iDreamPost

ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతపై నీలినీడలు!

ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతపై నీలినీడలు!

కేంద్ర ఎన్నికల సంఘం.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మూల స్తంభాల్లో ఒకటి. పూర్తి స్వతంత్ర ప్రతిపత్తితో నిర్ణీత కాలవ్యవధిలో చట్టసభల ఎన్నికలు నిర్వహించి.. ప్రజా ప్రభుత్వాలను కొలువు దీర్చడం ఎన్నికల సంఘం ప్రధాన కర్తవ్యం. అధికారంలో ఉన్న ప్రభుత్వాల ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంతో ఎన్నికలు నిర్వహిందుకు వీలుగా రాజ్యాంగం ఈ వ్యవస్థకు సర్వాధికారాలు కట్టబెట్టింది. కానీ కమిషన్ పై కేంద్రం పెత్తనం గతంలో కొన్ని సందర్భాల్లో కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా తగ్గినా.. గత రెండేళ్లుగా.. మరీ ముఖ్యంగా మోదీ ప్రభుత్వ హయాంలో మళ్లీ ఆ దుస్సంప్రదాయం వేళ్ళూనుకుంటున్నట్లు కొన్ని పరిణామాలు అనుమానాలు రేపుతున్నాయి. కేరళ రాజ్యసభ ఎన్నికలు, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు, ప్రస్తుత బెంగాల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం తీసుకున్న కొన్ని నిర్ణయాలు దాని నిష్పాక్షిక తపై సందేహాలు కలిగిస్తున్నాయి. ఈసీ ఇటీవలి కాలంలో తీసుకున్న నిర్ణయాలపై అందులో ఒక సభ్యుడు ఐదు సందర్భాల్లో అసమ్మతి వ్యక్తం చేయడం ఈ సందేహాలకు మరింత బలం ఇస్తోంది.

కేరళ రాజ్యసభ ఎన్నికలపై దాగుడుమూతలు

కేరళలో ఖాళీ అవుతున్న మూడు ఎమ్మెల్యే కోటా రాజ్యసభ స్థానాలకు ఏప్రిల్ 12న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తొలుత ప్రకటించిన ఎన్నికల సంఘం వారం తర్వాత కేంద్ర న్యాయశాఖ నుంచి వచ్చిన ఒక నోట్ కారణంగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. కేరళలో ఈ నెల ఆరో తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కొత్త ఎమ్మెల్యేలు రానున్న తరుణంలో.. పదవీకాలం ముగిస్తున్న సభ్యులతో రాజ్యసభ ఎన్నికలు నిర్వహించవద్దని న్యాయశాఖ ఆ నోట్ ద్వారా చేసిన సూచనకు ఎన్నికల సంఘం ఓకే చెప్పి ఎన్నికలు వాయిదా వేసింది. ఈ నిర్ణయం తమ హక్కులకు భంగకరమంటూ ఆ రాష్ట్ర సీపీఎం ఎమ్మెల్యే ఒకరు హైకోర్టును ఆశ్రయించారు.

అయితే ప్రస్తుత ఎమ్మెల్యేల పదవీ కాలం ముగిసేలోగా ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. దాన్ని రికార్డ్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించడంతో వెనక్కితగ్గారు. న్యాయశాఖ నోట్.. దాని సారాంశాన్ని అప్పుడు బయటపెట్టారు. కోర్టు ప్రభుత్వ నోట్ ను, ఈసీ నిర్ణయాన్ని తప్పుపట్టింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే మే రెండో తేదీకి ముందే రాజ్యసభ ఎన్నికల నిర్వహించాలని ఆదేశించింది. ప్రస్తుత అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి.. అధికార ఎల్డీఎఫ్ ఎన్నికలు జరగాల్సిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండింటిని గెలుచుకోగలదు. దాన్ని అడ్డుకోవడానికి కేంద్రం ఈసీని ఉపయోగించుకొని చేసిన ప్రయత్నాలు హైకోర్టు జోక్యంతో బెడిసికొట్టాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆర్టికల్ 370 రద్దు కోసం..

జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు కోసం కూడా కేంద్రం ఈసీని పావుగా ఉపయోగించుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. జమ్మూకాశ్మీర్ లో 2018 అక్టోబర్ నుంచి రాష్ట్రపతి పాలన ఉంది. 2019 ఏప్రిల్ లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. సాధారణంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేటప్పుడు ఎంపీ ఎన్నికలతోపాటే పెండింగులో ఉన్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ప్రకారమే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తారనుకున్నారు. కానీ భద్రత కారణాలు సాకుగా చూపి ఎన్నికలు జరపలేదు. ఇది జరిగిన మూడు నెలలకే కేంద్రం ఎవరూ ఊహించని విధంగా ఆర్టికల్ 370ని రద్దు చేసింది. నిబంధనల ప్రకారం ఈ ఆర్టికల్ ను రద్దు చేయాలంటే ముందు కాశ్మీర్ అసెంబ్లీ ఆమోదం తీసుకోవాలి. కానీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉండటంతో ఆ అవసరం లేకుండాపోయింది. అసలు దీనికోసమే ముందస్తు ప్రణాళికతో కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగకుండా జాగ్రత్త పడ్డారని బయటపడింది.

Also Read : ఆపరేషన్ కమలం.. ముందే మొదలైన రిసార్టు రాజకీయం

బెంగాల్లో సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ

ఐదు రాష్ట్రాలకు ఇటీవల ఎన్నికలు ప్రకటించిన ఎన్నికల సంఘం కేరళ, తమిళనాడు, పాండిచేరిల్లో ఒకే దశలో, అసోంలో మూడు దశల్లో పోలింగ్ పూర్తి చేసింది. కానీ పశ్చిమ బెంగాల్లో ఎనిమిది దశల ఎన్నికల ప్రక్రియ ప్రకటించి విమర్శలకు తావిచ్చింది. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అభ్యంతరం ప్రకటించినా పట్టించుకోలేదు. ఇది బీజేపీకి అనుకూలంగా తీసుకున్న నిర్ణయమన్న ఆరోపణలు జోరుగా వినిపించాయి. బెంగాల్లో పాగా వేసేందుకు రెండేళ్లుగా పావులు కదుపుతున్న బీజేపీకి వాస్తవానికి అక్కడ ఇప్పటికీ గ్రామస్థాయి క్యాడర్ లేదు. కిందిస్థాయి నేతలూ లేరు. మూడో నాలుగో దశల్లో ఎన్నికలు ముగించేస్తే అన్ని పోలింగ్ బూత్ లలో ఏజెంట్లను కూడా పెట్టుకోలేని దుస్థితి ఆ పార్టీది. అదే ఎక్కువ విడతల్లో పోలింగ్ నిర్వహిస్తే నేతలు, కార్యకర్తలను పోలింగ్ ముగిసిన ప్రాంతాల నుంచి జరగాల్సిన నియోజకవర్గాలకు తరలించుకునే వెసులుబాటు లభిస్తుంది.

అందుకోసమే ఎక్కువ విడతల్లో పోలింగ్ పెట్టేలా ఈసీని మేనేజ్ చేశారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇదే కాకుండా పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో 36 గంటల ముందునుంచి బయట ప్రాంతాలవారు ఉండకూడదు. కానీ బెంగాల్ ఎన్నికల్లో ఈ విషయంలోనూ ఈసీ బీజేపీ పట్ల ఉదారంగా వ్యవహరించి ఇతర ప్రాంతాలవారిని ఏజెంట్లుగా నియమించుకునే అవకాశం కల్పించింది.

ఈసీ సభ్యుల్లోనూ విభేదాలు

గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వాధినేతలైన మోదీ, అమిత్ షా ల విషయంలో ఎన్నికల కమిషన్ సభ్యుల్లో విభేదాలు పొడచూపాయి. సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటి బెంగాల్ ఎన్నికల వరకు ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ వారిద్దరిపై పలు ఫిర్యాదులు రాగా.. వారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఈసీ సభ్యుల్లో ఒకరైన అశోక్ లావాస విభేదించి.. ఐదు సందర్భాల్లో తన అసమ్మతిని అధికారికంగా నమోదు చేశారు. దాని పర్యవసానంగా ఆయన కుటుంబ సభ్యులపై ఆదాయ పన్ను విచారణలు మొదలయ్యాయి. చివరికి 2020లో ఆసియా అభివృద్ధి బ్యాంకులో ఉద్యోగం పేరుతో ఆయన ఈసీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Also Read : బీహార్ లాలూ కు బెయిల్ షురూ..! సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుందా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి