iDreamPost

ఎన్నికలు ఎదుర్కొనే సత్తా ఉందా..!

ఎన్నికలు ఎదుర్కొనే సత్తా ఉందా..!

‘‘డిక్కీ బలిసిన కోడి చికెన్‌ షాపు ముందుకొచ్చి తొడగొట్టిందంట’’ సోషల్‌ మీడియాలో ఈ జోక్‌ విస్తృతంగానే ప్రచారం అవుతుంటుంది. దీనర్ధం ఎంతగా బలం ఉన్నప్పటికీ ఎక్కడికెళ్ళి కొట్టాలో? ఎక్కడ కొట్టకొట్టకూడదో తెలిసి ఉండాలని కామెడీగా చెప్పడమే.

కాగా ‘‘ఇప్పుడు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం భయపడుతోంది’’ తరచు టీడీపీ నాయకుల నోటి నుంచి వచ్చే మాటే ఇది. అధికారంలోకొచ్చింది మొదలు నెలకో సంక్షేమ పథకం ప్రజల ముందుకుతెస్తూన్న సీయం వైఎస్‌ జగన్‌కు స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొవడం పెద్ద కష్టపడక్కర్లేదన్నది విశ్లేషకుల వైపునుంచి విన్పిస్తున్న మాట. కానీ చికెన్‌ షాపు ముందు తొడగొట్టే కామెంట్ల మాత్రం టీడీపీ వైపు నుంచి విన్పిస్తూనే ఉంటున్నాయి. ఇందులో నిజానిజాల మాటేంటన్నది విశ్లేషిస్తే పలు అంశాలు ఆసక్తికరంగానే కన్పిస్తున్నాయి.

దాదాపుగా ఏడెనిమిది నెలల నుంచి టీడీపీ కేడర్‌ మొత్తం స్వీయ ఐసోలేషన్‌లనే ఉంది. జనం దగ్గరకు వీళ్ళుగానీ, వీళ్ళదగ్గరకి జనంగాని వచ్చే పరిస్థితులు రాష్ట్ర మొత్తం మీద ఎక్కడా కన్పించడం లేదు. దీనికి పూర్తి విరుద్దంగా వైఎస్సార్‌సీపీ నాయకులు వివిధ కారణాలతో నిత్యం ప్రజల ముందే తచ్చాడుతున్నారు. ఆఖరికి పార్టీ అధినేత సైతం ప్రజలను నేరుగా కలిసి ఆ మాటకొస్తే తన సొంత నియోజకవర్గమైన కుప్పం వెళ్ళే 14 నెలలు అవుతోందట. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ప్రధానంగా పోటీ చేసే వ్యక్తి ఆ తరువాతనే పార్టీ గురించి ఆలోచిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పరిస్థితుల్లో ఏడెనిమిది నెలల నుంచి బైటకే కన్పించని టీడీపీ అభ్యర్ధులను గెలిపిస్తారని ఆ పార్టీ నాయకులు ఈ ధీమాను వ్యక్తం చేస్తున్నారన్నది ఇప్పుడు ప్రధానంగా విన్పిస్తున్న ప్రశ్న.

దీనికి తోడు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో టీడీపీ నాయకులు ఎక్కడా రోడ్డెక్కుతున్న దాఖలాల్లేవు. ఏంతో కొంత కోస్తాఆంధ్ర ప్రాంతంలోనే పచ్చ కండువాలు కన్పిస్తున్నాయంటున్నారు. మొన్నటికి మొన్న కొత్తగా జంబో కార్యవర్గాన్ని ప్రకటించినప్పటికీ పచ్చపార్టీలో పవర్‌ అంతంత మాత్రంగానే వచ్చిందంటున్నారు. పేరున్న నాయకులంతా ఎక్కడికక్కడే గప్‌చుప్‌ అయిపోయారు.

ఇదిలా ఉండగా నిమ్మగడ్డ రమేష్‌ – ఏపీ ప్రభుత్వం మధ్య నడుస్తున్న రచ్చ రాష్ట్ర ప్రజలకు తెలియందేమీ కాదు. అయితే ఈ ఇరు పార్టీలు తమకుతాముగా బైటపడినదానికంటే టీడీపీ, అనుబంధ మీడియాయే ఎక్కువ రచ్చ చేసిందనడంలో ఏ మాత్రం సదేహం లేదు. ఇది ఏ ప్రయోజనానికాశించి చేసారన్నది ఆలోచిస్తే పై ప్రశ్నకు సమాధానం ఈజీగానే దొరికేస్తుందంటున్నారు. నిమ్మగడ్డ ఉన్నా మరొకరు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీవైపు ప్రజలు మొగ్గడం ఖాయం. ఈ లోపు ఎన్నికలు పెట్టండి, పెట్టేయండి, పెడతారా? లేదా? అంటూ వీరంగం ఆడితే జనంలో ఒక రకమైన సింపతీని తమపై సృష్టించుకునే ప్రయత్నంలో టీడీపీ నాయకులు నిమగ్నమైనట్టుగా తోస్తుందంటున్నారు.

రేపు ఎలాగూ ఓడిపోతాం కాబట్టి, అందుకు ఎవరో ఒకర్ని బాధ్యుల్ని చేయాలి కాబట్టి, నిమ్మగడ్డకు ప్రభుత్వం సక్రమంగా సహకరించలేదు? అందుకే ఎన్నికలు సజావుగా సాగలేదు? కాబట్టే మేం ఓడిపోయాం అనేయొచ్చన్నదే టీడీపీ నాయకుల మాస్టర్‌ ప్లాన్‌గా భావిస్తున్నారు. అంటే ఈ తరహా కామెంట్లు మోకాలు–బోడిగుండు సామెత మాదిరిగానే ఉంటాయి. మేం జనంలో తిరగలేదు కాబట్టి ఓడియాం అని చెప్పుకోగలిగే ధైర్యం, ముక్కుసూటితనం ఎప్పట్నుంచో కొరవడింది కాబట్టి ఈ పల్లవిని ఎత్తుకునే క్రమంలోనే చికెన్‌షాపు ముందు కోడి సవాళ్ళన్నీ విసురుతున్నట్లుగా విమర్శకులు కూడా సెటైర్లు వేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి