iDreamPost

కోరినంత సాయం అందేనా..?

కోరినంత సాయం అందేనా..?

సాయం అంటేనే పొందేవాడి సంతృప్తిని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోనిది. ఇచ్చేవారి దయాదాక్షిణ్యాలమీదనే ఆధారపడాల్సింది. అయితే రాష్ట్రం– కేంద్రంల మధ్యన ఉండే యూనియన్‌ టెరిటరీకి సంబంధించిన సంబంధ బాంధ్యవ్యాల నేపథ్యంలో ఈ కేటగిరీకి చెందనప్పటికీ ఏదైనా విపత్తు వచ్చినప్పుడు కేంద్రం సాయం కోసం రాష్ట్రాలో ఎదురు చూడడంతో ఎప్పుడూ జరిగేదే. కొండంత సాయం కావాలని నివేదికలు పంపించడం, గోరంత మాత్రమే అందడం కూడా అనుభవంలో తెలిస్తుండేదే. కానీ ఎప్పుడే ఇదే పరిస్థితా? అన్న ప్రశ్న ప్రజల్లో నుంచి కూడా ఎదురైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం దీనిపై సీరియస్‌గానే దృష్టిసారించాల్సిన అవసరం ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

కేంద్ర ప్రభుత్వం అందించే సాయం రాజకీయ పరంగానే ఉంటుందన్నది ఎప్పుడూ వచ్చే ఆరోపణే. ఇది కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ సాయం అందేటప్పుడు తరచుగా విన్పిస్తూనే ఉంటుంది. తమకు రాజకీయంగా కలిసొచ్చే రాష్ట్రాలకు ఒక విధంగాను, పెద్దగా తమకు పనిలేని రాష్ట్రాలకు మరో విధంగాను కేంద్ర సాయం ఉంటుందన్న విమర్శలు లేకపోలేదు. అయితే ఇప్పుడు కూడా కేంద్రం ఇదే ధోరణిలో ఉంటుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఒక పక్క కోవిడ్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో కేంద్ర సాయంపైనే ప్రధానంగా ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రకృతి ఉపద్రవాలను కూడా పలు రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఉభయతెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాల కారణంగా తలెత్తిన ఇబ్బందులు, జన జీవనం అస్తవ్యస్థం కావడం, పంట నష్టం తదితరాలన్నీ కలిపి వేల కోట్ల నష్టమే సంభవించినట్టు లెక్కలు గట్టారు. ఆ మేరకు సాయం అందించాలని కేంద్రానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విన్నవించుకుంటున్నాయి. కానీ తొలి విడత విపత్తు సాయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు సాయం అందలేదు. బెంగాల్, ఒడిస్సా, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రవేశ్, సిక్కింలకు నిధులను మంజూరు చేసింది కేంద్రం.

ప్రకృతి ఏర్పరచిన నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం బుధవారం వరకు రాష్ట్రాల్లో పర్యటిస్తూనే ఉంది. వారు వెళ్ళి, కేంద్రానికి ఇచ్చే నివేదిక ఆధారంగా పరిహారాన్ని ప్రకటిస్తారని ఉభయతెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. రాజకీయంగానే సాయం అందజేస్తారని ఆశించినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పాగా వెయ్యాలని బీజేపీ అధిష్టానం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో కొండంత ఉన్న నష్టం అంచనాలను తీసుకుని, గోరంత పరిహారం ఇస్తే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు కేంద్రంపై వ్యతిరేక భావం వచ్చేందుకు అవకావం ఉంటుందని పలువురు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదారంగానే సాయం చేస్తుందని ఊహిస్తున్నారు.

రాజకీయాలను పక్కన పెడితే భారీ వర్షాలు, వరదల కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నష్టమే ఏర్పడిందన్నది ప్రాథమిక అంచనా. రోడ్లు, మౌలిక వసతులతో పాటు, దాదాపు అన్ని రకాల పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనైనా కేంద్రం ఇచ్చే సాయం దండిగానే ఉంటుందని సర్వత్రా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజల నమ్మకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంత మేరకు నిలబెట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి