iDreamPost

కందుకూరు మాజీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు..?

కందుకూరు మాజీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు..?

స్కందపురిగా పేరొందిన కందుకూరు రాజకీయంగా ఎప్పుడూ ప్రత్యేకమైన నియోజకవర్గమే. ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం.. నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఈ నియోజవర్గ ప్రజలకు రెండు జిల్లాల ప్రజా ప్రతనిధులు రాష్ట్ర, దేశ చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా.. స్వల్ప ఆధిక్యమే. హోరాహోరీ పోరు ఇక్కడ సాగుతుంది. కమ్మ సామాజికవర్గ ప్రాభల్యం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో.. రెడ్డి సామాజికవర్గానికి చెందిన మానుగుంట కుటుంబం ఆధిక్యతను చాటుకోవడం ప్రత్యేకం. ప్రస్తుతం కందుకూరు ఎమ్మెల్యేగా మానుగుంట మహీధర్‌ రెడ్డి ఉన్నారు. ఆయన తండ్రి మానుగుంట ఆదినారాయణ రెడ్డి కూడా ఇక్కడ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన రాజకీయ వారసుడు అయిన మహీధర్‌ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి హాయంలో పట్టణ, పురపాలక శాఖ మంత్రిగా పని చేశారు. మహీధర్‌ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

కందుకూరు నియోజకవర్గంలో దివి, మానుగుంట కుటుంబాల మధ్యే రాజకీయ పోరు సాగింది. దివి కొండయ్య చౌదరి శాసన సభ స్పీకర్‌గా పని చేశారు. ఆయన కుమారుడు డాక్టర్‌ దివి శివరాం పలుమార్లు కందూకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివి కొండయ్య చౌదరి, మానుగుంట ఆదినారాయణ రెడ్డిలు నాడు తలపడగా.. ఆ తర్వాత కాలంలో వారి వారుసులైన దివి శివరాం, మానుగుంట మహీధర్‌ రెడ్డిలు ఎమ్మెల్యే బరిలో ప్రత్యర్థులుగా నిలిచారు.

Also Read : దారుణమని ఇప్పుడు తెలిసిందా బుచ్చయ్య చౌదరి..?

అయితే దాదాపు ఐదు దశాబ్ధాల తర్వాత కందుకూరు నియోజకవర్గం నుంచి స్థానికేతరుడు ఎమ్మెల్యేగా గెలిచారు. కందుకూరు సరిహద్దు నియోజవర్గమైన కొండపికి చెందిన పోతుల రామారావు.. 2014లో వైసీపీ తరఫున బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి దివి శివరాంపై విజయం సాధించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, అప్పటి వరకు మంత్రిగా పని చేసిన మానుగుంట మహీధర్‌ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. ఎన్‌.చెంచురామానాయుడు ( 1962, 1967) తర్వాత కందుకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన స్థానికేతరుడు పోతుల రామారావే (2014).

వైసీపీ తరఫున గెలిచిన పోతుల రామరావు.. ఆ తర్వాత 2017లో అధికార టీడీపీలోకి ఫిరాయించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేశారు. 2014లో పోటీకి దూరంగా ఉన్న మహీధర్‌ రెడ్డికి ఈ సారి వైసీపీ టిక్కెట్‌ వరించింది. ఈ సారి పోటీకి దూరంగా ఉండడం దివి శివరాం వంతైంది. టీడీపీ తరఫున పోతుల రామారావు పోటీ చేయగా.. దివి శివరాం స్టాండ్స్‌కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో పోతుల రామారావు ఓటమిపాలయ్యారు.

ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నుంచి టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు పోతుల రామారావు. వ్యాపార వేత్త అయిన పోతుల రామారావు.. తిరిగి తన సమయాన్ని అంతా వ్యాపారంపై కేంద్రీకరించారు.

సొంత నియోజకవర్గం కొండపి నుంచి 2004లో పోతుల రామారావు తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కొండపి నియోజకవర్గం ఎస్సీ రిజర్డ్వ్‌ అవడంతో 2009లో ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు. అయితే నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. పోతుల రామారావుకు డీసీసీ బాధ్యతలు అప్పగించడంతోపాటు.. ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. 2014 ఎన్నికల వరకూ పోతుల రామారావు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడుగా పని చేశారు. ఆయనకు మంత్రి బాలినేని  శ్రీనివాస రెడ్డి తో సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం రాజకీయంగా పూర్తి సైలెంట్‌గా ఉన్న పోతుల రామారావు.. భవిష్యత్‌ రాజకీయ జీవితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Also Read : మాజీ మంత్రి సోమిరెడ్డిపై చీటింగ్‌కేసు.. అరెస్ట్‌ తప్పదా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి