iDreamPost

టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు ఇన్స్యూరెన్స్ కింద విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులకు 5 కోట్లు వస్తాయా?

టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు ఇన్స్యూరెన్స్ కింద విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులకు 5 కోట్లు వస్తాయా?

‘పబ్లిక్ లయబిలిటీ ఇన్స్యూరెన్స్’ (పీఎల్ఐ)- ఒక పరిశ్రమ వ్యాపార కార్యకలాపాల కారణంగా దానికి సంబంధం లేని వారు ఎవరైనా మరణించినా, గాయపడ్డా, ఆస్తి నష్టం జరిగినా సంస్థ తరఫున బాధితులకు నష్టపరిహారం చెల్లించే బీమా పధకాన్ని ‘పబ్లిక్ లయబిలిటీ ఇన్స్యూరెన్స్’ అంటారు.

1984 లో చోటు చేసుకున్న భోపాల్ గ్యాస్ లీకేజి విషాద సంఘటన పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకున్న ప్రభుత్వం ఇలాంటి బీమా పథకం ఒకటుండాలని 1991లో పీఎల్ఐ బిల్ పాస్ చేసింది. ఆ చట్టం ప్రకారం – ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు ప్రాణాలు, ఆస్తులు కోల్పోయిన వారందరికీ కలిపి సదరు పరిశ్రమ చేయించిన భీమా ద్వారా గరిష్టంగా అయిదు కోట్ల రూపాయల వరకు చెల్లించాలని ఈ చట్టం చెబుతుంది. మరో సంవత్సరం లోపల ఇంకో ప్రమాదం అక్కడే సంభవిస్తే అప్పుడు వేరే లెక్క ఉంటుంది. 

నిన్న విశాఖపట్నంలో చోటు చేసుకున్న ‘ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి’ దుర్ఘటన గురించి అందరికీ తెలిసిందే. ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లి వారికి ఎటువంటి సాయమందించేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధైర్యం చెప్పి వచ్చారు. అక్కడి నుంచే మీడియాతో మాట్లాడుతూ – ఎల్జీ పాలిమర్స్ వారితో మాట్లాడి బాధితులకు సాధ్యమైనంత ఎక్కువ నష్టపరిహారం చెల్లించేలా చూస్తామని, వారు ఇచ్చే మొత్తంతో సంబంధం లేకుండా ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న వారికి 10 లక్షలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి లక్ష రూపాయలు. ప్రాథమిక చికిత్స పొందుతున్న వారికి 25 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. 

సామాజిక మాధ్యమాల్లో వైఎస్ జగన్ పట్ల విపరీతమైన అయిష్టత ఉన్నవారి నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వరకు జగన్ ప్రకటించిన నష్టపరిహార వివరాలు చూసి ఆశ్చర్యపోవడంతో పాటు జగన్ ను అభినందించారు, కృతజ్ఞతలు తెలియజేశారు. అవి చూసి ఓర్వలేక ‘అవుట్ లుక్ ఇండియా’లో వచ్చిన ఒక వార్తను తెలుగుదేశం పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్తలు ఇష్టానుసారంగా వాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం గురించి దుష్ప్రచారం మొదలు పెట్టేశారు. ‘పీఎల్ఐ యాక్టు ద్వారా అయిదు కోట్లరూపాయలు  వస్తుంటే, ప్రభుత్వం కోటి రూపాయలు ఇప్పించడం ఏమిటి ?’ అంటూ ఒక అబద్దపు ప్రచారానికి తెరలేపి తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. బహుశా ఇది వారి, వారి సోషల్ మీడియా హెడ్ పరిజ్ఞానానికి ఒక ఉదాహరణగా సమాజం చూడచ్చు. 

ఇప్పుడు అసలు ఆ ఆంగ్ల వార్త సారాంశంలోకి వెళితే … 

“నిన్న విశాఖపట్నంలో ఎల్జీ పాలీమర్స్ దుర్ఘటన చోటు చేసుకున్న తర్వాత ఈ బీమా పధకంపై మరో సారి దృష్టి సారించాల్సిన అవసరముందని బీమా రంగానికి చెందిన నిపుణులు చర్చించుకున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు – ముంబై ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న ‘ఎల్జీ పాలిమర్స్’ సంస్థకు చెందిన బీమా పధకాలు కొన్ని ప్రభుత్వ, ప్రయివేటు బీమా సంస్థలు ఒక యూనిట్ గా ఏర్పడి (కన్సార్టియం) చూసుకుంటున్నాయి.

ఎల్జీ పాలిమర్స్ ఎంత మొత్తానికి పీఎల్ఐ బీమా చేసిందన్నది తెలియదు. ‘ప్రస్తుతం ఈ బీమా కింద ఇస్తున్న మొత్తం సొమ్ము చాలా తక్కువని, అది పెంచాల్సిన అవసరముంద’ని ఒక అధికారి తెలిపారు. ఆ అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం – చాలా సంస్థలు వారి పరిశ్రమ వల్ల సంభవించబోయే ప్రమాద అవాకాశాలు దృష్టిలో పెట్టుకుని పీఎల్ఐ చట్టం కింద గరిష్టంగా ‘ప్రమాదానికి అయిదు కోట్ల రూపాయలు’గా ఉన్న పరిమితిని ఎంచుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బీమా రంగానికి చెందిన అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం – ప్రస్తుతానికి  పరిశ్రమల తప్పనిసరి బీమా పథకాల నుంచి – మరణానికి/శాశ్వత ఆరోగ్య సమస్యలకు 25000 రూపాయలు, ఆసుపత్రి ఖర్చులకు 12,500 రూపాయలు, ఆస్తి నష్టానికి 6000 రూపాయలు గరిష్టంగా నష్టపరిహారం చెల్లిస్తున్నారు.”(దీని తర్వాత పీఎల్ఐ పథకం ఎవరెవరు తీసుకుంటే మంచిది తదితర వివరాలు అదే వార్తలో ఉన్నాయి.)

ఈ పీఎల్ఐ చట్టం స్పష్టంగా చెప్పేదేమిటంటే – దురదృష్టవశాత్తూ ఒక ప్రమాదం సంభవించినప్పుడు సదరు కర్మాగారం ఎంత మొత్తానికి బీమా చేయించుకుని ఉంటే అంత మొత్తం వరకు బాధితులకు చెల్లిస్తుంది. ఇక్కడ అయిదు కోట్ల రూపాయలు ఆ చట్టం ప్రకారం గరిష్టంగా ఒక పరిశ్రమ చేసుకోగల బీమా. ఎల్జీ పాలిమర్స్ కనుక అంత మొత్తానికి బీమా చేసుకుని ఉంటే – నిన్న ఘటనలో మరణించిన వారికీ, గాయపడ్డ వారికి, ఆస్తులు కోల్పోయిన వారికి అందరికీ కలిపి చెల్లించే మొత్తం అయిదు కోట్ల రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అసలు ‘ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఎంత మొత్తానికి పీయల్ఐ భీమా చేసిందన్న వివరాలు తెలియవు’ అని నిన్నటి నుంచి తెలుగు తమ్ముళ్లు వాడేసుకుంటున్న ఆ ఆంగ్ల వార్తలోనే స్పష్టంగా ఉంది. వారు అయిదు కోట్లకు చేసుండచ్చు, అంత కన్నా తక్కువకూ చేసుండచ్చు. తెలుగుదేశం వారికి ఆ వార్తలోని ఆంగ్లం అర్ధం కాలేదో, లేక ఆ విషయాన్ని అంగీకరించేందుకు మనసు రాలేదో ‘లోక’విదితమే కానీ అసూయాద్వేషాలతో రగిలిపోతూ విషప్రచారం మాత్రం చేశారు.   

దీన్ని బట్టి ప్రజలు అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే – సత్యమో, అసత్యమో ముందు ప్రభుత్వం మీద బురద జల్లడమే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ధ్యేయం. లేకపోతే – దేశంలో ఏ ముఖ్యమంత్రి గతంలో ఇలాంటి నష్టపరిహారం ప్రకటించలేదని అందరూ కొనియాడుతుంటే తెలుగుదేశం అభిమానులు మాత్రం ఈ అసత్యాల్ని ప్రచారం ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్ధం కాని విషయం. ఇంతటితో వీరు ఈ విషయాన్ని వదలరు. రేపో మాపో వీరి పార్టీ సభ్యులే – ‘ఒక పరిశ్రమ కారణంగా జరిగిన తప్పిదానికి ప్రభుత్వ ధనాన్ని నష్టపరిహారంగా ఎలా చెల్లిస్తారు ?’ అంటూ కోర్టుకెళ్ళినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే
చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఒక యాసిడ్ దాడి బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు వరకు వెళ్ళి ఓడిపోయిన సంగతి తెలిసిందే. కష్టకాలంలో బాధితులకు అండగా నిలవాల్సింది పోయి వారిని వ్యతిరేకిస్తూ కోర్టులకెళ్లిన చరిత్ర ఉన్న పార్టీ నుంచి ఇలాంటి ప్రచారం ఆశ్చర్యం కలిగించదు.

ఏది ఏమైనా – ఈ విషయంలో వారికి తెలియకుండానే – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నష్టపరిహారం తాలూకా గొప్పదనాన్ని వారే తెలియజేశారు. ఎందుకంటే వారు ప్రచారం చేస్తున్న పీఎల్ఐ ప్రకారం – ఒక వేళ ఎల్జీ పాలిమర్స్ గరిష్ట పరిమితికి భీమా చేయించి ఉంటే – అది ఈ ప్రమాద బాధితులందరికీ కలిపి అయిదు కోట్ల రూపాయలు వస్తుంది. ఆ బీమా ద్వారా వచ్చే మొత్తంతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరికి ఎంతెంత ఇస్తుందనే వివరాలు రాష్ట్ర ప్రజల మనసుల్లో ఇప్పటికే లిఖించబడ్డాయి కనుక మరోసారి చెప్పాల్సినవసరం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి