iDreamPost

ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. నినాదం బాబు అక్కడా చేయిస్తారా..?!

ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. నినాదం బాబు అక్కడా చేయిస్తారా..?!

జగన్‌ పరిపాలన, నిర్ణయాలపై ప్రజలను చైతన్య వంతులను చేసేందుకంటూ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్ర పేరుతో యాత్రలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్టురులో ప్రారంభమైన ప్రజా చైతన్య యాత్ర.. ఒంగోలుకు చేరుకున్న తర్వాత కొంత విరామం తీసుకుంది. ఆ తర్వాత నిన్న, మొన్న తన సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రజా చైతన్య యాత్ర చంద్రబాబు చేశారు. ఈ యాత్రలో భాగంగా ఆయన రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. గంటల కొద్దీ ప్రసంగించిన తర్వాత.. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అనే నినాదం చేయిస్తున్నారు.

రేపు గురువారం చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళుతున్నారు. విశాఖ, విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. విశాఖలో భూ సమీకరణ బాధిత రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత విజయనగరంలో చైతన్య యాత్ర చేయనున్నారు. అయితే తన కార్యక్రమాలు, ప్రజా చైతన్య యాత్రల్లో.. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అనే నినాదం చేయిస్తున్న చంద్రబాబు.. విశాఖ, విజయనగరం పర్యటనలో కూడా ఇదే నినాదాం చేయిస్తారా..? అని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

మూడు రాజధానుల ప్రతిపాదన వల్ల విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పడబోతోంది. దీని వల్ల విశాఖతోపాటు దాని పక్కనే ఉన్న విజయనగరం జిల్లా గరీష్టంగా లబ్ధిపొందబోతోంది. మద్రాసు రాష్ట్రంలోనైనా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనైనా, ప్రస్తుతమైనా.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలేవంటే.. రాయలసీమ, ఉత్తరాంధ్ర అని ఎవరైనా ఠక్కున చెప్తారు. అలాంటి మాట ఇకపై వినపడకూడదని.. రాష్ట్రం సమతుల అభివృద్ధి జరగాలని సీఎం జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని ఆ పార్టీ నేతలు ఆది నుంచీ చెబుతున్నారు. దీన్ని చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఒకే రాజధాని ఉండాలంటున్నారు.

ప్రజా చైతన్య యాత్ర పేరుతో చంద్రబాబు అమరావతి రాజధానిని ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శస్తున్నారు. ఆయన తీరు కూడా అలానే ఉంది. మరి రేపు విశాఖ, విజయనగరం జిల్లాల్లో కూడా ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అనే అక్కడ వారితో పలికిస్తారా..? అమరావతి వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని.. విశాఖ, విజయనగరం జిల్లాల వారిని చైతన్యపరుస్తారా..? లేదంటే ఎప్పటిలాగే  విశాఖ తనకు ఇష్టమైన నగరం.. నేనే అభివృద్ధి చేశా.. అని చెబుతారా..? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి