iDreamPost

టీడీపీ శ్రేణులు జూ. ఎన్టీఆర్‌ నాయకత్వం కోరుకుంటున్నారా..?

టీడీపీ శ్రేణులు జూ. ఎన్టీఆర్‌ నాయకత్వం కోరుకుంటున్నారా..?

పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు అక్కడ మూడు రోజుల పాటు పర్యటించారు. ఈ పర్యటనలో ఓ టీడీపీ అభిమాని… జూనియర్‌ ఎన్టీఆర్‌ రావాలి.. జూనియర్‌ ఎన్టీఆర్‌ను దించండి.. అంటూ చంద్రబాబు సమక్షంలో డిమాండ్‌ చేస్తున్నారు. ఆ అభిమాని మాటలు చంద్రబాబుకు ఆశ్చర్యం కలిగించలేదు. అందుకే బాబు కూడా అవున్నట్లు, కాదన్నట్లుగా.. తల ఊపారు. చంద్రబాబు సమక్షంలో.. ఆయన సొంత నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు జూనియర్‌ ఎన్టీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు అర్థమవుతోంది. ఈ పరిణామం కేవలం కుప్పం వరకేనా..? లేక రాష్ట్ర వ్యాప్తంగా ఉందా..?

జూనియర్‌ ఎన్టీఆర్‌ రావాలని టీడీపీ శ్రేణులు కోరుకోవడం ఇది తొలిసారి కాదు. 2019 సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో ఇదే భావన వెల్లడైంది. జూనియర్‌ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ చరిత్రలోనే ఘోర ఓటమిని మూటగట్టుకుంది. టీడీపీ పగ్గాలు చంద్రబాబు చేతికి వచ్చిన తర్వాత మొదటిసారి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడంతో బాబు సత్తా తెలిసిపోయింది. అంతకుముందు బాబు హాయంలో గెలిచిన రెండు సార్లు బీజేపీతో పొత్తుతోనే బయటపడ్డారు.

ఒక ఓటుతో ప్రభుత్వం పడిపోవడం వల్ల వాజపేయిపై నెలకొన్న సానుభూతితో ఒకసారి, మరోసారి నరేంద్రమోదీ ఛరిష్మాతో ఏపీలో టీడీపీ గట్టెక్కింది. ఓడిపోయిన సమయంలో ఆ నెపాన్ని మిత్రపక్షాలపై బాబు నెడితే.. అందుకు ఆయన అనుకూల మీడియా వంత పాడేది. అయితే 2019 ఓటమికి కారణాలు బాబు చెప్పుకునేందుకు, అనుకూల మీడియా కవర్‌ చేసేందుకు అవకాశమే లేకుండా పోయింది. ఎందుకు ఓడిపోయానో తెలియడం లేదనే కొత్త పల్లవి అందుకున్నారు.

ఇక పంచాయతీ ఎన్నికల ఫలితాలు మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంగా వచ్చాయి. అసలే అంతంతమాత్రంగా ఉన్న టీడీపీ పరిస్థితి పంచాయతీ ఎన్నికల తర్వాత పూర్తిగా దిగజారిపోయింది. అక్రమాలు చేసి, డబ్బులు పంచి గెలిచారని స్వయంగా బాబు చెప్పుకున్నా.. ఆయన స్వంత నియోజకవర్గం కుప్పంలో కూడా అదే పరిస్థితి ఏర్పడడంతో బాబు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. కుప్పంలో తాను ఓడిపోలేదు.. ప్రజా స్వామ్యం ఓడిపోయిందనే డైలాగులు కొట్టిన మరుసటి రోజే అక్కడ మూడు రోజులు పర్యటించడంతో గెలిచింది ఎవరు..? ఓడింది ఎవరో తమ్ముళ్లకు కూడా అర్థమైంది.

రాబోయే మున్సిపల్‌ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లోనూ పంచాయతీ తరహా ఫలితాలు వస్తే.. టీడీపీ పగ్గాలు జూనియర్‌ చేపట్టాలనే డిమాండ్‌ ఊపందుకుంటుంది. కుప్పంలో మొదలైన డిమాండ్‌ మిగతా 174 నియోజకవర్గాల్లోనూ వినిపించే అవకాశం లేకపోలేదు. నారా లోకేష్‌ నాయకత్వ పటిమపై ప్రత్యర్థి పార్టీల కన్నా తమ్ముళ్లకే స్పష్టత ఉంది. 2024 ఎన్నికలకు మరో మూడేళ్లు ఉంది. అప్పటి వరకు చంద్రబాబు నెట్టుకొచ్చినా.. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే జూనియర్‌కు టైం వచ్చినట్లే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి