iDreamPost

ప్రచారం పేలవం.. ప్రమాణాల ప్రహసనం

ప్రచారం పేలవం.. ప్రమాణాల ప్రహసనం

తిరుపతిలో తెలుగుదేశం పరిస్థితి నానాటికీ తీసికట్టు..నాగంబొట్లు అన్న చందంగా తయారైంది. వరుస ఎన్నికలతో కుంగిపోయిన టీడీపీని తిరుపతి ఉప ఎన్నిక ద్వారా కాస్తాయినా తట్టిలేపాలని కంకణం కట్టుకున్న పెదబాబు, చినబాబులు మొత్తం ప్రచార బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు.

లోకేష్ 15 రోజుల నుంచి, చంద్రబాబు ఎనిమిది రోజుల నుంచి కాలికి బలపం కట్టుకొని వీధి వీధి తిరిగినా ఏమాత్రం స్పందన లేకుండాపోయింది. దాంతో గత్యంతరం లేక తమ సహజసిద్ధమైన డ్రామాలకు తెరతీసి.. ఓటర్ల దృష్టిని మళ్లించేందుకు ప్రచారం చివరి దశలో నానా పాట్లు పడినా రక్తి కట్టించలేకపోయారు. ఇదే సమయంలో పార్టీ పరిస్థితి, లోకేష్ తీరుపై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో కూడిన వీడియో వెలుగులోకి వచ్చి టీడీపీ పరువును గంగలో కలిపేసింది.

చిన్న రాయితో పెద్ద రచ్చ

ఒక ఉప ఎన్నిక ప్రచారానికి మాజీ ముఖ్యమంత్రి స్థాయి నేత ప్రచారం చేయడమే అరుదు.. అదీ ఏకంగా ఎనిమిది రోజులు కేటాయించడం బహుశా ఎప్పుడూ జరిగుండదు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చాటుకొనే చంద్రబాబుకు మాత్రమే ఆ రికార్డ్ సాధ్యమైంది. టీడీపీకి జీవన్మరణ సమస్యగా మారిన ఈ ఉప ఎన్నికల్లో గెలుపు అవకాశాల్లేకపోయినా.. కనీసం గౌరవప్రదమైన ఓట్లయినా రాబట్టాలన్న లక్ష్యంతో చంద్రబాబు రోజులతరబడి మకాం వేసి వీధి వీధి తిరిగారు. ఎన్నడూ లేనివిధంగా ప్రచార వాహనం దిగి కాలినడకన దండాలు పెడుతూ ప్రచారం చేశారు.

అయినా ప్రచార సభలు, రోడ్డు షోలు జనం లేకా వెలవెలబోవడంతో.. జనసమీకరణలో స్థానిక నేతలు విఫలం కావడంతో టీడీపీ అధినేతకు దిక్కుతోచలేదు. దాంతో తన ప్రచార సభపై రాళ్ళ దాడి జరిగిందంటూ రచ్చ చేశారు. కార్యకర్తలు ఇచ్చిన ఒక చిన్న రాయి చూపిస్తూ కృష్ణాపురం పోలీస్ స్టేషన్ వద్ద, ఎస్పీ కార్యాలయం వద్ద బైఠాయించి.. ఐదు నిమిషాల్లో దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని పోలీసులపై అరుస్తూ హుంకరించారు. బాబు ఇంత రచ్చ చేసినా రాళ్ళ దాడికి సంబంధించి ఒక్క ఆధారమైన చూపలేకపోయారు. ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీల్లోనూ అటువంటి దృశ్యాలేవీ కనిపించకపోవడంతో అదంతా బాబుగారి సృష్టి అని తేలిపోయింది. సానుభూతి కోసం ఆడిన డ్రామా అని స్పష్టమయింది.

Also Read : అచ్చెన్న వీడియో ఎపిసోడ్ లో మ‌రో ట్విస్ట్

అలిపిరిలో లోకేష్ విన్యాసం..

ప్రచారంలో ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఫలితం లేక విలవిల్లాడుతున్న టీడీపీ పరువును ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో కూడిన వీడియో పూర్తిగా బజారున పడేసింది. తిరుపతిలో మకాం వేసిన అచ్చెన్న వద్దకు వచ్చిన ఆకుల వెంకటేశ్వర రావు అనే కార్యకర్త ఆర్థిక వ్యవహారాల్లో పార్టీ వల్ల తనకు జరిగిన నష్టాన్ని, కుటుంబం రోడ్డున పడిన వైనాన్ని చెప్పుకుంటూనే.. దీనిపై లోకేష్ ను కలిస్తే దొంగను చూసినట్లు చూశారని, కుటుంబమంతా కట్టగట్టుకొని ఆత్మహత్య చేసుకోండి అని నిర్లక్ష్యంగా అన్నారని ఆరోపించాడు.

దీనికి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. లోకేషే బాగుంటే పార్టీకి ఈ దుస్థితి ఎందుకు పడుతుందని అంటూ.. ఆయన అసమర్థత పార్టీని ముంచేసిందని.. ఈ నెల 17 తర్వాత టీడీపీ లేదు..ఇంకేమీ లేదు అని చేసిన వ్యాఖ్యలు లోకేష్ తో పాటు పార్టీ పరువును దిగజార్చాయి. అటు ప్రచారంలో పసలేక ఇటు వీడియోతో పరువు పోవడంతో జనాల్లో చులకన అయ్యమని భావించిన లోకేష్ .. ఉన్న ఫళంగా అలిపిరి చేరుకొని ప్రమాణాల ప్రహసనానికి తెర తీశారు. గంటల తరబడి అక్కడ బైఠాయించి వివేకానంద రెడ్డి హత్య కేసులో తమ కుటుంబానికి సంబంధం లేదని ప్రమాణం చేస్తానహో అని రంకెలు వేశారు. తనతోపాటు సీఎం జగన్ కూడా అదే మాదిరిగా ప్రమాణం చేయడానికి రావాలని డిమాండ్ చేశారు.

తిరుపతి ఎన్నికకు.. ఈ హత్యకేసుకు సంబంధమేమిటో.. సీబీఐ దర్యాప్తులో ఉన్న ఈ కేసులో నారా కుటుంబ హస్తం ఉందని ఎవరన్నారో.. ఇప్పుడీ ప్రమాణాలు ఎందుకో అర్థంకాక స్థానికులు తలలుపట్టుకున్నారు. ఇలా పలు విన్యాసాలతో బాబు, లోకేష్ జనం దృష్టిని ఆకర్షించడానికి చేసిన ప్రయత్నాలు ఓట్లు రాలుస్తాయా అన్నది అనుమానమే.

Also Read : తిరుపతి ఉప ఎన్నిక – ఫలితం మీద బెట్టింగ్ జోరు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి