iDreamPost

సారాపై మాట్లాడే హక్కు నారా వారికి ఎక్కడిది?

సారాపై మాట్లాడే హక్కు నారా వారికి ఎక్కడిది?

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కర్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు తూట్లు పొడిచి మద్యంపై నిషేధం ఎత్తివేసిన చంద్రబాబు నాయుడి తనయుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు మద్య నియంత్రణకు ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై మాట్లాడడం హాస్యాస్పదంగా మారింది. విపత్కర పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాటకు కట్టుబడి మద్యం దుకాణాలను తగ్గిస్తూ.. చిత్త శుద్ధితో పని చేస్తున్న జగన్ పాలనపై విధ్వంసానికి ఒక్క ఛాన్స్ అంటూ లోకేష్ అవగాహనా రాహిత్యంగా చార్జీ షీట్ విడుదల చేయడం పై ప్రజలే విమర్శిస్తున్నారు.

ఈ సందర్భంగా టీడీపీ పాలనలో మద్యంపై సాగిన అరాచకాన్ని పరిశీలిస్తే ఎవరిది మోసమో.. ఎవరు విధ్వంసానికి పాల్పడ్డారురో.. ప్రజలే నిర్ణయిస్తారు. 1994 ఎన్నికల్లో మద్యపాన నిషేధమే ఆయుధంగా ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో ప్రజలు ఆయనకు ఘన విజయం కట్టబెట్టారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సంపూర్ణ మద్యపాన నిషేధంపై నందమూరి తారక రామారావు తొలి సంతకం చేశారు. ఆ తర్వాత వైస్రాయి హోటల్ ఉదంతం నడిపి అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచారు. 1996లో మద్యంపై నిషేధం ఎత్తి వేశారు. మహిళల గుండెల్లో ఆవేదన రగిల్చారు. అప్పటి నుంచి అరాచకం మొదలైంది. పేదల కుటుంబాల్లో కలహాలు ప్రారంభం అయ్యాయి. అది చాలదు అన్నట్లుగా.. మద్యం టెండర్లు పెట్టి బెల్టు షాపుల ద్వారా విక్రయాలు ఆరంభించిన ఘనత బాబుదే. అప్పటి నుంచి రాష్ట్రం మద్యం మాఫియాకు కేంద్రంగా మారిపోయింది. రౌడీలకు, గూండాలకు, నేరస్థులకు, అరాచక శక్తులకు నెలవుగా మారింది. స్త్రీల గుండెల్లో మళ్లీ అగ్గి రగిలింది. తన కళ్ల ముందే భర్త, కొడుకు, తండ్రి తాగుడుకి బానిసై ఒళ్ళు గుల్ల చేసు కుంటుంటే ఏ స్త్రీ ఊరుకుంటుంది? చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహ జ్వాలలు మొదలయ్యాయి. ప్రజలు ఏదురు తిరిగి 2004లో ఆయనను గద్దె దింపారు .

బాబు 2014 లో మళ్లీ అధికారం చేపట్టాక బాబు అనుసరించిన విచ్చలవిడి మధ్యం విధానంపై మహిళలు తిరిగి ఉద్యమం కొనసాగించారు. అయినప్పటికీ ఏ మాత్రం స్పందించని బాబు మహిళల ఉద్యమాన్ని అణగి దొక్కెందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. లాఠీలు జులిపించారు. ఫలితంగా 2019లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు బాబుకి అధికారాన్ని దూరం చేశారు. జగన్ కి బ్రహ్మాండమైన విజయాన్ని కట్టబెట్టారు.

ముఖ్యమంత్రి గా పగ్గాలు చేపట్టిన వెంటనే.. పాదయాత్రలో ఆయన మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం.. మద్యపాన నియంత్రణ దిశగా చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల బెల్ట్ షాపులను రద్దు చేశారు. 4500కు పైగా ఉన్న మద్యం షాపులను 33 శాతానికి తగ్గించారు. ఎక్కడా పర్మిట్ రూంలు లేకుండా చేశారు. మద్యం విక్రయించే వేళలు తగ్గించారు. ప్రైవేట్ వ్యక్తులు అయితే లాభాలే ధ్యేయంగా వ్యాపారం చేస్తారని భావించి ప్రభుత్వమే దుకాణాలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ధరలు పెంచి పేదోడు మద్యం తాగాలంటే భయపడేలా చేశారు. ఫలితంగా ఐఎంఎఫ్ఎల్ అమ్మకాలు 24 లక్షల కేసుల నుంచి.. 10 లక్షల కు తగ్గిపోయాయి. సారా బట్టీ లను సమూలంగా నాశనం చేశారు. ఆర్థిక ప్రయోజనాలు కన్నా ప్రజల సంతోషమే మిన్న అని భావించి పని చేస్తున్న జగన్ కు, ఆదాయమే మిన్న అనుకుని ఎన్టీఆర్ విధించిన మధ్య నిషేధాన్ని ఎత్తి వేసిన చంద్ర బాబుకి మధ్య తేడాలను చేసిన పనులే చూపెడుతున్నాయి.

తాను ఇచ్చిన హామీ ప్రకారం మద్య నియంత్రణకు కృషి చేస్తున్న జగన్ నీ లిక్కర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పేర్కొనడం లోకేష్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇకనైనా ఆరోపణలు చేసే ముందు కాస్త గతాన్ని దృష్టిలో పెట్టుకుని అవగాహన పెంచుకోవాలని సున్నితంగా హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి