iDreamPost

మరో సుధాకర్ లా అనిత రాణి వ్యవహారం : సీఎం, సీఐడీపై నమ్మకం లేదట..! సీబీఐ కావాలట..!!

మరో సుధాకర్ లా అనిత రాణి వ్యవహారం : సీఎం, సీఐడీపై నమ్మకం లేదట..! సీబీఐ కావాలట..!!

చిత్తూరు జిల్లా టీబీ ఆస్పత్రిలో పని చేస్తున్న ప్రభుత్వ వైద్యురాలు అనితారాణి వ్యవహారం రోజుకో మలుపుతిరుగుతోంది. పెనుమూరు ప్రాథమిక వైద్యశాలలో పని చేస్తున్న సమయంలో వైద్యం విషయంలో వైసీపీ నేతలు తనను వేధించారంటూ ఆరోపణలు చేసిన అనితారాణీ ఇటీవల వార్తల్లో నిలిచారు. తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనితకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన టీడీపీ నేతలు అనిత, వర్ల రామయ్య ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేశారు.

అనితారాణి విషయం, టీడీపీ నేతలు మాట్లాడిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో సీఎం వైఎస్‌ జగన్‌ వెంటనే స్పందించారు. అసలు అనితారాణి వ్యవహారంలో నిజానిజాలు తేల్చాలని సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు నిన్న సీఐడీ అధికారులు చిత్తూరుకు చేరుకున్నారు. అయితే సీఐడీ విచారణపై, ముఖ్యమంత్రిపై, పోలీసులపై తనకు నమ్మకం లేదంటూ అనితారాణీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో పని చేస్తున్న ఓ వైద్యురాలు ఇలా ముఖ్యమంత్రి, రాష్ట్రప్రభుత్వం, పోలీసు, సీఐడీ విభాగాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగిస్తోంది.

ఈ వ్యవహారంలో సీబీఐ లేదా జ్యుడీషియల్‌ విచారణ జరిపితేనే తనకు న్యాయం జరుగుతుందని అనితారాణి పేర్కొంటున్నారు. సీబీఐ లేదా జ్యుడిషియల్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ సీఐడీ అధికారులు తన ఇంటి వద్దకు రావద్దని ఖరాఖండిగా చెబుతున్నారు. ఇంటికి తాళం వేసుకుని లోపలే ఉంటున్నారు.

ప్రజలతోపాటు, అధికారులకు సంబంధించి ఏ సమస్య అయినా తన దృష్టికి వస్తే సీఎం వైఎస్‌ జగన్‌ వెంటనే స్పందిస్తున్నారు. ఆయా సమస్యలు పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టినసందర్భాలున్నాయి. అయితే డాక్టర్‌ అనితారాణి తన సమస్యను సీఎం దృష్టికి తీసుకురాలేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా.. ప్రతిపక్ష పార్టీ నేతలకు చెప్పడంతో ఆమె వ్యవహారంపై అధికారులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అనితారాణి తన సమస్యను సీఎం దృష్టికి తీసుకురాకపోయినా.. మీడియా, సోషల్‌ మీడియా ద్వారాతెలుసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ వెంటనే స్పందించారు. పోలీసులు స్పందించడంలేదని ఆమె అనగా.. సీఐడీ విచారణకు ఆదేశించారు. అయినా కూడా అనితారాణి రాష్ట్ర ప్రభుత్వం, సీఎం, సీఐడీపై తనకు నమ్మకం లేదనడం వెనుక ఏదో మతలబు ఉందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అమెతో ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి పదవులను అవమానపరిచేలా చేయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విశాఖ మత్తు డాక్టర్‌ సుధాకర్‌ కూడా మాస్క్‌ల విషయంపై.. టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుని కలసి తర్వాతే ఆ విషయం వివాదాస్పదమైంది. సుధాకర్‌ సస్పెండ్‌కు గురయ్యారు. టీడీపీ నేతలు చేసిన రాజకీయంతో పోలీసులతోపాటు.. సుధాకర్‌పై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం సుధాకర్‌ మానసిక చికిత్సాలయం నుంచి డిశ్చార్జి అయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదే తరహాలో డాక్టర్‌ అనితా రాణి కూడా వ్యవహరిస్తున్నట్లు ఆమె తీరును బట్టి తెలుస్తోంది.

ప్రభుత్వం, పోలీసులపై ఆరోపణలు చేయడం, టీడీపీ నేతలను సంప్రదించడం, ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై నమ్మకం లేదంటూ సీబీఐ విచారణకు డిమాండ్‌ చేయడం వంటి పరిణామాలు చూస్తుంటే ఆమె కూడా టీడీపీ రాజకీయంలో పావుగా మారినట్లుగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డాక్టర్‌ సుధారాణి వ్యవహారం ఇప్పటికే రాజకీయ రంగు పులుముకుంది. ఇది ఏ దిశగా పయనించి ఎక్కడ ఆగుతుందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి