మూవీకి డైలాగ్స్ రాశారు. ఆయన కెరీర్‌లో సుమారు 300 చిత్రాలకు డబ్బింగ్ రచయితగా పనిచేశారు. జీన్స్ సినిమా సమయంలో ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్‌కు తెలుగు నేర్పించింది ఆయనే. కేవలం డబ్బింగ్ రచయితగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా నిరూపించుకున్నాడు. బాల మురళీ ఏంఏ, సమాజంలో స్త్రీ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి