iDreamPost

స్థానిక సంస్థల్లో పోటీకి మీకు అర్హత ఉందా..?

స్థానిక సంస్థల్లో పోటీకి మీకు అర్హత ఉందా..?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇప్పటికే విడుదలైంది. ఈ రోజు సోమవారం నుంచీ ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. బుధవారం వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత పురపాలక ఎన్నికలు, చివరగా సర్పంచ్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 29వ తేదీలోపు ఈ ఎన్నికలు పూర్తి చేసేందుకు అవసరమైన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ ప్రకటించారు.

గ్రామ,వార్డు సచివాలయం ఏర్పాటు, ఎన్నికల్లో ధన, మద్యం ప్రభావం లేకుండా చూడడం… వంటి చర్యలతో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువత ఉత్సాహం చూపుతోంది. తమ గ్రామానికి, ప్రాంతానికి సేవ చేసేందుకు ఉత్సుకతతో ఉంది. ఈ నేపథ్యంలో సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు అర్హతలేమిటి..? ఎవరు పోటీకి అనర్హులున్న విషయం ముందు తెలుసుకోవాలి.

ఎలక్షన్‌ కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం..

– గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉండాలి.

– ఎంపీటీసీగా పోటీ చేసే వారు ఆ మండల పరిధిలో ఎక్కడైనా ఓటరుగా నమోదై ఉండాలి. జడ్పీటీసీ ఆ జిల్లా పరిధిలో ఎక్కడైనా ఓటరుగా నమోదై ఉండాలి.

– నామినేషన్‌ పరిశీలన నాటికి వయస్సు 21 సంవత్సరాలు నిండాలి.

– రిజర్వేషన్‌ ఉన్న అభ్యర్థులు(ఎస్టీ, ఎస్సీ, బీసీ) కుల ధృవీకరణ పత్రం సమర్పించాలి. అన్‌రిజర్డ్వ్‌ స్థానంలో కూడా రిజర్డ్వ్‌ అభ్యర్థులు పోటీ చేయొచ్చు. ఈ సమయంలో కుల ధృవీకరణ పత్రం అవసరం లేదు.

– 1994, మే 30కి ముందు ముగ్గురు పిల్లలు ఉన్న వారు పోటీ చేయొచ్చు. ఈ తేదీ నాటికి ముగ్గురు పిల్లలుండీ.. 1995 మే తర్వాత మరొక సంతానం కలిగితే అనర్హులు.

– 1995 మే 29 తర్వాత ఇద్దరు పిల్లలున్న వారు మాత్రమే అర్హులు.

– 1995 మే 29 తర్వాత మొదటి కాన్నులో ఒకరు తర్వాత కాన్పులో కవలలు జన్మించినా.. అర్హులవుతారు.

– 1995 మే 29వ తర్వాత ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టినా.. అర్హులవుతారు.

– ముగ్గురు పిల్లలుండీ.. ఒకరిని దత్తత ఇచ్చినా.. అనర్హులే.

– ఇప్పటికే ఇద్దరు పిల్లలుండీ.. నామినేషన్ల పరిశీలన నాటికి భార్య గర్భవతిగా ఉన్నా పోటీకి అర్హులే.

– రేషన్‌ దుకాణం డీలరు పోటీ చేయొచ్చు.

– అంగన్‌వాడీ కార్యకర్తలు పోటీకి అనర్హులు.

– దేవాదాయ శాఖ పరిధిలోని దేవాలయాల ట్రస్ట్‌ బోర్టు చైర్మన్, సభ్యులు పోటీకి అనర్హులు.

– రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అనర్హులు.

– గ్రామ పంచాయతీకి బకాయలు ఉండి.. నోటీసు ఇచ్చినా చెల్లించకపోతే పోటీకి అనర్హులు.

– నేరం కింద జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి అనర్హుడు. విడుదలైన ఐదేళ్ల తర్వాత పోటీ చేయుచ్చు.

– చెవిటి, మూగ, మతిస్థిమితం లేని వారు పోటీకి అనర్హులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి