iDreamPost

కేబినెట్‌ భేటీలో చర్చకు రాని స్థానిక పోరు… జగన్‌ సర్కార్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా..?

కేబినెట్‌ భేటీలో చర్చకు రాని స్థానిక పోరు… జగన్‌ సర్కార్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా..?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ నాయకులు, ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయాలను హైకోర్టు కొట్టివేయడం, 50 శాతం లోపే రిజర్వేషన్లు ఉండాలని స్పష్టం చేసిన నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనంటూ టీడీపీ, కమ్యూనిస్టులు డిమాండ్‌ చేస్తున్నారు. సుప్రిం కోర్టుకు వెళ్లాలని సూచిస్తున్నారు. తన పార్టీ నేతతోనే ఎన్నికలు వాయిదా పడేలా రిజర్వేషన్లపై న్యాయస్థానాల్లో పటిషన్లు వేయించిన టీడీపీ.. ఇప్పుడు మళ్లీ 59.85 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనంటోంది.

సమయాభావం వల్ల జగన్‌ సర్కార్‌కు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోతే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులు మురిగిపోతాయి. మరో పక్క బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు కోర్టు తీర్పులతో తగ్గుతున్నాయి. సుప్రిం కోర్టు ఆదేశాల మేరకు గత నెల 17వ తేదీ లోపునే హైకోర్టు రిజర్వేషన్లపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాల్సి ఉండగా… ఆ పని సకాలంలో పూర్తి కాలేదు. దీంతో గడువు తగ్గిపోయింది. ఒక వేళ గత నెల 17 లోపునే ప్రస్తుతం ఇచ్చిన తీర్పు ఇచ్చుంటే.. ప్రభుత్వం సుప్రిం కోర్టుకు వెళ్లే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొంది.

ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో రిజర్వేషన్లపై తీర్మానం చేసి ఎన్నికలకు వెళతారని అందరూ భావించారు. షెడ్యూల్‌లో ఓ క్లారిటీ వస్తుందనుకున్నారు. కానీ మంత్రివర్గ సమావేశంలో అందరూ ఊహించనట్లు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే గత రాత్రి పంచాయతీరాజ్‌ శాఖ రహస్య జీవోలు జారీ చేసింది. అందులో ఎన్నికలకు సంబంధించిన అంశాలే ఉంటాయన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో జగన్‌ సర్కార్‌ స్థానిక సంస్థలపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేసే విధంగా ప్రభుత్వ పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్‌ వచ్చే వరకూ రిజర్వేషన్లు, ఇతర వివరాలేవీ బయటకు పొక్కకుండా చూసుకుంటోంది. ఫలితంగా నోటిఫికేషన్‌కు ముందే రిజర్వేషన్లపై న్యాయ స్థానాలను ఆశ్రయించే అవకాశం ఇవ్వకుండా పకడ్భంధీగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

మంత్రివర్గ సమావేశం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులతో సీఎం జగన్‌ చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలుపు బాధ్యతలు వారికి అప్పగించారు. తేడాలోస్తే తీవ్ర పరిణామాలుంటాయని సీఎం హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 8వ తేదీ వరకు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని, తొమ్మిది నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని సీఎం జగన్‌ మంత్రులతో చెప్పారని సమాచారం. మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించే సమయంలోనూ మంత్రి పేర్ని నాని స్థానిక సంస్థల ఎన్నికలను ఆదర్శవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. అంటే.. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తన పని వ్యూహాత్మకంగా చేసుకుపోతున్నట్లు ఈ పరిణామాల దృష్ట్యా అర్థమవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి