iDreamPost

హైకోర్టు తీర్పును ఆర్‌కే ఓన్‌ చేసుకుంటారా..?

హైకోర్టు తీర్పును ఆర్‌కే ఓన్‌ చేసుకుంటారా..?

మేం ముందే చెప్పాం.. మేము చెప్పినట్లే జరిగింది.. మా వల్లే సాధ్యమైంది.. మేం కథనాలు రాయడంతోనే కదలిక వచ్చింది.. ఇలా కొన్ని మీడియా సంస్థలు వివిధ అంశాలను తమ ఖాతాలో వేసుకుంటుంటాయి. ఈ తరహాలో క్రెడిట్‌ను ఓన్‌ చేసుకునే తెలుగు మీడియా సంస్థల్లో ఆంధ్రజ్యోతి అగ్రస్థానంలో నిలుస్తుంది. తాజాగా దుర్గమ్మ రథానికి ఉండే సింహాల చోరీ కేసును తాము కథనాలు రాయడం ద్వారానే పోలీసులు చేధించారని ఆంధ్రజ్యోతి పత్రిక రాసుకొచ్చింది. అదే విధంగా ఫాస్టర్‌ ప్రవీణ్‌ అరెస్ట్‌ కూడా తాము కథనాలు రాయడం వల్లేనని చెప్పుకొచ్చింది. ఈ తరహాలోనే ఆ పత్రిక యజమాని వేమూరి రాథాకృష్ణ (ఆర్‌కే) కూడా అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసుపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఓన్‌ చేసుకుంటారా..? ఆదివారం రాసే కొత్తపలుకులో తాను ముందే చెప్పిన విషయం ప్రస్తావించి క్రెడిట్‌ను ఖాతా లో వేసుకుంటారా..?

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా కిలారు రాజేష్‌ సహా పలువురు భూములు కొన్నారని సీఐడీ పెట్టిన కేసులను ఈ నెల 19వ తేదీన ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనేది స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించిన వ్యవహారమని, భూ లావాదేవీలకు దీనికి సంబంధం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై కేసులు నమోదు చేసేందుకు ఐపీసీలో ఎలాంటి సెక్షన్లు లేవని పేర్కొన్నారు. అంటే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నేరం కాదనేలా న్యాయవాది వాదన తీరు ఉంది. పిటిషనర్ల న్యాయవాది వాదనతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు సీఐడీ నమోదు చేసిన కేసులు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించిన విషయాన్నే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాథా కృష్ణ (ఆర్‌కే) కొన్ని నెలల ముందే తన కొత్త పలుకులో రాసుకొచ్చారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నేరం కాదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేరని రాశారు. రాజధాని ఎక్కడ వస్తుందో ముందుగానే సమాచారం తెలుసుకుని అక్కడ భూములు కొంటే.. అది అనైతికం అవుతుంది కానీ.. చట్ట రీత్యా నేరం కాదని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్నే పిటిషనర్లు కోర్టులో వాదించిన విషయం ఇక్కడ గమనించాల్సిన విషయం. తాను చెప్పిందే నిజమైందనేలా రాబోయే ఆదివారం ఆర్‌కే తన కొత్త పలుకులో అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, ఏపీ హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ రాసుకొచ్చినా ఆశ్చర్యం లేదు.

అమరావతిలో తాము ఎలాంటి ఇన్‌సైడింగ్‌ ట్రేడింగ్‌కు పాల్పడలేదని చంద్రబాబు సహా టీడీపీ నేతలు ప్రారంభంలో వాదించారు. అవన్నీ ఆరోపణలేనని, విచారణ జరిపి నిజమని తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమనేనని సవాల్‌ చేశారు. ఆ తర్వాత సిట్, ఏసీబీ విచారణలు ఆపాలంటూ కోర్టులకు వెళ్లారు. స్టేలు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇన్‌సైడింగ్‌ ట్రేడింగ్‌ నేరం కాదని, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెట్టలేరని టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా వాదిస్తున్నాయి. హైకోర్టు కూడా సీఐడీ కేసులు కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చిన సమయంలోనూ.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనే పదం స్టాక్‌ మార్కెట్‌కు, కంపెనీలకు సంబంధించిన అంశమని పేర్కొంది. భూములు, ఇతర స్థిరాస్తి క్రయ విక్రయాలకు దీంతో సంబంధమే లేదని, ఐపీసీ నిబంధనలు వర్తించవని మాత్రమే పేర్కొంది. ఇదే ఇక్కడ గమనించాల్సిన విషయం.

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని టీడీపీ, పిటిషనర్లు చెప్పడం లేదు. కోర్టు కూడా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ భూముల క్రయ విక్రయాలకు సంబంధించినది కాదని మాత్రమే చెబుతోంది. అంతేకానీ నేరం జరగలేదని కాదు. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సుప్రిం కోర్టును ఆశ్రయించడం ఖాయమైంది. ఇలాంటి తరుణంలో ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించేలా హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ టీడీపీ నేతల ప్రకటనలు ఇప్పటికే మొదలయ్యాయి. దీనికి కొనసాగింపుగా రాబోయే ఆదివారం ఆర్‌కే తన కొత్త పలుకులో ఏం పలకబోతున్నారో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి