iDreamPost

దివి రాజకీయ శకం ముగిసినట్లేనా..?

దివి రాజకీయ శకం ముగిసినట్లేనా..?

నదిలో పాతనీరు పోయేకొద్దీ కొత్తనీరు వస్తుందన్నట్లుగా.. రాజకీయాల్లోనూ పాత నేతల స్థానంలో కొత్త నేతలు రావడం సర్వసాధారణంగా జరిగేదే. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని కుటుంబాలు రాజకీయాల్లో తనదైన ముద్రవేసి ఆ తర్వాత కనుమరుగయ్యాయి. మరికొన్ని కుటుంబాలు రాణిస్తూనే ఉన్నాయి. తాజాగా మరో రాజకీయ కుటుంబం ఏపీ రాజకీయాల నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమైంది. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం రాజకీయపయనం ముగిసింది. పోయిన ఎన్నికల్లోనే పోటీకి దూరంగా ఉన్న దివి శివరాంకు రాబోయే ఎన్నికల్లోనూ టీడీపీ టిక్కెట్‌ దక్కదనే సంకేతాలు రావడంతో.. ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో కందుకూరు నియోజకవర్గంలో దివి కుటుంబ శకం ముగిసిందనే చెప్పాలి.

దివి కుటుంబానికి కందుకూరు రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. దివి శివరాం తండ్రి దివి కొండయ్య చౌదరి 1955లో తొలిసారి కందుకూరు నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెండు ఎన్నికల్లో కొండయ్య చౌదరికి కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కలేదు. ఆయన స్థానంలో నల్లమోతు చెంచురామానాయుడుకు టిక్కెట్‌ లభించింది. రెండుసార్లు చెంచురామానాయుడు గెలిచారు. 1972 ఎన్నికల్లో మూడోసారి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీచేసిన నల్లమోతు చెంచురామానాయుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ప్రస్తుత ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి తండ్రి మానుగుంట ఆదినారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈ పరిణామంతో దివి కొండయ్య చౌదరికి 1978లో మరోసారి కాంగ్రెస్‌ టిక్కెట్‌ లభించింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఈ సారి జనతా పార్టీ తరపున పోటీచేయగా.. కాంగ్రెస్‌పార్టీ తరపున పోటీచేసిన కొండయ్య చౌదరి విజయం సాధించారు. 1978 మార్చి నుంచి 1980 అక్టోబర్‌ వరకు రెండేళ్లపాటు దివి కొండయ్య చౌదరి స్పీకర్‌గా సేవలందించారు.

1983 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. 1983 ఎన్నికల్లో కొండయ్య చౌదరి టీడీపీ తరపున పోటీ చేశారు. కాంగ్రెస్‌ తరపున గుత్తా వెంకటసుబ్బయ్య పోటీ చేయగా.. మానుగుంట ఆదినారాయణ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎన్టీఆర్‌ హవాలోనూ గెలిచారు. 1983 ఎన్నికలే దివి కొండయ్య చౌదరికి చివరి ఎన్నికలు.

1985 ఎన్నికల్లో టీడీపీ తరపున గుత్తా వెంకటసుబ్బయ్య, కాంగ్రెస్‌ పార్టీ తరపున మానుగుంట ఆదినారాయణ రెడ్డిలు పోటీ చేయగా.. ఆదినారాయణ రెడ్డి విజయం సాధించారు. కొండయ్య చౌదరి, ఆదినారాయణ రెడ్డిలు చిరకాలం పాటు ప్రత్యర్థులుగా తలపడ్డారు. 1985 ఎన్నికలే ఆదినారాయణ రెడ్డికి చివరివి. ఆ తర్వాత ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి వారసుడుగా చిన్న కుమారుడైన మానుగుంట మహీధర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరపున రంగప్రవేశం చేశారు. పోటీచేసిన తొలిసారే విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున మారుబోయిన మాలకొండయ్య పోటీ చేశారు.

పార్టీ ఆవిర్భావం నుంచి వరుసగా మూడు ఎన్నికల్లోనూ టీడీపీకి కందుకూరులో విజయం దక్కలేదు. 1994 ఎన్నికల్లో దివి కొండయ్య చౌదరి వారసుడు డాక్టర్‌ శివరాం తెలుగుదేశం పార్టీ తరపున రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఈ ఎన్నికల్లో తొలిసారి మహీధర్‌ రెడ్డి, శివరాంలు రాజకీయ ప్రత్యర్థులగా తలపడ్డారు. ఈ ఎన్నికల్లో గెలిచిన శివరాం.. తొలిసారి కందుకూరులో టీడీపీ జెండా ఎగిరేలా చేశారు. ఈ ఎన్నికల తర్వాత 2009 వరకు మహీధర్‌ రెడ్డి, శివరాంలు తలపడ్డారు. 1999 ఎన్నికల్లో రెండోసారి శివరాం గెలిచారు. ఆ తర్వాత రెండు ఎన్నికల్లో (2004, 2009) మహీధర్‌ రెడ్డి విజయం సాధించారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో మహీధర్‌ రెడ్డికి కిరణ్‌కుమార్‌ కేబినెట్‌లో మంత్రిగా అవకాశం దక్కింది. రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2014 ఎన్నికలకు మహీధర్‌ రెడ్డి దూరంగా ఉన్నారు. వైసీపీ తరపున కొండపి నియోజకవర్గానికి చెందిన పోతుల రామారావు, టీడీపీ తరపున దివి శివరాంలు తలపడ్డారు. పోతుల రామారావు కాంగ్రెస్‌ పార్టీ తరపున కొండపి (2009లో ఎస్సీ రిజర్డ్వ్‌గా మారింది) ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014 వరకు డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రత్యర్థి మారినా శివరాం తలరాత మాత్రం మారలేదు. వరుసగా మూడోసారి ఓడిపోయారు. వైసీపీ తరపున గెలిచిన పోతుల రామారావు 2017లో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో శివరాంకు టిక్కెట్‌ దక్కలేదు. పోతుల రామారావు టీడీపీ తరపున, వైసీపీ అభ్యర్థిగా మానుగుంట మహీధర్‌ రెడ్డిలు పోటీ చేశారు. మహీధర్‌ రెడ్డి విజయం సాధించారు.

ఎన్నికల తర్వాత నియోజకవర్గ ఇంఛార్జి అయిన పోతుల రామారావు సైలెంట్‌ అయ్యారు. ఈ క్రమంలో దివి శివరాం టీడీపీకి పెద్దదిక్కుగా మారారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా యువతకు ప్రాధాన్యమిస్తాం.. సీనియర్లకు గౌరవమిస్తాం అంటూ.. పరోక్షంగా టిక్కెట్‌ లేదనే సంకేతాలు శివరాంకు ఇస్తున్నారు. ఇలాంటి పరిణామాలు నెలకొన్న నేపథ్యంలో… ముందుగానే గౌరవంగా తప్పుకునేందుకు శివరాం మానసికంగా సిద్ధమయ్యారు. ఇకపై పోటీ చేయబోనని తన అనుచరుల వద్ద చెబుతున్నారు.

పోతుల రామారావు రాజకీయంగా యాక్టివ్‌ అయ్యే పరిస్థితులు కనిపించకపోవడంతో కొత్త ఇంఛార్జిని నియమించే పనిలో పడ్డారు చంద్రబాబు. ఈ క్రమంలోనే ఇటీవల నియోజకవర్గ నేతలతో మంగళగిరిలో సమావేశమయ్యారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇంఛార్జి పదవికోసం ఇంటూరి రాజేష్, ఇంటూరి నాగేశ్వరరావులు పోటీ పడుతున్నారు. వీరిరువురు అన్నదమ్ముల పిల్లలు. నియోజకవర్గంలోని వలేటివారిపాలెం మండలం బడేవారి పాలెం గ్రామానికి చెందిన వీరిద్దరూ హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. ఇంటూరి నాగేశ్వరరావు 2013 ఎన్నికల్లో బడేవారిపాలెం సర్పంచ్‌గా పోటీచేసి గెలిచారు. అన్నదమ్ముల మధ్య ఇంఛార్జి పదవికోసం పోటీ నెలకొనగా.. నాగేశ్వరరావుకే శివరాం మద్ధతు ఇస్తున్నారు. పోతుల రామారావు, దివి శివరాం సహా పార్టీ క్యాడర్‌ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఇంఛార్జిని నియమిస్తామని చంద్రబాబు ఇటీవల సమావేశంలో వెల్లడించారు.

మొత్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిణామాల ద్వారా కందుకూరు నియోజకవర్గంలో దివి కుటుంబ రాజకీయ పయనం ముగిసినట్లేనని స్పష్టమవుతోంది. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయకపోయినా.. రాజకీయంగా శివరాం క్రియాశీలకంగా వ్యవహరించడం ఖాయం. ఆ క్రమంలో టీడీపీలో ఆధిపత్యపోరు కూడా కొనసాగే ప్రమాదం లేకపోలేదు. రాబోయే రోజుల్లో కందుకూరు టీడీపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి